5.54 లక్షల కుటుంబాలకు కొవిడ్ ఆర్థిక సహాయం
ABN , First Publish Date - 2020-04-05T10:03:33+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలుపు రేషన్ కార్డుల కలిగిన కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ శనివారం జిల్లాలో ప్రారంభం అయ్యింది.

ఒంగోలునగరం, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలుపు రేషన్ కార్డుల కలిగిన కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ శనివారం జిల్లాలో ప్రారంభం అయ్యింది. జిల్లాలోని 5,54,066 కుటుంబాలకు వలంటీర్లు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లాలో మొత్తం 8,93,779 తెలుపు రంగు రేషన్ కార్డులు ఉండగా ఈ కుటుంబాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 వంతున అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించింది.
దీంతో సెర్ప్ నుంచి రెండు రోజుల క్రితమే జిల్లాలోని మండల అభివృద్ధి అధికారుల ఖాతాలకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. వీటిని బ్యాంకుల నుంచి ఆయా మండలాల్లోని గ్రామ కార్యదర్శుల ఖాతాలకు ఎమ్డీవోలు పంపించారు. శనివారం జిల్లాలో వలంటీర్లు ఇంటింటికీ పోయి ఈ మొత్తాన్ని అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 62 శాతం తెలుపురంగు రేషన్ కార్డుదారులకు ఈ మొత్తానికి అందజేశారు. మిగిలిన కుటుంబాలకు రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. కుటుంబ యజమానికి గాని, లేదా అతని భార్యకుగాని అందజేస్తున్నారు. వీరిద్దరూ ఇంటి వద్ద లేక పోతే 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ మొతాత్తాన్ని అందజేస్తున్నారు.