ఆమెను చంపేశారా?
ABN , First Publish Date - 2020-12-20T07:00:15+05:30 IST
ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లె రోడ్డులో శుక్రవారం జరిగిన వలంటీర్ భువనేశ్వరి సజీవ దహనం మిస్టరీ వీడలేదు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దివ్యాంగురాలి సజీవ దహనంపై అనుమానాలు
తన కుమార్తెది హత్యేనంటున్న తల్లి
పోలీసుల అదుపులో ఇరువురు అనుమానితులు
న్యాయం చేయాలన్న దళిత సంఘాలు
విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
ఒంగోలు(క్రైం), డిసెంబరు 19 : ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లె రోడ్డులో శుక్రవారం జరిగిన వలంటీర్ భువనేశ్వరి సజీవ దహనం మిస్టరీ వీడలేదు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగి 24గంటలు దాటినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మృతురాలి ఫోన్‌లోని వాట్సాప్ స్టేటస్‌లో తాను ఇక అందుబాటులో ఉండనని పేర్కొంది. ఘటనా స్థలంలో మృతదేహం ఉన్న పరిస్థితి, పరిసర ప్రాంతాల్లో దొరికిన ఆధారాలను పరిశీలిస్తే మృతురాలు ట్రైసైకిల్‌లో కూర్చుని దహనమైనట్లు తెలుస్తోంది. ప్రాణం ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్టయితే ఆమెకు నిప్పంటుకున్న తర్వాత బాధకు తట్టుకోలేక అక్కడి నుంచి కిందకు దిగాలి. అయితే ఆమె దివ్యాంగురాలు కావడం వల్ల కనీసం స్థానచలనమైనా కలిగి ఉండాలి. అలాంటిది ఏమీ లేదు. ట్రైసైకిల్ వెనుక భాగం అసలు కాల లేదు. ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు కూడా ఆమె వినియోగించే రెండు ఫోన్ల కాల్‌డేటాను విశ్లేషణ చేస్తున్నారు. అంతేకాక ఆమె చివరగా వాట్సాప్‌లో మాట్లాడిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తరచుగా భువనేశ్వరిని ఆటోలో తీసుకెళ్లి బయట తిప్పే యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాంకేతికపరంగా సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీని అధ్యయనం చేస్తున్నారు. కమ్మపాలెం నుంచి దశరాజుపల్లె వెళ్లే రోడ్డులో ఉన్న పవర్ స్టేషన్ వద్ద ట్రైసైకిల్ ముందుకు కదలకపోతే ఓ వ్యక్తి సహకరించి నెట్టినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. కాగా భువనేశ్వరిని హత్య చేసి ముళ్లపొదల్లోకి నెట్టి కాల్చేశారని దివ్యాంగుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తన బిడ్డ ధైర్యవంతురాలని ఆత్మహత్య చేసుకోదని ఎవరో హత్య చేశారని ఆమె తల్లి జానకి వాపోయింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి. రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు.
24గంటల్లో నేరస్థులను శిక్షించాలి
దివ్యాంగురాలిని హతమార్చి దహనం చేసిన దోషులను 24గంటల్లో శిక్షించాలని, లేకుంటే డీజీపీ కార్యాలయం ఎదుట తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులపై దాడులు అధికమయ్యాయని, నెల్లూరులో దివ్యాంగురాలైన ఒక ఉద్యోగిపై దాడి జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదని తెలిపారు. మృతురాలు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బాధిత కుటుంబానికి దళిత సంఘాల సంఘీభావం
మృతురాలి కుటుంబానికి దళితసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి భువనేశ్వరి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు సృజన మాదిగ డిమాండ్ చేశారు. ఇంకా ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపిన వారిలో బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు తాటిపర్తి వెంకటస్వామి, దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు తదితరులు ఉన్నారు.
