బిల్లుకు చెల్లు

ABN , First Publish Date - 2020-06-04T10:05:55+05:30 IST

టీడీపీ సానుభూతిపరులే టార్గెట్‌. వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. అందుకోసం గతంలో జరిగిన పనుల బిల్లులకు ..

బిల్లుకు చెల్లు

ఎగ్గొట్టేందుకే తనిఖీలు

టీడీపీ శ్రేణులను వేధించడమే లక్ష్యం

రెండేళ్ల నాటి పనులు ఇప్పుడు పరిశీలన

తొలుత బిల్లుల నిలుపుదలకు ప్రయత్నం

చెల్లింపునకు కోర్టు ఆదేశంతో  చెకింగ్‌ మెలిక

రంగంలో తొమ్మిది ప్రత్యేక ఇంజనీరింగ్‌ బృందాలు


టీడీపీ సానుభూతిపరులే టార్గెట్‌. వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. అందుకోసం గతంలో జరిగిన పనుల బిల్లులకు ఏదో ఒక విధంగా చెల్లుచీటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారులు రెండేళ్ల తర్వాత నాణ్యతపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పఽథకం మెటీరియల్‌ కోటా నిధులతో రెండేళ్ల క్రితం చేసిన రూ.280కోట్ల విలువైన 1,150కిపైగా పనులను  ఇప్పుడు ఇంజనీరింగ్‌ అధికారులు ఊరూరూ తిరిగి పరిశీలిస్తున్నారు. తొలుత అసలు బిల్లులు చెల్లించకూడదన్న  ఆలోచనతో వ్యవహరించారు.


హైకోర్టు జోక్యంతో చెల్లింపు తప్పదని గుర్తించి రూటుమార్చారు. పనులలో అవకతవకలు జరిగాయంటూ తనిఖీల మెలిక పెట్టారు. తదనుగుణంగా రెండేళ్ల క్రితం చేసిన సీసీరోడ్లు, పలు ఇతర నిర్మాణాలను ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో  వారం, పదిరోజులుగా వివిధ ఇంజనీరింగ్‌ శాఖల పరిధిలోని క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలకు చెందిన 40మందికిపైగా అధికారులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి  ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. 


ఒంగోలు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడమే లక్ష్యంగా, వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే ప్రధానాంశంగా అడుగులు వేస్తున్న వైసీసీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామస్థాయిలోని ఆ పార్టీ శ్రేణులను టార్గెట్‌ చేసింది. గత ప్రభుత్వ కాలంలో ఉపాధి హమీ పఽథకం ద్వారా అటు కూలీలకు వేతనాలు కల్పించి, ఇటు మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి పనులు జరిగాయి. అలా 2016-17 నుంచి 2018-19 వరకు మూడేళ్లలో రూ.2వేల కోట్లకుపైగా ఉపాధి కింద వ్యయం కాగా రూ.వెయ్యి కోట్ల వరకు మెటీరియల్‌ కోటా పనులు చేశారు.


వాటిలో అధికంగా గ్రామాల్లో సిమెంట్‌ రోడ్ల్లు ఉండగా, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల ప్రహరీలు, వర్మీ కంపోస్టు, చెత్తసంపద కేంద్రాలు నిర్మాణాలు, పండ్లతోటల పెంపకం తదితర పనులు ఈ కోటా నిఽధులతో చేశారు. జిల్లాలో 2018-19 సంవత్సర కాలంలో దేశంలోనే అత్యధికంగా రూ.1,049 కోట్లమేర ఉపాధి వ్యయం జరిగింది. అందులో రూ.601 కోట్లు కూలీలకు వేతనంగా లభించగా, ఇంచుమించు రూ.429కోట్ల మేర మెటీరియల్‌ పనులు జరిగాయి. వీటిలో ఎక్కువ పనులను అప్పటి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు చేయగా వారిలో ఎక్కువమంది టీడీపీకి చెందినవారున్నారు. 


బిల్లుల చెల్లింపు ఆలస్యంతో...

మెటీరియల్‌ పనుల బిల్లులు అన్నీ అప్పట్లో చెల్లింపులు జరగలేదు. ఎన్నికలు, ఇతర కారణాలతో రూ.280కోట్లకు పైగా బ్రేక్‌ పడింది.. తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటి చెల్లింపులను నిలిపేసింది. ఇందుకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా పనులు చేసిన వారిలో అత్యధికులు టీడీపీ అనుకూలురు కావడంతో వాటిని ఆపేసినట్లు బహిరంగంగానే చర్చ జరిగింది. అయితే 2019-20 లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అనుకూలురుగా ఉన్న వారు చేస్తున్న పనులకు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరగ్గా బిల్లులు చెల్లింపు కోసం విపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా విచారించిన హైకోర్టు చెల్లింపులు చేయాల్సిందేనని ఆదేశించింది.


రెండేళ్ల తర్వాతా..

ఆ సమయంలో రాజకీయ కారణాలతో కాక పనుల్లో అవకతవకలు జరగడంతో పరిశీలన చేసి ఇచ్చేం దుకు చెల్లింపులు నిలిపివేసినట్లు పరిశీలన పూర్తయ్యాక చెల్లిస్తామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ పనుల తనిఖీలను చేపట్టింది. జిల్లాలో 1,150కిపైగా పనులకు సంబంధించి రూ.280 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌ ఉండగా ప్రస్తుతం వాటన్నింటిని ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.


ఈ పనుల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 250కిపైగా ఉండగా, కొండపిలో 230, పర్చూరు, అద్దంకిలలో కలిపి 115 ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ పనులను పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అప్పట్లో పర్యవేక్షించగా ప్రస్తుతం నాలుగైదు ఇంజనీరింగ్‌ శాఖలకు చెం దిన విజిలెన్సు విభాగం డీఈల నేతృత్వంలో తొమ్మిది బృందాలను ఇందుకోసం నియమించారు. వారంతా ఆయా ప్రాంతాల్లో గత వారం, పది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు.


భారీగా కోతలు పెట్టే యోచన

అప్పట్లో ఉన్నతాధికారులు త్వరితగతిన పనుల పూర్తికి చేసిన ఒత్తిళ్లతో కొన్నిచోట్ల హడావుడిగా పనులు పూర్తిచేసినట్లు సమాచారం. దానివల్ల కొన్ని లోటుపాట్లు కూడా జరిగినట్లు తెలుస్తుండగా ప్రస్తుత తనిఖీలలో వాటిని ప్రధానాంశాలుగా చూపి భారీగా కోతలు పెట్టే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమేకాక పనులు చేసిన రెండేళ్ల తర్వాత విజిలెన్సు తనిఖీలు నిర్వహించడం తమవారిపై కక్షసాధింపు చర్యలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తమశాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ పనులను ఇతర శాఖలకు చెందిన అధికారులతో తనిఖీలతో చేయించడాన్ని పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ తీవ్రంగా ఖండిస్తోంది. ఆందోళనకు కూడా సిద్ధమవుతోంది. 

Updated Date - 2020-06-04T10:05:55+05:30 IST