కరణం బలరాం వైసీపీలో చేరడానికి ప్రధాన కారణమిదే!

ABN , First Publish Date - 2020-03-13T11:16:10+05:30 IST

సీనియర్‌ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

కరణం బలరాం వైసీపీలో చేరడానికి ప్రధాన కారణమిదే!

మారుతున్న సమీకరణలు

టీడీపీకి చీరాల ఎమ్మెల్యే బలరాం గుడ్‌బై

సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిక 

జిల్లాలో వేడెక్కిన రాజకీయం 

తెలుగు తమ్ముళ్ల విస్మయం

ఆరా తీసిన చంద్రబాబు 

పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ 

బాలాజీకి చీరాల బాధ్యతలు 

పరిస్థితులను గమనిస్తున్న ‘ఆమంచి’ వర్గం 

మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతపై అధికార పార్టీలో తర్జనభర్జన 

అద్దంకిలో కరణం అనుచరుల పయనమెటో? 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సీనియర్‌ నాయకుడు, టీడీపీకి చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరడం స్థానిక ఎన్నికల వేడిని పెంచాయి. బలరాం నిర్ణయాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. మరోవైపు వైసీపీలోని అత్యధిక శాతం మంది ఆయన రాకను స్వాగతిస్తుండగా, ఆపార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయులు మాత్రం విస్మయానికి గురయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని పక్కన పెడితే అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయనతో ఉన్న అనుచరగణం పయనం ఎలా ఉంటుందన్న విషయం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరా తీశారు. ఆ వెంటనే పార్టీ చీరాల బాధ్యతలను యడం బాలాజీకి అప్పగించారు. 


సీనియర్‌ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయన గురువారం సీఎం సమక్షంలో వైసీపీ పంచకు చేరారు. ఇది జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామం ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ఇబ్బందికరం అయినప్పటికీ బలరాం అలాంటి నిర్ణయం తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటన్న అంశం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆయన కానీ, కుమారుడు వెంకటేష్‌ కానీ ఎవరి మీదా ఎలాంటి విమర్శలూ చేయలేదు. కేవలం చీరాల అభివృద్ధి కోసం, నియోజకవర్గంలో తనకు మద్దతిచ్చిన ప్రజల కోరిక మేరకు వైసీపీకి చేరువైనట్లు చెప్పారు. సాంకేతిక సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేగా ఉన్న బలరాం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించనప్పటికీ, ఆయన కుమారుడు మాత్రం తాను వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ మాదిరిగానే బలరాం కూడా అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా కూర్చోవాల్సి ఉంటుంది. ఆయన కుమారుడు వెంకటేష్‌ వైసీపీ నాయకుడి పాత్ర పోషించబోతున్నారు. 


నియోజకవర్గంలోని మద్దతుదారులంతా చేరిక 

నియోజకవర్గంలో బలరాంనకు మద్దతిచ్చిన, లేక టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులంతా ఆయన వెంటే నడిచారు. మాజీ మంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు లాంటి నాయకుల నుంచి కిందిస్థాయి వరకూ ముఖ్యులంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అయితే గతంలో ఆమంచి కృష్ణమోహన్‌ను వైసీపీలో చేర్చుకున్నప్పుడు కినుక వహించి టీడీపీలోకి వచ్చిన యడం బాలాజీ మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. బలరాం, ఆయన మద్దతుదారులు వైసీపీలో చేరిక కార్యక్రమానికి ఆమంచి కృష్ణమోహన్‌ కానీ, అతనితో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులు కానీ హాజరు కాలేదు. మరోవైపు ఇటీవల ఆపార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత, గతం నుంచి వైసీపీలో ఉన్న డాక్టర్‌ అమృతపాణి తదితర ముఖ్యులు బలరాంతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.


తద్వారా స్థానిక పరిస్థితుల నేపథ్యం, తనపై పోటీచేసి ఓటమి చెంది వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌తో ఏర్పడిన వైరుధ్యమే బలరాం వైసీపీలో చేరడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అందుకు  ప్రతిగా టీడీపీని దెబ్బతీసే వైపు వైసీపీ అడుగులేస్తుందన్న అనుమానాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకులతో మంచి పరిచయాలున్న బలరాంను రాబట్టుకుంటే పార్టీకి అన్ని విధాలా ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతోనే బాలినేని ఆయనపై దృష్టి పెట్టారని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా బలరాం రాక అటు వైసీపీకి ఎంతో కొంత కలిసి రానుండగా, మంత్రి బాలినేని క్రేజ్‌ను ఆపార్టీలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్‌ వద్ద పెంచింది. 


ఆరా తీసిన చంద్రబాబు, మిగిలిన ఎమ్మెల్యేలతో భేటి 

బలరాం పార్టీ మార్పు విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని మిగిలిన టీడీపీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి, ఏలూరి సాంబశివరావులతో ఆయన కొద్దిసేపు భేటీ అయ్యారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేస్తున్న వర్ల రామయ్య నామినేషన్‌ని బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉండటంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను అమరావతికి పిలిపించారు. అనంతరం చంద్రబాబు వారితో  భేటీ అయినప్పుడు ఏంటి? బలరాం అలా ఎందుకు చేశారు! అని అడిగినట్లు తెలిసింది. వెంటనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి జోక్యం చేసుకుని స్థానిక పరిస్థితుల ప్రభావం అని మా వద్ద ఉన్న సమాచారాన్ని మీ దృష్టికి తెస్తున్నామని చెప్పినట్లు  తెలిసింది. ఇలాంటి పరిణామాలు ఇంకా ఏమైనా ఉండవచ్చా అన్న విషయం కూడా వారిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.


అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లాలో పార్టీకి ఇబ్బందిలేదని, కొన్ని ప్రాంతాల్లో నాయకులు ప్రోత్సహించకపోయినా కింది స్థాయిలో క్యాడర్‌ ముందుకొచ్చి స్థానిక ఎన్నికలకు నామినేషన్లు వేశారని బాబు దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి కూర్చుని అన్ని విషయాలూ చర్చిద్దామని చంద్రబాబు వారితో అన్నట్లు తెలిసింది. 


మంత్రి బాలినేనితో మాట్లాడిన ఆమంచి 

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన వర్గీయులు తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బలరాం చేరిక కార్యక్రమానికి ఆమంచితో పాటు, ఆయన వర్గీయులంతా దూరంగా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమంచి ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా కలిశారు. అయితే వారిమధ్య బలరాం చేరిక అంశం చర్చకు వచ్చిందా? రాలేదా? అన్నది తెలియలేదు. గురువారం కూడా మంత్రి బాలినేనికి ఆమంచి ఫోన్‌చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బలరాం వైసీపీ చేరిక అంశంపైనే ఆ సందర్భంగా వారిమధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. గతంలో బలరాం, ఆమంచిల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా చీరాల నుంచి బరిలోకి దిగినప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ముదిరి పాకానపడింది. పైగా నియోజకవర్గంలోని ఆమంచి వ్యతిరేకులంతా పార్టీరహితంగా బలరాంనకు మద్దతిచ్చారు. ప్రస్తుతం కూడా అలాంటివారంతా బలరాంతోనే ఉన్నారు.


పార్టీ ఇన్‌చార్జిగా నియోజకవర్గంలో పూర్వవైభవం కోసం ఆమంచి ఇటీవల వేగం పెంచారు. ఈ నేపథ్యంలో వారిమధ్య మరింత దూరం పెరిగింది. ఇప్పుడు అనూహ్యంగా బలరాం వైసీపీలో చేరారు. దీంతో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న ఆమంచి త్వరలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరేటప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,  ప్రభుత్వ ప్రజా సంబంధాల ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బలరాంను పార్టీలో చేర్చే విషయంలో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని ముఖ్యభూమిక వహించారు. ఈ పరిస్థితుల్లో ఆమంచి ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఎలాంటి స్పందన ఉంటుందనేది వేచి చూడాలి. కృష్ణాజిల్లా గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వంశీని చేరదీసిన ముఖ్యమంత్రి జగన్‌ అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు.


ఇక్కడ ఎలాంటి పంథాను అవలంబిస్తారన్న విషయం పక్కనబెడితే పాలనాపరమైన అంశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని బలరాంనకు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలకు శుక్రవారం కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు బాధ్యతలను బలరాం, ఆమంచిలకు సంయుక్తంగా  అప్పగిస్తారా? లేక ఒక్కరికే పరిమితం చేస్తారా? అనేది చర్చనీయాంశమైంది


అద్దంకిలో అనుచరుల పయనమెటో?

అద్దంకి నియోజకవర్గంలో బలరాం అనుచరుల పయనమెటు అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గురువారం చీరాల నియోజకవర్గానికి చెందిన  ముఖ్య అనుచరులతోపాటు, చీమకుర్తికి చెందిన తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మన్నం శ్రీధర్‌  వైసీపీలో చేరారు. ప్రస్తుతానికి మిగిలిన నాయకుల్లో ఎక్కువ మంది ఆ వైపు చూడటం లేదు. బలరాం కూడా చీరాల నియోజకవర్గానికే పరిమితమై పనిచేసుకుపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. టీడీపీలోని ఒకవర్గం శ్రేణులు, నాయకులు బలరాం పార్టీ మారడాన్ని విమర్శిస్తున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు మాత్రం మౌనంగా ఉన్నారు. బలరాం పట్టుబట్టి రావాలి అంటే కొన్ని నియోజకవర్గాల్లో నుంచి కొంతమంది కిందిస్థాయి నాయకులు వైసీపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు.


అయితే ప్రస్తుతం ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలోని ఆయన అనుచరులు కూడా టీడీపీలోనే ఉండి ఎమ్మెల్యే రవికుమార్‌ వెంట నడుస్తున్నారు. అందులో కొందరు స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వారి వైఖరిలో ఏమైనా మార్పు ఉంటుందా? అందుకు బలరాం ప్రయత్నిస్తారా? అనే అంశం కీలకంగా మారింది. అయితే కొందరు నాయకులు మాకు పార్టీయే ముఖ్యమని, తాము పోటీలోనే ఉంటామని ఎమ్మెల్యే రవికుమార్‌తో చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బలరాం కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకెళ్లటం ద్వారా మంత్రి బాలినేనికి  ముఖ్యమంత్రి వద్దనేకాక వైసీపీ శ్రేణుల్లోనూ క్రేజ్‌ పెరిగింది. అయితే చీరాలలో నేతల మధ్య సమన్వయంతో పార్టీని ముందుకు నడపటం వాసుకు అగ్నిపరీక్ష కానుంది. 


యడం బాలాజీకి టీడీపీ చీరాల బాధ్యతలు 

టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను యడం బాలాజీకి ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు ఫోన్‌లో బాలాజీతో కూడా ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బాలాజీ ఓటమి చెందారు. ఆతర్వాత ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగారు. గత ఎన్నికల సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరడంతో బాలాజీ టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. చీరాలలో టీడీపీ తరఫున పోటీ చేసిన బలరాం గెలుపునకు కృషి చేయటమే గాక చంద్రబాబునూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని వార్డుల్లో నామినేషన్లు వేయించేందుకు సన్నద్ధమయ్యారు. టీడీపీని వీడనని, చీరాలలో పార్టీకి ఉన్న సత్తా ఏంటో మున్సిపల్‌ ఎన్నికల్లోనే నిరూపిస్తానని బాలాజీ ఆంధ్రజ్యోతితో  వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-03-13T11:16:10+05:30 IST