తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య

ABN , First Publish Date - 2020-12-30T05:55:25+05:30 IST

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. పలు రహదారుల్లో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు పెరిగాయి.

తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య


ఆక్రమణలతో కుచించుకుపోయిన దర్శి రోడ్లు
అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతున్న వైనం
ఇబ్బంది పడుతున్న ప్రజలు
దర్శి, డిసెంబరు 29 : పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. పలు రహదారుల్లో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆక్రమణల వలన రోడ్లు కుచించుకు పోవడంతో పాటు వాహనాలు రోడ్డు మార్జిన్‌లో పెట్టడం వలన సమస్య మరింత జఠిలం అవుతోంది. దర్శి-పొదిలి రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా మోటార్‌సైకిళ్లు చిరువ్యాపారుల బండ్లు వరుసగా పెడుతున్నారు. అందువలన వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. షాపుల ముందు యజమానులు సైడుకాల్వలపై శ్లాబులు వేసి మరింత ముందుకు వచ్చారు. లంకోజనపల్లి రోడ్డు- దర్శి-అద్దంకి రోడ్లలో కూడా ఇదే పరిస్ధితి నెలకొంది. పోలీసులు సాయంత్రం కొంతమేర ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్నా మిగిలిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంటుంది. అధికారులు అక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి
ట్రాఫిక్‌ సమస్య నివారణకు పార్కింగ్‌ ఏర్పాటు చేస్తే ఇబ్బంది తొలుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. వాహనాలను రోడ్లపక్కన వదిలి పనులు చూసుకుంటున్నారు. అందువలన సాయంత్రం వరకు అన్నీ రోడ్లలో ద్విచక్ర వాహనాలు అడ్డంగా ఉంటున్నాయి. పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేస్తే రోడ్లపై వాహనాలు అడ్డం లేకుండా ప్రక్కన పెట్టే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-12-30T05:55:25+05:30 IST