వైసీపీ జెండా పట్టుకో.. సాయం అందుకో.. అధికార పార్టీ నేత హుకుం

ABN , First Publish Date - 2020-06-22T19:58:53+05:30 IST

‘ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ జెండా పట్టుకొని తిరగండి.. ఆ తరువాతే నేతన్న నేస్తం సాయం చూస్తాం’’ అంటూ అధికార పార్టీ నేత హుకుం జారీ చేయడంపై చేనేతలు కంగుతిన్నారు.

వైసీపీ జెండా పట్టుకో.. సాయం అందుకో.. అధికార పార్టీ నేత హుకుం

కొందరు చేనేతలకు అధికార పార్టీ నేత హుకుం

రెండోవిడత నేతన్న నేస్తంలో మొండిచేయి

వలపర్లలో టీడీపీ మద్దతుదారుల పేర్ల తొలగింపు


మార్టూరు (ప్రకాశం జిల్లా) : ‘‘ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ జెండా పట్టుకొని తిరగండి.. ఆ తరువాతే నేతన్న నేస్తం సాయం చూస్తాం’’ అంటూ అధికార పార్టీ నేత హుకుం జారీ చేయడంపై చేనేతలు కంగుతిన్నారు. అసలే రెక్కాడితేగాని డొక్కాడని తమ కుటుంబాలపై అధికార పార్టీ నాయకులకు ఇంత కక్ష ఎందుకని కన్నీళ్లపర్యంతమయ్యారు. న్యాయబద్దంగా వారికందే ఆర్థిక సాయాన్ని అధికార బలంతో అడ్డుకొని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారికి ఏం చేయాలో దిక్కుతోచక బిక్కమొహాలు వేసుకుని కూర్చున్నారు. వివరాల్లోకెళ్తే...


మండలంలోని వలపర్ల గ్రామంలోని 253 మంది చేనేతలకు మొదటి విడతలో ఒక్కొక్కరికీ రూ.24 వేలు జమయ్యాయి. శనివారం ప్రారంభమైన రెండో విడతలో 239 మందికి మాత్రమే సాయం అందింది. మిగిలిన 14 మంది చేనేతలు స్థానిక ఓ అధికార పారీ నాయకుడిని కలిసి గో డువెళ్లబోసుకున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మా కు ఓటేస్తామని చెబితే ఆ తరువాత చూస్తాం అంటూ స మాధానం చెప్పడంతో ఖిన్నులయ్యారు. రెండో విడతలో  సాయం అందకపోవడానికి కారణం అధికార పార్టీ నాయకులేనని నగదు జమకాని నేతన్నలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారులంటూ కక్షపూరితంగానే తమ పేర్లు లేకుండా చేశారని వారు ఆరోపిస్తున్నారు.


అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తా: -శ్యాంప్రసాద్‌, ఎంపీడీవో

కేవలం ఆరుగురికే నేతన్న నేస్తం నుంచి సాయం అందలేదని తెలిసింది. ఈ విషయమై విచారణ జరుపుతాం. ‘నేతన్న నేస్తం’ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకట్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తా. 


టీడీపీ మద్దతుదారులమనే మాపై కక్ష: అవ్వారు శ్రీనివాసరావు, వలపర్ల 

నేను 10 ఏళ్ల నుంచి మగ్గం నేస్తున్నా. నేతన్న నేస్తంలో తొలిసారి రూ.24 వేలు వచ్చాయి. రెండో విడత రాలేదు. కావాలనే కొంతమంది నాయకులు రాకుండా చేశారు. గ్రామ వలంటీరు, సచివాలయ ఉద్యోగులను అడిగినా సరైనా సమాధానం రాలేదు. టీడీపీ మద్దతుగా ఉన్నామనే అధికార పార్టీ నాయకులు మాపై కక్ష సాధిస్తున్నారు.

Updated Date - 2020-06-22T19:58:53+05:30 IST