వరం.. అస్తమయం!
ABN , First Publish Date - 2020-09-03T19:30:06+05:30 IST
శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు అంధవరపు..

మునిసిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరాహనరసింహం మృతి
కుటుంబ సభ్యుల్లో విషాదం..
నాయకులు, వ్యాపారుల దిగ్భ్రాంతి
గుజరాతీపేట(శ్రీకాకుళం): శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు అంధవరపు వరాహనరసింహం(వరం) బుధవారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమా నులు, నాయకులు, వ్యాపారులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిల్లా రాజకీయాల్లో వరం తనదైన ముద్ర వేశారు. శ్రీకాకుళం మునిసిపాలిటీలో నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాలను శాసించారు. కుటుంబ వార సత్వంగా 1980-81లో బస్సు ఓనర్‌గా ఉంటూ.. అనాటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొర్లె శ్రీరాములునాయుడు అనుచరుడిగా వరం రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1982లో పరోక్ష పద్ధతిలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల్లో ఒక ఓటు తేడాతో చైర్మన్‌గా గెలిచి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా.. వ్యక్తిగత సంబంధాలతో తనదైన ఎత్తుగడలతో ప్రత్యే కత సంతరించుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ, ఎన్టీఆర్ ప్రభంజనం ఉన్న రోజుల్లో కూడా శ్రీకాకుళం మునిసిపల్ రాజకీయాల్లో ఆయన హవా కొన సాగడం విశేషం. 1987లో ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నిక జరిగింది. అప్ప ట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్‌గా వరం రెండోసారి విజయం సాధించారు. ఎందరో రాజకీయ ప్రముఖులకు సన్నిహితంగా ఉండేవారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య తదితర ముఖ్యమంత్రులందరితో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. శ్రీకాకుళం పట్టణానికి వచ్చిన ఏడుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయన ఇంట ఆతిథ్యం స్వీకరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉండేది. పీపీసీ అధ్యక్షుడిగా పని చేసిన మజ్జి తులసీదాస్ ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో పరిచయాలు పెంచుకున్నారు. రాజకీయా లకు అతీతంగా ముఖ్యమంత్రులు, మంత్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుని శ్రీకాకుళం పట్టణ అభివృద్ధికి కృషి చేశారు.
1994లో శాసన సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1997లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్ర న్నాయుడు అనుచరుడిగా ఉండేవారు. శ్రీకాకుళం ముని సిపల్ చైర్‌పర్సన్ పదవి మహిళలకు రిజర్వ్ చేసిన తర్వాత.. టీడీపీ టిక్కెట్ తెచ్చుకొని తన కుమార్తె జయంతిని గెలిపించుకు న్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావుకు సన్నిహితంగా ఉండేవారు. 2004లో ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి పోటీ చేసినప్పుడు పరోక్షంగా సహకరించారని ప్రచారం ఉంది. 2011లో వైసీపీలో చేరారు. పట్టణ రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తూ, కళింగ వైశ్యుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం కళింగ వైశ్యుల సంఘానికి ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు. కళింగ వైశ్యులను బీసీల్లో చేర్చడానికి ఆయన చేసిన కృషి చాలా కీలకమైనది. పట్టణ వ్యాపార రంగాన్ని ఎంతో ప్రభావితం చేశారు. రాజకీయాల్లో ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటూ.. ఇంకోవైపు వ్యాపారవేత్తగా ఎదిగారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంధి మల్లిఖార్జునరావు(జీఎంఆర్) ప్రోత్సాహంతో పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టారు. వరం పవర్ ప్రాజెక్టు స్థాపించారు. వరం హస్తవాసి మంచిదని పలువురి నమ్మకం. ఆయన ఏ షాపును ప్రారంభించినా.. వ్యాపారానికి తిరుగు ఉండదని చాలామందికి నమ్మకం. ఈ క్రమంలో జిల్లాలో వేలాది దుకాణాలు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అలాగే 1985లో శ్రీకాకుళంలో వరం చేతుల మీదుగా ప్రప్రథమంగా శ్రీసత్యసాయి మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో శ్రీసత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలకు అండగా నిలిచేవారు. ఎవరితో మాట్లాడినా జిల్లా అభివృద్ధి కోసమే పరితపించేవారు. అందుకే సిక్కోలుకే ఆయన ఒక ‘వరం’గా.. జిల్లావాసుల మన్ననలు పొందారు.
సంతాపం
వరం మృతిపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయాల్లో వరం శాశ్వత ముద్ర వేశారని, ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సంతాపం తెలిపారు. రెండుసార్లు శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్‌గా సేవలందించి, నగరాభివృద్ధికి, కళింగ వైశ్యుల అభివృద్ధికి వరం నిరంతరం కృషి చేశారన్నారు. వ్యక్తిగతంగా గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానని, ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచిన ఒక ఆత్మీయ వ్యక్తి వదిలి వెళ్లడం తనను చాలా బాధిస్తోందని పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బీజేపీ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, దుప్పల రవీంద్రబాబు, రెడ్డి నారాయణరావు, చింతపల్లి దుర్గారావు గాంధీలు కూడా సంతాపం తెలిపారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు గంగుల రమణబాబు, జోనల్ కన్వీనర్ డా.లక్ష్మణరావు, జోనల్ సేవాదళ్ ఇన్‌చార్జి ఏవీ రామకృష్ణారావు, రిమ్స్ అన్నపూర్ణ సేవా సంఘం అధ్యక్షుడు ఎస్. రామచంద్రరావు, పెద్ద మందిరం కన్వీనర్ ఎ. జగ్గునాయుడు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల ఇన్‌చార్జిలు సంతాపం తెలిపారు.