30 గంటలు నడిసంద్రంలో..

ABN , First Publish Date - 2020-11-08T05:10:23+05:30 IST

చేపల వేటకు ఇంజిన్‌ బోటుపై సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు ఊహించని పరిణామం ఎదురైంది. వారి ఇంజిన్‌ బోటు మరమ్మతులకు గురై 30 గంటల పాటు సముద్రం మధ్యలో ఉండిపోవాల్సి వచ్చింది. తినేందుకు ఆహారం, తాగేందుకు మంచినీరు కూడా లేకపోవడంతో రాత్రంతా అలల మధ్యలో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. సాయం కోసం దేవుని వేడుకున్నారు. చివరకు వారి ప్రార్థనలు ఫలించి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

30 గంటలు నడిసంద్రంలో..
ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులతో మాట్లాడుతున్న నర్సింగరావు, తదితరులు

ఇంజిన్‌ పాడై.. ఆగిపోయిన బోటు

బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన ఐదుగురు మత్స్యకారులు

ఆహారం, నీరు కరువు

చివరకు సురక్షితంగా తీరానికి చేరుకున్న వైనం

బందరవానిపేట(గార), నవంబరు 7: చేపల వేటకు ఇంజిన్‌ బోటుపై సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు ఊహించని పరిణామం ఎదురైంది.  వారి ఇంజిన్‌ బోటు మరమ్మతులకు గురై 30 గంటల పాటు సముద్రం మధ్యలో ఉండిపోవాల్సి వచ్చింది. తినేందుకు ఆహారం, తాగేందుకు మంచినీరు కూడా లేకపోవడంతో రాత్రంతా అలల మధ్యలో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. సాయం కోసం దేవుని వేడుకున్నారు. చివరకు వారి ప్రార్థనలు ఫలించి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గార మండలం బందరువానిపేటకు చెందిన మత్స్యకారులు మైలపిల్లి పోతయ్య, రామ్మూర్తి, మైలపిల్లి పోలయ్య, పుక్కళ్ల భరత్‌, మైలపిల్లి నర్సింహులు శుక్రవారం ఉదయం ఇంజిన్‌ బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకొని తిరిగి వస్తుండగా మధ్యలో ఇంజిన్‌ చెడిపోవడంతో బోటు ముందుకు కదలలేదు. వీరితో పాటుగా చేపల వేటకు వెళ్లిన తోటి మత్స్యకారులంతా బోట్లలో ఒడ్డుకి చేరుకున్నారు. కానీ, ఆ ఐదుగురు తీరానికి చేరకపోవడంతో  కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు కొందరు పడవల్లో సముద్రంలోకి వెళ్లి.. ఆగిపోయిన బోటును బడివానిపేట సముద్ర తీరంలో గుర్తించారు. అందరూ సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 30 గంటలపాటు భోజనం, మంచినీరు లేక పడవలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఆ ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా శనివారం ఉదయం ఒడ్డుకి చేర్చారు. ఈ విషయాన్ని మెరైన్‌, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు.  వెంటనే జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు కోనాడ నర్సింగరావు, పంచాయతీ మాజీ సర్పంచ్‌ గుంతు లక్ష్మయ్య, స్థానిక పెద్దలు దుమ్ము లక్ష్మయ్య మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-11-08T05:10:23+05:30 IST