కరోనా సహాయం కొందరికే ..

ABN , First Publish Date - 2020-04-07T11:04:17+05:30 IST

కరోనా సాయం కొందరికే అందింది. మరికొందరికి అందకపోవడంతో తమ సంగతేమిటని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కరోనా సహాయం కొందరికే ..

వేలాదిమంది అందని ఆర్థిక సహాయం 

కార్యాలయాల చుట్టూ  నిరుపేదల ప్రదక్షిణలు


కందుకూరు, ఏప్రిల్‌ 6:  కరోనా సాయం కొందరికే అందింది. మరికొందరికి అందకపోవడంతో తమ సంగతేమిటని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఈ సమయంలో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడకూడదన్న  ఉద్దేశంతో ఇంటికి వెయ్యి రూపాయలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం  ముందుకొచ్చింది. అయితే కొన్ని కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందడం లేదు. తెల్ల రేషన్‌ కార్డు  ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


అయితే ఆచరణ లో అమలు కావడం లేదు. డీ లిస్టులో పేరున్న కార్డుదారులకే కాకుండా సరైన గూడు కూడా లేని నిరుపేద కుటుంబాలకు కూడా అందడం లేదు.  రేషన్‌ కార్డులున్న వారిలో సరాసరి 15 శాతం కుటుంబాలకు కరోనా సాయం అందలేదు. నిధులు వచ్చినా సాంకేతిక అడ్డంకులు, వలంటీర్లు చేతివాటం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.  దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తున్నామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని భరోసా కల్పిస్తున్నారు.


ఒక్క కందుకూరు మున్సిపాలిటీలోనే  1500 కుటుంబాలకు సాయం అందకపోగా, జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య 50వేలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసరిగుంట కాలనీలో చాలామందికి కరోనా సాయం అందలేదని తెలిసింది.  కొందరికి ప్రభుత్వం  నిధులు విడుదల చేయలేదని వలంటీర్లు చెబుతున్నారు.  


పర్యవేక్షణలోపం.. పేదలకు శాపం

గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసి వారిద్వారా వలంటీర్లకు నిధులు అందిస్తున్నారు. వారిద్వారా పేదలకు వెయ్యి రూపాయలను పంపిణీ చేయాల్సి ఉంది. 

Read more