-
-
Home » Andhra Pradesh » Prakasam » Two more suspected cases
-
విదేశాల నుంచి వచ్చిన వారిపైనే గురి
ABN , First Publish Date - 2020-03-24T11:10:07+05:30 IST
కరోనా ముప్పంతా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే అంటూ జిల్లా యంత్రాంగం వారిపైనే ప్రధానంగా దృష్టిసారించింది.

మరో రెండు అనుమానిత కేసులు
పది ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు
ఒక్కో టీంలో ముగ్గురు రిమ్స్ వైద్యులు
సమాచారం అందినవెంటనే అనుమానితుడి వద్దకు వైద్యులు
జిల్లాలోని మూడు ప్రాంతాల్లో క్వారెంటైన్ వార్డులు సిద్ధం
ఒంగోలు నగరం, మార్చి 23: కరోనా ముప్పంతా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే అంటూ జిల్లా యంత్రాంగం వారిపైనే ప్రధానంగా దృష్టిసారించింది. వీరి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికి అప్పుడు పరిశీలన జరుపుతోంది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి వారి ఆరోగ్య స్థితిగతులపైనే కాకుండా వారి కుటుంబసభ్యులపై నిఘా పెంచారు. ఇప్పటివరకు జిల్లాకు విదేశాల నుంచి 507 మంది వచ్చినట్లు అధికార లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరిలో కేంద్రప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం జిల్లాకు 362మంది రాగా, పదిరోజుల క్రితం వలంటీర్ల ద్వారా గుర్తించిన వారి సంఖ్య 145మంది ఉన్నారు. మొత్తం విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లుగా గుర్తించిన 507మందిపైనా వైద్యఆరోగ్యశాఖ అధికారుల నిఘా కొనసాగుతోంది. వీరిలో ఇప్పటికే 83మందికి 28రోజుల గృహ నిర్బంధం పూర్తయ్యింది.
వీరికి కరోనా నెగటివ్‌గానే అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా 440మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి 14 రోజులు పూర్తయితే గాని గండం గట్టెక్కినట్లు కాదని వైద్యులు అంటున్నారు. కాగా విదేశాల నుంచి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో వైద్యశాఖ వర్గాల్లో ఆందోళన ఎక్కువైంది. యూరప్ నుంచి మన వాళ్ళను అక్కడి ప్రభుత్వాలు బలవంతంగా పంపించి వేస్తున్నాయి. దీంతో వారు గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే వీరి వివరాలు ఎప్పటికప్పుడు వైద్యఆరోగ్యశాఖకు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి.
రిమ్స్ నుంచి పది ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు
విదే శాల నుంచి వచ్చిన, వస్తున్న వారిలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తుండటంతో వారిని వెంటనే పరిక్షించి ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు సోమవారం కలెక్టర్ పోలా భాస్కర్ పది ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. పది టీంలకు పది ప్రత్యేక వాహనాలను కేటాయించారు. ప్రతి వాహనంలో ముగ్గురు వైద్యులు ఉంటారు. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం అందగానే వారి వద్దకే ఈ టీంలు పోయి వారిని వెంటనే పరీక్షలు జరిపి అనుమానం వస్తే వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 7729803162 నంబర్‌తో పనిచేస్తున్న కాల్ సెంటర్‌కు రోజురోజుకీ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఈ కాల్స్ ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారి గురించి తెలియజేస్తునవే. విదేశాల నుంచి వచ్చి 28రోజులు పూర్తయిన వారి గురించి కూడా ఈ కాల్ సెంటర్స్ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.
మూడుచోట్ల క్వారెంటైన్ వార్డుల ఏర్పాటు
విదేశాల నుంచి వచ్చిన వారినే లక్ష్యంగా చేసుకుని, వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించకుండా వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. కొంత మంది విదేశాల నుంచి వస్తున్న వారు ఆ విషయాన్ని దాచిపెట్టి కొద్దిరోజులు బహిరంగానే ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో తొటి పాజిటివ్ కేసుగా నమోదైన యువకుడు కూడా విదేశాల నుంచి వచ్చి ఒంగోలులో పలు ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి తిరిగినట్లు అధికారులు పరిశీలనలో వెల్లడైంది.
ఇకపై ఇలా జరగకుండా విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండటమా లేక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులకు బలవంతంగా తరలించటమా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు చెప్పినా వినకుండా కొంతమంది గృహ నిర్బంధంలోనే ఉన్నామని చెబుతూ బయట తిరుగుతున్న వారి సమాచారం కూడా తెలుస్తోంది. దీంతో ఇలాంటి వారిని బలవంతంగా పోలీసుల సహాయంతో ఐసోలేషన్‌కు గాని తరలించేందుకు వార్డులను సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ప్రాంతాల్లో వీటిని ఏ ర్పాటు చేస్తున్నారు.
రెండు అనుమానిత కేసులు నమోదు
జిల్లాలో సోమవారం మరో రెండు అనుమానిత కేసుల వివరాలు అధికారులు దృష్టికి వచ్చాయి. వీరిలో ఒకరు బేస్తవారిపేట మండలం మదన పుల్లలచెరువుకు చెందిన యువకుడు కాగా ఇంకొకరు చీమకుర్తిలో అనుమానిత లక్షణాలు కలిగి ఉన్నారని సమాచారం. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు వీరిద్దరిని పరీక్షించి వీరికి ఏ విధమైన చికిత్స అందించాలనే విషయాన్ని తేల్చనున్నారు.
మాక్‌డ్రిల్ నిర్వహించిన వైద్యులు
జిల్లా అంతటా సోమవారం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో కరోనా మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. కరోనా కేసులు నమోదు అయిన లేక అనుమానిత కేసులు వచ్చినా ఏ విధంగా స్పందించాలనే విషయమై సిబ్బందికి తగిన అ వగాహన కల్పిస్తూ ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొని సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యే దిశగా సూచనలు చేశారు.
అందరూ సహకరించాలి: డీఎంహెచ్‌ఓ
విదేశాల నుంచి ఇక్కడకు వస్తున్న వారు సామాజిక బాధ్యతతో మెలగాలి. వారి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుకోవద్దు. అధికారులకు తెలియజేసి ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి తెలిపారు. 14రోజుల పాటు వీరు బయట తిరగకుండా స్వీయ నిర్బంధంలో ఉంటే సరిపోతుందన్నారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. విదేశాల నుంచి వచ్చాక 28 రోజులు కరోనా లక్షణాలు లేకపోతే వారి నుంచి ఎలాంటి ముప్పు ఉండదని ప్రజలు తెలుసుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి గురించి అనేకమంది కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలియజేస్తున్నారన్నారు. 28రోజులు దాటిన వారి గురించి ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు.