టార్గెట్ కొండపి
ABN , First Publish Date - 2020-12-05T06:08:43+05:30 IST
కొండపి నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.

ఇటు అసమ్మతి, అటు టీడీపీ ఎమ్మెల్యే స్వామికి చెక్ పెట్టడమే లక్ష్యం
మంత్రి బాలినేనిని ర ంగంలోకి దింపిన జగన్
అవసరమైతే ఇన్చార్జ్ మార్పునకూ అవకాశం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
కొండపి నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ పార్టీలో నెలకొన్న అసమ్మతి, టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆపార్టీ విప్ అయిన డోలా బాలవీరాంజనేయ స్వామిని కట్టడి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. అందుకు అనుగుణంగా జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. కొండపిలో వైసీపీ ఇన్చార్జ్ వెంకయ్య అనుకూల, వ్యతిరేక వర్గాల వారు అనేక విషయాల్లో బహిరంగపోరు జరుపుతున్నారు. దీంతో ఇటీవల ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అసమ్మతి నేతలతో మండలాల వారీ సమావేశమై సమాచారా న్ని సేకరించారు. సీఎం దృష్టికి కూడా ఇక్కడి పరిస్థితిని తీసుకెళ్లాడని సమాచారం.
స్వామిపై సీఎం కన్ను
గత ఎన్నికల్లో రాష్ట్రంలో దళితులకు రిజర్వ్డ్ అయిన నియోజకర్గాల్లో కొండపి మినహా మిగిలిన అన్నిచోట్లా వైసీపీ గెలుపొందింది. కొండపిలో టీడీపీ తరఫున స్వామి విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వామికి ప్రాధాన్యతను పెంచి అసెంబ్లీలో విప్ పదవిని అప్పజెప్పారు. ఏవిషయంలోనైనా నిబద్ధతతో పనిచేసే స్వామి అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించటం ప్రారంభించారు. గతంలో జరిగిన సమావేశాల్లోనే సీఎం జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ స్వామి మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబును అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రజాస్వామిక పదాలతో దూషిం చిన సమయాల్లో స్వామి ముందుండి వాటిని తిప్పికొడుతూ జగన్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. ప్రస్తుత సమావేశాల్లో నూ స్వామి అనేక సందర్భాల్లో అసెంబ్లీలో టీడీపీ పక్షాన ముందుండి నడిచారు. దీంతో స్వామిని కట్టడి చేయాలన్న ఆలోచనతో వైసీపీ నేతలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కూడా అసెంబ్లీలో అదే పంథాలో వ్యవహరిస్తు న్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై దాడి ప్రారంభిం చిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ పర్యాయం అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి సందర్భంలోనూ ముందువరుసలో ఉన్నారు.
కట్టడి చేయడమే లక్ష్యం
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో దూకుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని భావించిన వైసీపీ అధిష్టానం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లామంత్రులకు సూటిగానే సూచించింది. దీంతో జిల్లాలోని పర్చూరు, అద్దంకి, కొండపిలపై దృష్టి సారించిన వైసీపీ నాయకులు అద్దంకిలో పార్టీ ఇన్చార్జ్ కృష్ణచైతన్య నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేని ఎదుర్కొనే విషయంలో అనుసరిస్తున్న పంథాపై సంతృప్తి చెందినట్లు తెలిసింది. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి టార్గెట్‌గా అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కొండపిపైనే ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొండపి వైసీపీలో నెలకొన్న విభేదాలు, ఇన్చార్జ్ పోకడ టీడీపీకి కలిసొస్తున్నాయన్న భావనకు వైసీపీ అధిష్టానం వచ్చినట్లు సమాచారం. తదనుగుణంగా వెంటనే కొండపి పరిస్థితులను చక్కదిద్ది స్వామిని కట్టడి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇన్చార్జి మార్పు ఆలోచన!
సాక్షాత్తూ సీఎం కూడా ఈ విషయంపై మంత్రి బాలినేనికి అవసరమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తదనుగుణంగా బాలినేని శుక్రవారం కొండపి విషయమై కొంత సమాచారాన్ని సేకరించుకున్నారు. ఇక నుంచి కొండపిలో ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటానని, ఎవరి పరిధిలో వారు ముందుకు సాగాలని అటు పార్టీశ్రేణులతోపాటు కొంతమంది అధికారులకు కూడా సమాచారమిచ్చినట్లు తెలిసింది. పార్టీలో అసమ్మతిని తొలగించటంతోపాటు, స్వామిని కట్టడి చేసే లక్ష్యంతో అవసరమైతే వెంకయ్యను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌కి పరిమితం చేసి నియోజకవర్గ ఇన్చార్జ్గా దీటైన నేతను రంగంలోకి తేవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది.