వెలిగొండ ముంపు గ్రామాల్లో కరెంట్‌ నిలిపివేతపై నిరసన

ABN , First Publish Date - 2020-07-15T10:18:10+05:30 IST

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, గ్రామంలో కరెంటు నిలిపివేయడాన్ని ..

వెలిగొండ ముంపు గ్రామాల్లో కరెంట్‌ నిలిపివేతపై నిరసన

నష్టపరిహారం చెల్లించకుండా ఖాళీ చేయించే 

కుట్రపై గ్రామస్థుల ఆగ్రహం

పంటలూ ఎండిపోతాయని రైతుల ఆందోళన

సరఫరా పునరుద్ధరించకుంటే 

డ్యాం వద్ద పనులు నిలిపివేస్తామని హెచ్చరిక


కంభం(అర్థవీడు), జూలై 14 : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, గ్రామంలో కరెంటు నిలిపివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం టన్నెల్‌ వద్ద గ్రామస్థులు నిరసన తెలిపారు. అర్థవీడు మండలం కాకర్ల గ్యాప్‌ పరిధిలో ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, క్రిష్ణానగర్‌, రామలింగాపురం, సాయినగర్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశమంటూ విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శుక్రవారం జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు కాకర్ల డ్యాం పరిధిలోని ముంపు గ్రామాలను సందర్శించారు.


నష్టపరిహారం త్వరలో ఇస్తామని, వేరే ప్రాంతాల్లో పక్కాగృహాలు నిర్మించిన తరువాతనే గ్రామాలు వదిలి వెళ్లాలని చెప్పినట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఇక్కడినుంచి తురిమెళ్లకు వెళ్ళగానే విద్యుత్‌ అధికారులతో ఆ గ్రామాలలో సరఫరా నిలిపివేసి స్తంభాలు, తీగలు తొలగించాలని కలెక్టర్‌ ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. చెప్పాపెట్టకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో బత్తాయి, బొప్పాయి, టమోటా, మిరప, వరినార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారంలోపు కరెంటు సరఫరా పునరుద్ధరణ చేయకుంటే డ్యాం వద్ద జరిగే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు.


Updated Date - 2020-07-15T10:18:10+05:30 IST