పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన శిద్దా రాఘవరావు.. వైసీపీలో చేరేదెవరంటే..
ABN , First Publish Date - 2020-03-14T21:05:02+05:30 IST
మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం నిజం కాదని తేలిపోయింది. ఆ విషయాన్ని శిద్దా కూడా బహిరంగంగానే తెలియజేశారు.
టీడీపీలోనే మాజీ మంత్రి శిద్దా..
ఒంగోలు (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం నిజం కాదని తేలిపోయింది. ఆ విషయాన్ని శిద్దా కూడా బహిరంగంగానే తెలియజేశారు. అయితే ఒంగోలులో ఉంటూ గ్రానైట్ రంగంలో ప్రముఖ వ్యాపారులుగా గుర్తింపు పొందిన శిద్దా హనుమంతరావు, సూర్యప్రకాశరావులు శనివారం మంత్రి బాలినేని సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిసింది. వాళ్లిద్దరు సోదరులు కావటమే కాక మాజీ మంత్రి శిద్దా అన్న కుమారులు కావటం విశేషం. వారంతా బంధువులే అయినప్పటికీ రాజకీయంగా కొందరు నాయకులతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మంత్రి బాలినేనితో శిద్దా హనుమంతరావుకు గతం నుంచి సంబంధాలున్నాయి. అయితే గత ఎన్నికల్ల్లో వారు రాజకీయంగా కూడా శిద్దా రాఘవరావునే అనుసరించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ ఇరువురు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కనిగిరి నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పామూరు మండలంలో పట్టున్న దారపనేని చంద్రశేఖర్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో మంత్రి బాలినేనిని కలిశారు. తొలుత ఆయన ఎమ్మెల్యే బలరాంను కలిసి ఆ తర్వాత బాలినేనిని కలిసినట్లు తెలుస్తుంది. పామూరు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థితో పాటు కొన్ని ఎంపీటీసీల టీడీపీ అభ్యర్థులు కూడా చంద్రశేఖర్‌తో పాటు మంత్రిని కలిశారు. వారి కలయిక పట్ల సానుకూలంగా స్పందించిన బాలినేని కనిగిరి ఎమ్మెల్యే బుర్రాకు ఫోన్ చేసి వారిని పార్టీలో చేర్చుకుని సమన్వయం చేసుకోవాలని పామూరు జెడ్పీటీసీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది.