సమయానికి రారు.. వచ్చినా పనిచేయరు...!

ABN , First Publish Date - 2020-07-18T11:07:45+05:30 IST

మండలంలోని సచివాలయాల పనితీరు ఆదిలోనే హంసపాదుగా మారింది. మండలంలో 15 గ్రామ సచివాలయాలు ఉన్నాయి.

సమయానికి రారు.. వచ్చినా పనిచేయరు...!

వలేటివారిపాలెం మండలంలో

గ్రామ సచివాలయాల పని తీరిది

సర్వర్‌ ఓపెన్‌ కావడం లేదు మీసేవ కేంద్రాలకు 

వెళ్లాలని ఉద్యోగుల సూచన

ఉసూరుమంటూ వెనుదిరుగుతున్న అవసరార్థులు


వలేటివారిపాలెం, జూలై 17 : మండలంలోని సచివాలయాల పనితీరు ఆదిలోనే హంసపాదుగా మారింది. మండలంలో 15 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 83మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో చాలామంది సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో కూడా తెలియడం లేదు. ఉదయం 10.30కు విధులకు హాజరుగావాల్సిన ఉద్యోగులు 11గంటలైనా రావడంలేదు. అప్పటివరకూ వేచిచూసిన అవసరార్థులు ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్తున్నారు. ఆ తర్వాతైనా వచ్చిన ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తారా అంటే అదీ లేదు. సర్వర్‌ లేదు, ధ్రువీకరణ పత్రాలు అప్‌డేట్‌ కావడం లేదు, మీసేవ కేంద్రాల్లో అప్‌డేట్‌ చేయించుకోండి అంటూ సాకులు చెబుతూ పంపిస్తున్నారు.


సచివాలయంలో ఓపెన్‌ కాని సర్వర్‌ మీసేవ కేంద్రాల్లో ఎలా పనిచేస్తుందో వారే చెప్పాలి. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు అల్లాడిపోతున్నారు. రేషన్‌ కార్డులో మార్పులు చేర్పులు చేయడం లేదు. అనేక కుటుంబాలు అర్హత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విస్తృత తనిఖీలు చేసి ఉద్యోగులను గాడిలో పెట్టి ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-07-18T11:07:45+05:30 IST