టంగుటూరు ఎస్సైపై వేటు

ABN , First Publish Date - 2020-12-01T06:25:35+05:30 IST

అమ్మాయి డాక్టరు.... అబ్బాయి ఇంజనీరింగ్‌ చదువుకున్నారు. వారిద్దరూ బంధువులు. పైగా మేజర్లు. మనసులు కలిశాయి.

టంగుటూరు ఎస్సైపై వేటు
టంగుటూరు ఎస్సై శ్రీనివాసరావు

ప్రేమ పెళ్లి చేసుకున్న మేజర్లు

అబ్బాయిని రిమాండ్‌కు పంపిన వైనం

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సీరియస్‌

ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

విచారణాధికారిగా దిశా డీఎస్పీ

ఒంగోలు (క్రైం), నవంబరు 30 : అమ్మాయి డాక్టరు.... అబ్బాయి ఇంజనీరింగ్‌ చదువుకున్నారు. వారిద్దరూ బంధువులు. పైగా మేజర్లు. మనసులు కలిశాయి. ఇద్దరూ తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నేరమైంది. పోలీసుల సహకారంతో అబ్బాయిపైన కేసు బనాయించి జైలుకు పంపారు. దీంతో నా భర్తను జైలుకు పంపించడం అన్యాయమని యువతి ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి కన్నీరుపెట్టుకుంది. స్పందించిన ఎస్పీ  టంగుటూరు ఎస్సై మాతంగి శ్రీనివాసరావును వీఆర్‌కు పిలిపించారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంకు చెందిన భార్గవి, ఒంగోలు నగరంలోని కమ్మపాలెంకు చెందిన స్వయంపు మహేష్‌లు ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా గత నెలలో వివాహం చేసుకున్నారు. అందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ జంట రక్షణ కోసం నేరుగా పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు దిశా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వారిని టంగుటూరు ఎస్సై తీసుకెళ్లాడు. అక్కడ భార్గవి చెప్పే మాటలు వినకుండా ఆమె భర్త మహేష్‌పై కేసు బనాయించాడు. భార్గవి మానసిక రోగి అని ఆమెను మహేష్‌ మోసం చేసి బలవంతగా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని, బంగారం ఎత్తుకెళ్ళాడని కేసు నమోదు చేసి మహేష్‌ను రిమాండ్‌కు పంపించారు. దీంతో భార్గవి, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి.అరుణతో కలిసి సోమవారం స్పందన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ను కలిసి జరిగిన విషయం తెలిపింది.  తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. మేజర్లు ఇష్టపడి వివాహం చేసుకుంటే కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్వక్తం చేశారు. వెంటనే టంగుటూరు ఎస్సై శ్రీనివాసరావును వీఆర్‌కు పిలుస్తూ ఆదేశాలు జారీచేశారు. అంతే కాకుండా కేసుపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని దిశ డీఎస్పీని ఆదేశించారు. టంగుటూరు ఎస్‌ఐగా ఒంగోలు ఐటీ కోర్‌లో పని చేస్తున్న ఎస్‌.కె. నాయబ్‌ రసూల్‌ను నియమించారు. 


Updated Date - 2020-12-01T06:25:35+05:30 IST