కోయంబేడు కొంపముంచె

ABN , First Publish Date - 2020-05-17T10:13:56+05:30 IST

చెన్న్తెలోని కోయంబేడు మార్కెట్‌ కేంద్రంగా కరోనా వైరస్‌ ఎక్కువమందికి వ్యాప్తిచెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం

కోయంబేడు కొంపముంచె

జిల్లాలో మరో మూడు పాజిటివ్‌ కేసులు

కొత్తపట్నం మండలంలో రెండు, ఒంగోలులో ఒకటి

66కి చేరిన పాజిటివ్‌  కేసుల సంఖ్య 

12 మండలాల్లో కరోనా ప్రభావం

కంటైన్‌మెంట్‌ చర్యలు చేపట్టిన అధికారులు

ఆరెంజ్‌ జోన్‌లోకి కొత్తపట్నం మండలం


అధికారులు ఊహించిందే జరిగింది. చెన్న్తె కోయంబేడు కూరగాయల మార్కెట్‌ నుంచి జిల్లాకు వైరస్‌ వ్యాపించి ఉంటుందనే అనుమానం నిజమైంది. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం నిర్వహించిన వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఇది తేలింది. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఇద్దరికి, ఒంగోలులోని కమ్మపాలెంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 66కి చేరింది. 


శనివారం కొత్తగా వెలుగుచూసిన మూడు కేసుల్లో ఇద్దరికి రెండురోజుల క్రితం ట్రూనాట్‌ మిషన్‌పై పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరి నుంచి శ్వాబ్‌లు తీసి రిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో కూడా వీరికి పాజిటివ్‌గానే తేలింది. కమ్మపాలెం వ్యక్తికి నేరుగా వీఆర్‌డీఎల్‌ ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ప్రభుత్వం 12 మండలాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. కొత్తగా కొత్తపట్నం మండలాన్ని కూడా చేర్చింది.


ఒంగోలు నగరం, మే 16: చెన్న్తెలోని కోయంబేడు మార్కెట్‌ కేంద్రంగా కరోనా వైరస్‌ ఎక్కువమందికి వ్యాప్తిచెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ మార్కెట్‌కు మన జిల్లా నుంచి నిత్యం కూరగాయలు, పండ్లు తీసుకుపోతుంటారు. లారీల ద్వారా వ్యాపారులు వీటిని చేరవేస్తుంటారు. జిల్లాలోని మార్టూరు, ఉలవపాడు, కొత్తపట్నం, కనిగిరి, కందుకూరు, హనుమంతునిపాడు తదితర మండలాల నుంచి వ్యాపారులు కోయంబేడు వెళ్తుంటారు. ఈ నెల మొదట్లో మన జిల్లా నుంచి అక్కడకు పోయి వచ్చిన వారిని 100 మందికిపైగా గుర్తించారు. వీరిలో ఎక్కువ మందిని ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించారు. అయితే వీరికి వీఆర్‌డీఎల్‌ పరీక్షల నిర్వహించటంలో మాత్రం జాప్యం జరిగిందనే చెప్పాలి.


కోయంబేడు మార్కెట్‌కు పోయి వచ్చిన వారికి ఎక్కువ మందికి వైరస్‌ వచ్చి ఉంటుందనే సంకేతాలు అధికారులకు అందినా పూర్తిస్థాయిలో వీరికి పరీక్షలు నిర్వహించలేదు. కొత్తపట్నం మండలం రాజుపాలెంకు చెందిన ఇద్దరు ఈనెల 3న కోయంబేడు పోయి వచ్చారు. వీరికి ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. ఇలా కోయంబేడు పోయి వచ్చిన వారికి నేరుగా వీఆర్‌డీఎల్‌ పరీక్ష చేసి ఉంటే రెండు రోజులు ముందుగానే ఫలితాలు అందుబాటులోకి వచ్చేవి. తద్వారా వీరి ద్వారా ఇతరులకు ఈ వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండేది.


పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ అని తేలినా ఐసోలేషన్‌కు తరలించటంలో కూడా జాప్యం జరిగింది. వీరిని  శనివారం సాయంత్రం వరకు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోనే ఉం చారు. అంతకు ముందు కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో అంద రితోపాటే ఈ ఇద్దరిని కూడా కలిపే ఉంచారు. కోయంబేడు పోయి వచ్చిన వారికి చెందిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వీరిలో ఇంకా ఎంతమందికి పాజిటివ్‌ రావచ్చనే ఆందోళన నెలకొంది.


కేసులు లేవనుకుంటున్న సమయంలోనే...

జిల్లాలో కరోనా యాక్టివ్‌ కేసులు అంటే కరోనాతో బాధపడుతున్న వారు శుక్రవారం నాటికి ఎవరూ లేరు. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన 63 పాజిటివ్‌ కేసుల్లో అందరూ డిశ్చార్జి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు లేని జిల్లాగా ప్రకాశంను శుక్రవారం గుర్తించారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. శనివారం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


నేడు సర్వే ద్వారా అనుమానితుల గుర్తింపు

పాజిటివ్‌ కేసులు నమోదైన ఈ రెండు ప్రాంతాల్లో ఆది వారం వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి  వారికి కూడా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గ్రామాలకు పక్క పీహెచ్‌సీల నుంచి వైద్యసిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించి సర్వే చేయనున్నారు. 


రాజుపాలెం, కమ్మపాలెం  కంటైన్‌మెంట్‌

కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన కొత్తపట్నం మండలం రాజుపాలెం, ఒంగోలు నగరం కమ్మపాలెంలో అధికారులు కంటైన్మెంట్‌ చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న కమ్మపాలెం ప్రాంతంలో నిషేదాజ్ఞలను మరింత కఠినతరం చేశారు. బయట ప్రాంతాల నుం చి రాకపోకలను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటుచేసి ఈ ప్రాంతంలోని వారిని బయటకు అనుమతించడం లేదు. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొత్తపట్నం ఎస్‌ఐ శ్రీనివాసరావు గ్రామస్థులతో చర్చించారు. నిబం ధనలను విధిగా పాటించాలని కోరారు. 


12కు పెరిగిన క రోనా మండలాలు

జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. గత 21రోజులుగా కేవలం రెండు మండలాల్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. ఒంగోలు, గుడ్లూరు మండలాల్లోనే పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఒంగోలు రెడ్‌జోన్‌, గుడ్లూరు ఆరెంజ్‌ జోన్‌లో ఉండే అవకాశాలు నిన్నటివరకు ఉన్నాయి. అయితే శనివారం ఒంగోలులో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. పాజిటివ్‌ కేసులు ఇప్పటివరకు నమోదైన 11 మండలాలకు శనివారం కొత్తపట్నం మండలంలో కూడా రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో కరోనా మండలాలు 12కి చేరాయి. ఇప్పటివరకు ఒంగోలు, చీరాలు, కారంచేడు, కొరిశపాడు, చీమకుర్తి, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, కొనకనమిట్ల, పొదిలి, మార్కాపురం మండలాల్లో కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ జాబితాలో కొత్తపట్నం కూడా చేరింది.  

Updated Date - 2020-05-17T10:13:56+05:30 IST