నిలిచిన రిజిస్ట్రేషన్‌లతో గుండెల్లో బండ
ABN , First Publish Date - 2020-12-21T05:15:55+05:30 IST
అద్దంకి పట్టణ నడిబొడ్డున సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లు పది రోజులుగా నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని భూ యజమానులు, నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు.

అద్దంకి నడిబొడ్డున 150ఎకరాల్లో
క్రయవిక్రయాలు బంద్
దేవదాయ భూమి ఉందంటూ చర్యలు
ఆందోళనలో కొనుగోలు, అమ్మకందారులు
అద్దంకి, డిసెంబరు 20 : అద్దంకి పట్టణ నడిబొడ్డున సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లు పది రోజులుగా నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని భూ యజమానులు, నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 1038 సర్వే నెంబరులో సుమారు 73.24ఎకరాల విస్తీర్ణం ఉంది. అందులో అంతర్భాగంగా 7 దేవాలయాలకు చెందిన 11.60 ఎకరాలు మాన్యం ఉంది. దేవదాయశాఖకు సంబంధించిన 11.60 ఎకరాలు సబ్ డివిజన్ కాలేదు. దీంతో 73.4 ఎకరాల విస్తీర్ణంలో నామ్ రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్న దామావారిపాలెం నుంచి పోతురాజుగండి వరకు, పాతదామావారిపాలెం, ఇస్లాంపేట, భవానీ సెంటర్‌తో పాటు దర్శి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేశారు. అదేసమయంలో ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 1096 సర్వే నెంబరులో సుమారు 64 ఎకరాల విస్తీర్ణంలో ఆకుల వారి పేరున నమోదై ఉంది. మెయిన్ రోడ్డులో కన్యకాపరమేశ్వరి దేవస్థానం సమీపం నుంచి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వెనుక ప్రాంతం, క్రాంతినగర్ (పోలీస్ స్టేషన్ పక్కరోడ్డు), కొత్తపేట తదితర ప్రాంతాలు ఉన్నాయి. కమఠేశ్వరమాన్యంలో సుమారు 12ఎకరాలలో కూడా రిజిస్ర్టేషన్‌లు గతంలోనే ఆగిపోయాయి. దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు హద్దులు గుర్తించి సబ్‌డివిజన్ చేయకపోవడంతో ఆయా సర్వే నెంబర్లలో మొత్తం క్రయ, విక్రయాలు నిలిచిపోయా యి. సుమారు దశాబ్దకాలం క్రితమే ఆయా సర్వే నెంబర్లలో క్రయ,విక్రయాలను నిలిపివేసినప్పటికీ తహసీల్దార్‌ల నుంచి ఎన్‌వోసీలు తీసుకొని ఆ ప్రాంతాల్లోని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. పది రోజుల క్రితం ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతో ఈ సర్వే నెంబర్లలోనూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే క్రయవిక్రయాలు చేసినవారి గుండెల్లో బండపడింది. అదే సమయంలో నామ్ రోడ్డు, జాతీయ రహదారి వెంట భూసేకరణ చేసిన సర్వే నెంబర్‌లను కూడా సబ్ డివిజన్ చేయకపోవటంతో ఆ ప్రాంత భూముల రిజిస్ట్రేషన్‌లకూ బ్రేక్ పడింది. అధికారులు స్పందించి దేవదాయశాఖ, ప్రభుత్వానికి చెందిన ఆయా సర్వే నెంబర్లను సబ్ డివిజన్‌లు చేసి గుర్తిస్తే మిగిలిన విస్తీర్ణంలో కొనుగోలు, అమ్మకాలకు అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.