ఆశాజనకం

ABN , First Publish Date - 2020-07-19T11:23:09+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 2.19లక్షల హెక్టార్లు, రబీలో మరో 2.66లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి.

ఆశాజనకం

జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఎగువ నుంచి కృష్ణమ్మ పరువళ్లు

శ్రీశైలంలోకి చేరుతున్న వరదనీరు 

సాగుకు అనుకూల పరిస్థితులు


జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ రంగానికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. సీజన్‌ ఆరంభం నుంచే  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు కృష్ణా జలాలు ప్రధాన సాగునీటి వనరు కాగా ఇప్పటికే ఎగువ నదీ పరివాహకంలో వానల జోరుతో భారీగా వరద నీరు వస్తోంది. పైన ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. అలా ఒకవైపు వర్షాలు, మరోవైపు కృష్ణానదిలో ప్రవాహాలు ఆశాజనకంగా ఉండటం, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాక మొదలవ్వడం చూస్తే ప్రస్తుత సీజన్‌ పంటల సాగుకు సానుకూలంగా కనిపిస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఖరీఫ్‌ సాగు ప్రారంభమైంది. ఇప్పటికే 20వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. తొలకరి సాగు కాస్తంత జాప్యం జరిగినా ఇప్పుడు ఊపందుకోనుంది. 


ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 2.19లక్షల హెక్టార్లు, రబీలో మరో 2.66లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ప్రధానంగా మెట్ట, ఆరుతడి పంటలు అధికం కాగా మూడో వంతు విస్తీర్ణంలో సాగునీటి ఆధారిత పంటలు  వేస్తారు. ఖరీఫ్‌లో కంది, సజ్జ, పత్తి, మిర్చి, వరి ప్రధాన పంటలు కాగా జూలై రెండో పక్షం నుంచి వాటి సాగు ఊపందుకుంటుంది. వీటిలో ఎక్కువభాగం వర్షాధారమైనవే కాగా జూలై, ఆగస్టుల్లో వాటిని అధికంగా సాగుచేస్తారు.


సెప్టెం బరులో కొమ్మమూరు ఆయకట్టులోను, మరికొన్నిచోట్ల ఎత్తిపోతల ఇతర వనరుల కింద వరి సాగు జరుగుతుంది. రబీలో వరి, పొగాకు, శనగ, మిర్చి, మినుము, జొన్న మొక్కజొన్న వేస్తారు. వాటిలో శనగ కాస్తంత ఆలస్యంగా సాగుచేసినా, వరి, పొగాకు ఇతర పంటలను రబీ సీజన్‌ ఆరంభం నుంచే విస్తారంగా చేపడతారు.


కృష్ణాకు వరదతో చిగురించిన ఆశలు

మరోవైపు జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన కృష్ణానదిలో ఆశాజనక పరిస్థితి  కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా ముందస్తుగానే కృష్ణాకు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తోంది. దీంతో పైన ప్రాజెక్టుల నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని దిగువున ఉన్న శ్రీశైలం ప్రాజె క్టుకు వదులుతున్నారు. అలా ప్ర స్తుతం శ్రీశైలంలోకి లక్షా 6వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తోంది. ఆ ప్రాజెక్టు నీటిమట్టం 885 అడు గులు కాగా నీటినిల్వ సామర్థ్యం 215.81టీఎంసీలు. గతేడాది ఈ సమయానికి 31.53 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 831 అడుగుల మట్టానికి వచ్చి 51 టీఎంసీల నీరు చేరింది. గడ చిన రెండు రోజుల్లోనే 12 టీఎం సీల వరదనీరు వచ్చింది.


ప్ర స్తుతం వరదనీరు వస్తున్న తీరును చూస్తే సగటున రోజుకు 10 టీఎంసీలకుపైగా వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు తుంగభద్ర నుంచి కూడా త్వరలో శ్రీశైలంకు నీరు వచ్చే అవకాశం ఉంది. కాగాకృష్ణాలో ఎగువ నుంచి ఇలాగే వరద కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండగా శ్రీశైలం త్వరితగతిన నిండటంతోపాటు సాగర్‌కు కూ డా ముందుగానే నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్‌ డ్యాం సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా గతేడాది ఈ సమయానికి 126.63 టీఎంసీలు ఉంటే ప్ర స్తుతం 167.95 టీఎంసీలు ఉంది. తద్వారా రానున్న రోజుల్లో జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు గతేడాది లాగానే నీటి సరఫరా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


అలాగే కృష్ణా పశ్చిమడెల్టాకు ఇప్పటికే నీటి సరఫరాపై స్పష్టత ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని సముద్రానికి వదిలేస్తున్నారు. డెల్టా కాలు వలకు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఇటు వర్షాలు, అటు ఎగువ నుంచి కృష్ణాకు వస్తున్న వరద, తద్వారా కాలువలకు నీటి సరఫరాపై నమ్మకం పెరిగి ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. 


ఇప్పటివరకు పర్వాలేదు

ఖరీఫ్‌లో పంటల సాగు అధికభాగం వర్షాలు ఆధారంగా సాగనుండగా రబీలో వర్షాలతోపాటు కొమ్మమూరు, సాగర్‌ కాలువల ద్వారా వచ్చే కృష్ణానీటి ఆధారంగా జరుగుతుంది. ఈ రకంగా జిల్లాలో సాగుకు అటు వర్షాలు, ఇటు సాగునీరు రెండూ ప్రధానమే. కాగా ప్రస్తుత ఏడాది రెండింటి పరిస్థితి ఇప్పటి వరకూ  ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. జిల్లాలో జూన్‌ సాధారణ వర్షపాతం 58.0మి.మీ.కాగా ఈ ఏడాది 83.4మి.మీ. నమోదైంది. సగం మండలాల్లో భారీ వర్షాలే కురిశాయి. జూలైలో 89.7మి.మీ. సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే 89.80 మి.మీ పడింది. సగం మండలాల్లో 100మి.మీ.లకుపైగా నమోదైంది. అందులోనూ సాధారణంగా ఈసమయంలో వర్షం కాస్తంత తక్కువగా కురిసే ప్రాంతాలైన కందుకూరు, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఈసారి అధికంగా ఉంది. 

Updated Date - 2020-07-19T11:23:09+05:30 IST