జేసీ షన్మోహన్‌ బదిలీ

ABN , First Publish Date - 2020-05-11T11:23:28+05:30 IST

జాయింట్‌ కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ బదిలీయ్యారు. అదేసమయంలో జిల్లాకు ఇద్దరు జేసీలను ప్రభుత్వం

జేసీ షన్మోహన్‌ బదిలీ

నూతనంగా ఇద్దరు నియామకం

జేసీ-1గా వెంకట మురళి, 

జేసీ-2గా చేతన్‌ 

ఇక నుంచి జిల్లాలో ముగ్గురు జేసీలు


ఒంగోలు, మే 10 (ఆంధ్రజ్యోతి) : జాయింట్‌ కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ బదిలీయ్యారు. అదేసమయంలో జిల్లాకు ఇద్దరు జేసీలను ప్రభుత్వం కేటాయించింది. జేసీ-1గా జె. వెంకటమురళి, జేసీ-2గా టి.ఎస్‌. చేతన్‌ను నియమించింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్‌ కలెక్టర్‌ పోస్టు జిల్లాస్థాయి పాలనా యంత్రాంగంలో నెంబరు-2 స్థానంలో ఉంటుంది. గతంలో జేసీగా ఒక్కరే ఐఏఎస్‌ అధికారి ఉండేవారు.  కొన్నేళ్ల క్రితం జేసీ-2 అనే మరో పోస్టును ఏర్పాటు చేశారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారి ఆ పోస్టులు ఉండేవారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జేసీ పోస్టులను మూడు చేసింది. ప్రస్తుతం జేసీ-2గా ఉన్న పోస్టును మూడో కేటగిరీలో చేర్చి ఇప్పుడు ఉన్న హోదా అధికారులనే కొనసాగిస్తూ జేసీ-1, జేసీ-2లుగా ఐఏఎ్‌సలను నియమించింది. జేసీ-1గా ఉండే అధికారి రైతు భరోసా, రెవెన్యూ సంబంధ శాఖలను పర్యవేక్షిస్తారు.  రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం.. దాని అనుబంధ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి. అలాగే జేసీ-2గా ఉండే అధికారిని జేసీ- వీఅండ్‌డబ్ల్యూఎ్‌సఅండ్‌డీగా పిలుస్తారు. జిల్లాలో ప్రస్తుత ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, పట్టణ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, అభివృద్ధి శాఖల పర్యవేక్షణ ఈ అధికారి పరిధిలో ఉంటుంది. ఇక ఇప్పటి దాకా జేసీ-2గా ఉన్న అధికారి హోదా జేసీ-3గా మార్చారు. సదరు అధికారిని జేసీ - ఏఅండ్‌డబ్ల్యూగా పిలుస్తారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమశాఖలు ఆయన పర్యవేక్షణలో ఉంటాయి. జేసీ-1, జేసీ-2 స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. 


జిల్లాకు జేసీ-1గా నియమితులైన జె. వెంకట మురళి ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాలో ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగంలో డైరెక్టర్‌గా  పనిచేస్తున్నారు. గ్రూపు-1 ద్వారా రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చిన ఆయనకు గత ఏడాది ఐఏఎస్‌ హోదా లభించింది. జేసీ-2గా ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న టీఎస్‌ చేతన్‌ నియమితులయ్యారు. రాజస్థాన్‌కు చెందిన చేతన్‌ 2016 ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన వారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇక్కడ జేసీగా పనిచేస్తున్న సగిలి షన్మోహన్‌ బదిలీయ్యారు. గత ఏడాది జూన్‌ 27న ఇక్కడ జేసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు పదిన్నర నెలలు మాత్రమే పనిచేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలకు భూసేకరణ, కరోనా కట్టడి విధుల నిర్వహ ణ తదితర అంశాల్లో చురుగ్గా పనిచేశారు. ఆయన్ను ప్రభుత్వం పరిశ్రమలశాఖ, కామర్స్‌మంత్రిత్వ శాఖ ఎండీగా నియమించింది. 

Updated Date - 2020-05-11T11:23:28+05:30 IST