గ్రంథాలయం అభివృద్ధి పట్టదా ?

ABN , First Publish Date - 2020-12-26T05:44:35+05:30 IST

కంభం మండలంలో పలు గ్రంథాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రస్తుతం వాటి బాగోగులు పట్టించుకోకపోవడంతో అవసాన దశకు చేరుకున్నాయి.

గ్రంథాలయం అభివృద్ధి పట్టదా ?
మూసి ఉన్న కంభం గ్రంథాలయం

పీడిస్తున్న సిబ్బంది కొరత

కంభం, డిసెంబరు 24 : కంభం మండలంలో పలు గ్రంథాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రస్తుతం వాటి బాగోగులు పట్టించుకోకపోవడంతో అవసాన దశకు చేరుకున్నాయి. పలుచోట్ల గ్రంథపాలకులు లేక ఏళ్లుగా మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల విద్యార్థులను గ్రంథాలయాలకు పంపి పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా చేయాలని సంకల్పించింది. ‘చదవడం మాకు ఇష్టం’ద్వారా ప్రతి ఆదివారం 3 నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తక పఠనం చేయాలని చెప్పింది. కంభం మండలంలో అన్ని గ్రంథాలయాలలో గ్రంథపాలకులు లేక ఏళ్ళకొద్ది మూసి ఉండడం విమర్శలకు తావిస్తోంది. కంభం శాఖ గ్రంథాలయం మారుమూల ఉండడమేకాక గ్రంథపాలకుడు లేకపోవడంతో తెరిచేవారే కరువయ్యారు. తురిమెళ్లలో గ్రంథపాలకుడు మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేయడంతో దానిని మూసివేశారు. రావిపాడు గ్రంథాలయంలో 7 సంవత్సరాలుగా గ్రంథపాలకుడు లేడు. వీటిలో ఎన్నో పుస్తకాలు, నిఘంటువులు ఉన్నాయి. ఎవరూ వినియోగించకుండా దుమ్ముపట్టి ఉన్నాయి. కందులాపురం  కూడలిలో సుబ్బయ్య కాంప్లెక్స్‌లో గని వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయుడు తన తండ్రి గని వెంకటయ్య పేరిట స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, విద్యార్థులు ఈ గ్రంథాలయం వైపు వెళుతున్నారు. ఏడాదికోసారి వారోత్సవాల పేరిట హడావిడి చేసేకన్నా గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, గ్రంథపాలకులను నియమించాలని ప్రజలు కోరతున్నారు. 

Updated Date - 2020-12-26T05:44:35+05:30 IST