-
-
Home » Andhra Pradesh » Prakasam » traffic jam in Highway
-
హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
ABN , First Publish Date - 2020-12-27T06:55:43+05:30 IST
హైవేపై మూడు గంటలపాటు హైటెన్షన్ నెలకొంది.

భారీ వాహనం తగిలి తెగిపడిన హైటెన్షన్ తీగలు
నిలిచిపోయిన వాహనాలు
రెండు మండలాల్లో అంధకారం
ఒంగోలు(క్రైం), డిసెంబరు 26 : హైవేపై మూడు గంటలపాటు హైటెన్షన్ నెలకొంది. జాతీయరహదారిపై త్రోవగుంట ఆటోనగర్ ఫైఓవర్ వద్ద శనివారం రాత్రి హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. రాత్రి 6.30 సమయంలో ఆటోనగర్ ఫైఓవర్‌పై గుర్తుతెలియని భారీ వాహనం వేగంగా వెళుతూ తగలడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. అయితే వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. తెగిన వెంటనే త్రోవగుంట, కరువది, దేవరంపాడు సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. అదేసమయంలో సంఘమిత్ర వైద్యశాల సమీపంలో రైల్వే ఫైఓవర్ వద్ద కూడా ఒక 33 కేవీ లైన్ వైర్ తెగిపడింది. దీంతో బాలాజీనగర్, కొప్పోలు, బీరంగుంట సబ్‌స్టేషన్ పరిధిలో సరఫరా నిలిచిపోయింది. కొత్తపట్నం, ఒంగోలురూరల్ మండలాల్లోని 20 గ్రామాలకు మూడు గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే ఎఫ్‌సీఐ గోడౌన్స్ నుంచి ఉన్న రాజీవ్ గృహకల్ప, ఇందిరాకాలనీ, కొప్పోలు, బీరంగుంట పరిసర ప్రాంతాల్లో కూడా అంధకారం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవేపై వాహన రాకపోకలను నిలిపివేసి లైన్ మరమ్మతులు చేపట్టారు. రాత్రి 9.30 తర్వాత పరిస్థితిని చక్కదిద్దారు.
