చెడు మార్గం.. చేసింది నాశనం

ABN , First Publish Date - 2020-02-12T11:52:21+05:30 IST

చెడు మార్గం పట్టిన ఇంటిపెద్ద కారణంగా ఆ కుటుంబం కకావికలమైంది. తండ్రి చేసిన తప్పునకు అభంశుభం తెలియని పిల్లలు

చెడు మార్గం.. చేసింది నాశనం

ప్రియురాలిని కాపాడబోయి భర్త

భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని భార్య 

గంటల వ్యవధిలో మృతి

అనాథలుగా మారిన పిల్లలు


అద్దంకి, ఫిబ్రవరి 11 : చెడు మార్గం పట్టిన ఇంటిపెద్ద కారణంగా ఆ కుటుంబం కకావికలమైంది. తండ్రి చేసిన తప్పునకు అభంశుభం తెలియని పిల్లలు అనాథలుగా మారారు. గంటల వ్యవధిలోనే తల్లీ తండ్రి మృతిచెందడం  వారిని కలచివేసింది. ప్రియురాలిని కాపాడబోయి భర్త మృతిచెందగా, ఎంతచెప్పినా భర్తలో మార్పు రాలేదని ఆయన మరణానికి ముందే పురుగు మందు తాగిన భార్య కూడా ప్రాణాలు విడిచింది. వివరాల్లో వెళితే..  పంగులూరు మండలం చందలూరుకు చెందిన గుంజి వేణు, ధనలక్ష్మి దంపతులు. బతుకుదెరువు కోసం గ్రామం వదిలి అద్దంకి వచ్చి పదేళ్లుగా బేల్దారి పనులు చేసుకుంటూ ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు.


వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. 3వ కుమార్తె అద్దంకిలోని హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతుంది. కుమారుడు 4వ తరగతి చదువుతున్నారు. పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో బేల్దారి పనుల కోసం వెళ్ళిన సమయంలో అక్కడ బేల్దారి పనుల కోసం వచ్చిన మల్లేశ్వరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్ళటం మానుకున్నా సంబంధం మాత్రం కొనసాగుస్తునే ఉన్నాడు. తన భర్త మారాడు అనుకున్న తరుణంలో రెండు, మూడు రోజులక్రితం అద్దంకిలో ఇద్దరు కలసిన విషయం తెలుసుకొని ధనలక్ష్మి మనస్థాపానికి గురైంది.


అదే సమయంలో ఆ ఇద్దరు సోమవారం చీమకుర్తిలో కలసి ఉన్నారన్న విషయం తెలుసుకొని తట్టుకోలేక ఇక త న భర్త ప్రవర్తనలో మార్పురాదని గ్రహించి పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అదే సమయంలో ప్రియురాలి కోసం గుండ్లకమ్మలో  దూకి వేణు మృతిచెందాడు. భర్త చనిపోయాడన్న విషయం తెలిసి మరింత ఆందోళనకు గురిచేసింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ధనలక్ష్మి చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. 

భార్య పురుగుమంద తాగిందని తెలిసి..

భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలుసుకున్న వేణు విషయాన్ని తనతో ఉన్న మల్లేశ్వరితో చెప్పాడు. ఇక ఇద్దరి మధ్య ఉన్న సంబంఽధానికి ఫుల్‌స్టాప్‌ పెడదామని చెప్పినట్లు తెలిసింది. తనను నిర్లక్ష్యం చేస్తాడేమోనన్న ఆలోచనతో బైక్‌పై వస్తూ చెప్పు కిందపడిందని చెప్పి గుండ్లకమ్మ బ్రిడ్జిపై దిగి ఆమె నదిలోకి  దూకింది. ప్రియురాలిని కాపాడేందుకు వెనుక ముందూ చూడకుండా వేణు కూడా గుండ్లకమ్మలో దూకాడు. ఈ నేపథ్యంలో మల్లేశ్వరి స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరగా, కాపాడేందుకు దూకిన వేణు మాత్రం మునిగిపోయాడు. సోమవారం సాయంత్రం 3గంటల సమయంలో ఈ సంఘటన జరగగా 5గంటల సమయానికి వేణు మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ రిస్క్యూ టీం బయటకు తీశారు. భర్త చనిపోయిన  15గంటల వ్యవధిలోనే భార్య ధనలక్ష్మి కూడా మృతిచెందింది.


నేడు ఇంకొల్లులో అంత్యక్రియలు

అద్దంకి, చందలూరులలో సొంతిల్లు లేకపోవటంతో వేణు మృతదేహానికి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి ఇంకొల్లులో నివాసం ఉంటున్న సోదరుని ఇంటికి తీసుకు వెళ్లారు. భార్య ధనలక్ష్మి మృతదేహానికి ఒంగోలులో  పోస్టుమార్టం నిర్వహించి బుధవారం ఇంకొల్లు తరలించనున్నట్లు బంధువులు తెలిపారు. బుధవారం భార్యభర్తల మృతదేహాలకు ఇంకొల్లులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అనాథలుగా మారిన పిల్లలు

వేణు, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. చిన్నకుమార్తె టెన్త్‌, కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు. వారు చదువుకునే వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వారి చదువు అర్ధంతరంగా ఆగిపోయే పరిస్థితి ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-02-12T11:52:21+05:30 IST