స్వచ్ఛభారత్ నిధులు స్వాహా!
ABN , First Publish Date - 2020-06-18T11:23:47+05:30 IST
అధికారం అడ్డంపెట్టుకొని కొందరు ఉద్యోగులు అడ్డగోలు వ్యవహారాలకు తెర లేపుతున్నారు.

రూ.70 లక్షలు పక్కదారి
సొంత ఖాతాకు మళ్లించుకున్న ఓ ఇంజినీర్
ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
అధికార పార్టీ నేత అండతో నీరుగారిన విచారణ
ఇదీ ఆర్‌డబ్ల్యూఎస్‌లో అక్రమాల కథ
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): అధికారం అడ్డంపెట్టుకొని కొందరు ఉద్యోగులు అడ్డగోలు వ్యవహారాలకు తెర లేపుతున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలాగే, పొందూరులో ఓ ఇంజినీర్.. అధికార పార్టీకి చెందిన ఓ నేత బలం చూసుకొని స్వచ్ఛభారత్ నిధులను కాజేశాడు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పొందూరు మండలం రాపాక పంచాయతీ ఇల్లయ్యగారిపేట, వావిళ్లపల్లిపేటలో 600 మంది లబ్ధిదారుల కోసం సామూహిక మరుగుదొడ్లు నిర్మించతలపెట్టారు. ఈ గ్రామాల్లో రాతి భూములు ఎక్కువగా ఉండడంతో మరుగుదొడ్ల నిర్మాణాలను స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలన్న నిబంధనను ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఓ సహాయక ఇంజినీర్ (ఏఈ) తెరపైకి తెచ్చారు.
యూనిట్ ధరను రూ.12 వేలుగా నిర్ణయించి, సుమారు రూ.75లక్షల అంచనాలతో పనులు ప్రారంభించారు. ఆ ఇంజినీరే కాంట్రాక్టర్ అవతారమెత్తి సుమారు 430 మరుగుదొడ్ల పనులు చేపట్టారు. నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో లేదా ఒప్పందం కుదుర్చుకున్న స్వచ్ఛంద సంస్థ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. అందుకు భిన్నంగా ఆ ఇంజినీర్ పథకం ప్రకారం తన పేరుతో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా(200768582922, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఇన్ 0006216)కు రూ.లక్షలు జమయ్యేలా చేసుకున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విడతల వారీగా ఆ అధికారి రూ.70లక్షలు తన ఖాతాలో జమ చేసుకొని సొంతానికి వాడుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో జరిగింది.
అధికార పార్టీ నేత దన్ను...
నిబంధనలకు విరుద్ధంగా నిధులను పక్కదారి పట్టించిన ఇంజినీర్‌కు అధికార పార్టీకి చెందిన ఒక నేత వెన్నుదన్నుగా ఉన్నట్లు తెలిసింది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో జరిగిన అక్రమాలపై కొందరు ఆ శాఖ ఉన్నతాధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. శ్రీకాకుళంలోని ఆ శాఖకు చెందిన ఓ పెద్దాయన సహకారంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు రూ.70లక్షలను తన వ్యక్తిగత ఖాతాలో వేసుకున్న ఇంజినీర్‌పై సంబంధిత ఇంజినీరింగ్ చీఫ్‌కు ఫిర్యాదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొక్కుబడిగా విచారణ చేసి నివేదికను పంపినట్లు తెలిసింది. నిధులు కాజేసిన ఇంజినీరుకు విచారణ జరుగుతుందనే విషయం ముందుగానే తెలియడంతో ఆయన అధికార పార్టీకి చెందిన ఒక నేతతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి విచారణ నీరుగార్చినట్లు సమాచారం.
అవినీతికి అందలం....
స్వచ్ఛభారత్ నిధులను బొక్కేసిన ఇంజినీర్‌పై విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు చేపట్టాల్సింది పోయి, ఆయనకు పదోన్నతి కల్పించారు. ముఖ్య ప్రజాప్రతినిధి ద్వారా ఓ నేత తెర వెనుక నుంచి చక్రం తిప్పడంతో సదరు ఇంజినీర్‌కు సర్వశిక్షాభియాన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి లభించింది. మొత్తం వ్యవహారంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో కొందరు పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ దృష్టి సారించి విచారణ చేస్తే, మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.