ఢీ అంటే ఢీ అంటున్న క్యాడర్‌

ABN , First Publish Date - 2020-03-12T08:25:41+05:30 IST

జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ల నామినేషన్ల దాఖలు ఘట్టం బుధవారంతో ముగిసింది.

ఢీ అంటే ఢీ అంటున్న క్యాడర్‌

ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), మార్చి 11 : జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ల నామినేషన్ల దాఖలు ఘట్టం బుధవారంతో ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 55 జడ్పీటీసీలకు 394 నామినేషన్లు దాఖలు కాగా 742 ఎంపీటీసీలకు 3,726 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికులు అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కాదు కూడదంటే జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ తదితర పార్టీల పేర్లతోనే నామినేషన్లు దాఖలు చేశారు.


అందులోను అధికార వైసీపీ నాయకులు ముందు నుంచి నిర్వహించిన ప్రలోభాలు, బెదిరింపులను పక్కకునెట్టి నామినేషన్లు దాఖలు చేయటం విశేషం. జిల్లామొత్తంగా చూస్తే అధికార పార్టీకి రెబల్స్‌ బెడద తప్పదేమో అనిపిస్తుండగా విపక్ష టీడీపీకి నాయకులు పట్టించుకోని ప్రాంతాల నుంచి కూడా మేమున్నామంటూ క్యాడర్‌ పోటీచేయటం విశేషం. జిల్లాలో తొలి నుంచి స్థానిక ఎన్నికల విషయంలో పర్చూరు, కొండపి, అద్దంకి ఎమ్మెల్యేలతో పాటు కనిగిరి పార్టీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అనంతరం ఇతర నియోజకవర్గాల్లోను పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. 


వైపాలెంలోనూ ముందుకు..

అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ అదృశ్యం కాగా డా.రవీంద్ర లాంటి వారు ఎర్రగొండపాలెం మండలంలో మాత్రమే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇంకోవైపు దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ కదిరి బాబూరావు సోమవారం పార్టీ సమావేశం నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లు లేని దుస్థితి నెలకొంది. అయితే అనూహ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాలకు టీడీపీ పేరుతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైపాలెం నియోజకవర్గంలోని మారుమూల పుల్లలచెరువు మండలంలో 15 ఎంపీటీసీలు ఉండగా 14చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మన్నేపల్లి అనే గ్రామంలో మాత్రం సర్పంచ్‌, ఎంపీటీసీ పదవిపై అటు వైసీపీలోని ఒక వర్గం, ఇటు టీడీపీ నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే పోటీచేయలేదని తెలిసింది. 


దర్శిలోనూ దూకుడు

ఇక దర్శి నియోజకవర్గం పరిస్థితి కూడా అదే తరహాలో సాగింది. ఇన్‌చార్జ్‌గా కదిరి బాబూరావు ఉండటంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దూరంగా ఉన్నారు. కదిరి బాబూరావు రంగంలోకి రావటం ఆలస్యం కాగా వచ్చిన మరుసటిరోజే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలకు, ఎక్కువ ఎంపీటీసీలకు టీడీపీ పక్షాన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసిపి జడ్‌పి ఛైర్మన్‌ అభ్యర్థి అయిన బూచేపల్లి వెంకాయమ్మ  పోటీచేస్తున్న దర్శి జడ్పీటీసీ స్థానానికి నేనున్నానంటూ తెలుగుదేశం కార్యకర్త ఒకరు నామినేషన్‌ వేయటం విశేషం. నిజానికి ఆ స్థానం నుంచి పోటీకి తెలుగుదేశం సిఫార్సు చేసిన ఒక నాయకుడు పరిస్థితులు గమనించి వెనుకడుగు వేయగా మరో యువనాయకుడు రంగంలోకి వచ్చి నామినేషన్‌ వేశారు. నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. ఇక ముందు నుంచీ పర్చూరు, అద్దంకి, కొండపితో పాటు కనిగిరి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే చురుకైన పాత్ర పోషించటం ద్వారా అభ్యర్థులు వారంతట వారు రంగంలోకి వచ్చారు.


కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులను బెదిరించి లొంగదీసుకునేందుకు అధికారపార్టీ చేసిన కుట్రలను ఛేదిస్తూ డా. ఉగ్రనరసింహారెడ్డి సారథ్యంలో అన్ని జడ్పీటీసీలకు, ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని ఎంపీటీసీలకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయటం విశేషం. రాష్ట్రంలో టీడీపీ, సీపీఐల మధ్య జరిగిన అవగాహనను గౌరవిస్తూ అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌, సంతమాగులూరు జడ్పీటీసీని సీపీఐకి కేటాయించారు. ఇక గిద్దలూరు, మార్కాపురంతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోను అటు టీడీపీ అభ్యర్థులు స్వతంత్రంగా ముందుకొచ్చి పార్టీ పేరుతో నామినేషన్‌ దాఖలు చేయటం విశేషం. 


దీటైన అభ్యర్థుల కోసం కసరత్తు

మరోవైపు వైసీపీ నాయకులు ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ముమ్మర కసరత్తు చేశారు. అయినా ఏకాభిప్రాయం రాక అనేకచోట్ల రెబల్‌ అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు తెలిసింది. ఒంగోలులో మంత్రి బాలినేని, అద్దంకిలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ కృష్ణచైతన్య, దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తదితరులు ముందస్తు వ్యూహంతో రెబల్‌ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కాకుండా చూసుకున్నట్లు తెలిసింది. కాగా ఇంకోవైపు ఇతర పార్టీలు కూడా వారికి బలమున్నచోట అభ్యర్థులను రంగంలోకి దింపాయి. రాష్ట్ర పార్టీల నిర్ణయం మేరకు తెలుగుదేశంతో ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనతో సీపీఐ కొన్ని స్థానాలలో తన అభ్యర్థులను రంగంలోకి దించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఉద్ధేశంతో సీపీఎం నాయకులు కొన్ని ప్రాంతాలలో నామినేషన్లు వేశారు. బీజేపీ నాయకులకన్నా ఎక్కువ స్థానాలలో జనసేన పక్షాన పలువురు నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ  కార్యక్రమం ముగిసేందుకు మూడు రోజులు సమయం ఉండటంతో కొందరు పోటీదారులను లోబరుచుకుని ఎక్కువస్థానాలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. మరి వారి ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది. Updated Date - 2020-03-12T08:25:41+05:30 IST