అచ్చెన్న రాకతో మారిన సీను

ABN , First Publish Date - 2020-03-13T19:47:43+05:30 IST

ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న..

అచ్చెన్న రాకతో మారిన సీను

పలాస టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం 

ఆగమేఘాల మీద అభ్యర్థుల ఎంపిక

బరిలోకి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బాబూరావు 


పలాస(శ్రీకాకుళం): ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న పలాస టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. దీనికి మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడే కారణం. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఇందుకు తాను పలాసలోనే మకాం వేస్తామని, అభ్యర్థులంతా గెలుపొందడానికి చర్యలు తీసుకుంటానని, ఎవరూ భయపడవద్దని ఆయన వచ్చి భరోసా ఇచ్చారు. దీంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది.


చైర్మన్‌ అభ్యర్థి నుంచి కౌన్సిలర్ల అభ్యర్థుల వరకు ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియని అయోమయ స్థితిలో స్థానిక నేతలు ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు గురువారం ఉదయం పలాస-కాశీబుగ్గకు వచ్చారు. ఆయన రాకతో మొత్తం సీనంతా మారిపోయింది. తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం రావడంతో పాటు పోటీ చేయడానికి ముందుకు రాని అభ్యర్థులు సైతం యుద్ధానికి సిద్ధం కావడం విశేషం. అచ్చెన్నాయుడు స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అప్పటికే జాబితా సిద్ధం చేసిన మాజీ మంత్రి గౌతు శ్యామసుందరశివాజిని అడిగి అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. కొంతమంది పోటీ చేయాలా? వద్దా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు కలుగజేసుకున్నారు.


టీడీపీకి కార్యకర్తలే కొండంత అండని, వారికి అండగా ఉండే బాధ్యత మాదని భరోసా ఇచ్చారు. దాడులు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధినేత చంద్రబాబునాయుడు సైతం కార్యకర్తల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్న ప్రస్తావించారు. దీంతో అంతా పోటీకి సై అన్నారు. చైర్మన్‌ అభ్యర్థిగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావును బరిలో  నిలుపుతున్నామని, అంతా మద్దతు ఇవ్వడంతో పాటు అన్ని స్థానాలు గెలుపొందే దిశగా ప్రచారాలు చేయాలన్నారు. తనతో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి గౌతు శివాజి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా ప్రచారంలో పొల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.


గతంలో గెలిచిన విధంగానే ఈసారి 31 వార్డుల్లోనూ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వార్డుల ఎంపిక కసరత్తు చేశారు. అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. పాతవారికే ఎక్కువ అవకాశాలు ఇచ్చి కొత్తగా పార్టీ కోసం కష్టపడే వారికి ఈ దఫా టిక్కెట్ల ఇవ్వడం విశేషం. 

Updated Date - 2020-03-13T19:47:43+05:30 IST