ఇంటర్‌ పరీక్షల్లో సాంకేతికతకు పెద్దపీట

ABN , First Publish Date - 2020-03-02T11:24:37+05:30 IST

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఈ ఏడాది సాంకేతికతకు పెద్ద పీటవేశారు.

ఇంటర్‌ పరీక్షల్లో సాంకేతికతకు పెద్దపీట

విద్యార్థుల సమాచారానికి మూడు యాప్‌లు 

కాపీయింగ్‌ నిరోధానికి ‘జూమ్‌’ 


ఒంగోలువిద్య, మార్చి 1 : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఈ ఏడాది సాంకేతికతకు పెద్ద పీటవేశారు. విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని సులువుగా అందించడంతో పాటు పరీక్షల్లో కాపీయింగ్‌ నిరోధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు కొత్తగా నాలుగు యాప్‌లు రూపొందించినట్టు ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐవో వీవీ సుబ్బారావు తెలిపారు.  


విద్యార్థులకు నేరుగా హాల్‌ టికెట్లు..

విద్యార్థులు నేరుగా హాల్‌ టిక్కెట్లను  డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పించారు. గతంలో హాల్‌ టిక్కెట్లను సంబంధిత కళాశాలలకు పంపించేవారు. అయితే ఈ ఏడాది నుంచి మాన్యువల్‌ హాల్‌ టిక్కెట్లకు ఇంటర్మీడియట్‌ బోర్డు స్వస్తి పలికింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టిక్కెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండా విద్యార్థులు పరీక్షకు హాజరు  కావచ్చు. హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే  ఆర్‌ఐవోను కలిసి రూ. 2 వేల చలనా చెల్లించి సవరించుకొనే అవకాశం కల్పించారు. 


నో యువర్‌ సీట్‌..

విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో తమకు కేటాయించిన రూమ్‌, బెంచ్‌ను కూడా ముందుగానే ఈ యాప్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ నెల 4 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. 3వ తేదీ నుంచి యాప్‌ పనిచేస్తుంది. విద్యార్థులు ముందుగానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, హాల్‌టికెట్‌ నెంబరు ఎంటర్‌ చేస్తే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం, రూమ్‌, సీట్‌ నెంబరు వివరాలు తెలుస్తాయి. 


సెంటర్‌ లోకేషన్‌ యాప్‌.. 

ఈ యాప్‌ ద్వారా విద్యార్థి తాను నివశిస్తున్న ప్రాంతానికి పరీక్షా కేంద్రం ఎంతదూరంలో ఉందో తెలుసుకోవచ్చు. యాప్‌లో పరీక్షా కేంద్రం నెంబరు ఎంటర్‌ చేస్తే దూరం, సమీప మార్గాల వివరాలను తెలుసుకోవచ్చు. 


జూమ్‌ యాప్‌ 

పరీక్షల్లో కాపీయింగ్‌ నిరోధించేందుకు ప్రత్యేకంగా జూమ్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కేమేరాలకు ఆన్‌లైన్‌లో లైవ్‌ స్ర్టీమింగ్‌ సౌకర్యం కల్పించారు. నిర్వాహకులకు తెలియకుండా పరీక్షలు జరుగుతున్న తీరును విజయవాడ నుంచి బోర్డు అధికారులు, విద్యాశాఖ కార్యదర్శి, జిల్లాలో ఆర్‌ఐవో నేరుగా వీక్షించే అవకాశం ఉంది. పరీక్షా కేంద్రం గేటు వద్ద, వరండాలో ప్రశ్నా పత్రాలు ఉంచే గది, మరో కీలక ప్రాంతంలో సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తారు. 


టాస్కు ఫోర్సు బృందాలు..

 కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రాక్టికల్‌ పరీక్షల తరహాలో ఇతర జిల్లాల నుంచి ప్రభుత్వ అధ్యాపకులతో కూడిన టాస్కు ఫోర్సు బృందాలను రంగంలోకి దింపుతున్నారు. ఈ బృందాలు ఈ నెల 3 నుంచి జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించి ఎక్కడైనా పరీక్షల నిర్వహణలో వసతులు కొరత ఉంటే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులకు తెలియజేస్తారు.  

Updated Date - 2020-03-02T11:24:37+05:30 IST