భయంగానే బడికి..
ABN , First Publish Date - 2020-11-03T17:03:03+05:30 IST
కొవిడ్ భయం.. సుదీర్ఘ విరామం తర్వాత 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సోమవారం పాఠశాలల తలుపులు..
జిల్లావ్యాప్తంగా తెరుచుకున్న విద్యాలయాలు
అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఉపాధ్యాయులు
పరిమితంగానే విద్యార్థుల హాజరు
భయపడుతున్న తల్లిదండ్రులు
రెండో దశపై వస్తున్న ప్రకటనలే కారణం
తల్లిదండ్రుల కమిటీ సమావేశంలోనూ అదే ప్రస్తావన
ఒంగోలు: కొవిడ్ భయం.. సుదీర్ఘ విరామం తర్వాత 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సోమవారం పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. తల్లిదండ్రులు జంకుతూనే పిల్లలను బడికి పంపారు. కరోనా భయాందోళనతో జిల్లాలో తొలిరోజు హాజరు 30శాతం కూడా దాటలేదు. విద్యార్థులు స్కూళ్లకు నామమాత్రంగానే హాజరయ్యారు. ఎవరిలోనూ ఉత్సాహం కనిపించలేదు. అంతా జాగ్రత్తలపైనే శ్రద్ధ చూపారు. కరోనా రెండోసారి మరింత విజృంభిస్తుందని ఒకపక్క ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూనే పాఠశాలలు తెరవటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి మూతపడిన విద్యాలయాలు 7నెలల సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం పునఃప్రారంభమ య్యాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో ని ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి 9, 10 తరగ తులు విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించగా మొదటిరోజు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు పాఠశాలలకు హాజర య్యారు. మొదటిరోజు 9, 10 తరగతుల విద్యార్థులు హాజరుకా వాల్సి ఉండగా కొన్ని పాఠశాలల్లో నామమా త్రంగా 10, 15మంది హాజరు కాగా కొన్ని పాఠశాలల్లో ఒక మోస్తరు విద్యార్థులు హాజరయ్యారు. అన్ని పాఠశా లలో కొవిడ్ 19తో తీసుకోవాల్సిన జాగ్ర త్తలకు సంబంధించి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాఠ శాలకు హాజరైన విద్యార్థులను థర్మల్ గన్‌తో పరీక్షించి అనంతరం తరగతి గదుల్లోకి అను మతించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు.
పరిమితంగానే విద్యార్థులు హాజరు
మొదటిరోజు పరిమితంగానే విద్యార్థులు హాజర య్యారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికి విద్యా ర్థుల్లో స్పందన తక్కువగానే ఉంది. ఒంగోలు నగరపా లక సంస్థ పరిధిలోని ముక్తినూతలపాడు హైస్కూలులో 9, 10 తరగతులకు మొత్తం 80మంది విద్యార్థులు ఉం డగా కేవలం 25మంది హాజరయ్యారు. ఒంగోలు పీవీ ఆర్ బాలుర హైస్కూలులో 128మంది 9వతరగతి విద్యార్థులకుగాను 26మంది, 10వ తరగతి 85మందికి గాను 26మంది హాజరయ్యారు. పీవీఆర్ బాలికల హై స్కూలు 9లో 134మందికి 40మంది, 10లో 89కి 36 హాజరయ్యారు. డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూలు 9లో 120 మందికి 40మంది, 10లో 165కు 51మంది హాజరయ్యారు. గ్రామీణ ప్రాతాల్లోని కొన్ని పాఠశాలల్లో హాజరు మరీ తక్కువగా ఉన్నట్లు జిల్లాకేంద్రానికి సమాచారమందింది.
తల్లిదండ్రులు విముఖత
కొవిడ్ 19 సెకండ్ వేవ్‌పై వస్తున్న సమాచారం తెలుసుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విముఖత చూపుతున్నారు. ఆదివారం నిర్వహించిన తల్లిదండ్రుల కమిటీ సమా వేశంలో ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. అనుమానాల నివృ త్తికి పాఠశాలకు వచ్చిన విద్యార్థులలో కొత్తపట్నం మండలం గవండ్ల పాలెం జడ్పీ హైస్కూలు ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కొవిడ్ బారిన పడ్డారు. అదేవిధంగా ముండ్లమూరు మండలం మా రెళ్ళ జడ్పీ హైస్కూలు విద్యార్థులు 8మందికి కరోనా పాజిటివ్ నిర్ధార ణ అయింది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లి దండ్రులు జంకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబరు 30 వరకు పాఠఽశాలలు తెరవవద్దని సూచించినా రాష్ట్రప్రభుత్వం మొండిగా పాఠ తెరవడాన్ని తల్లిదండ్రులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన తమ పిల్లలకు కొవిడ్ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
జాయింట్ కలెక్టర్ అసంతృప్తి
పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే త్రోవగుం ట జడ్పీ హైస్కూలును సందర్శించిన జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ అక్కడి పరిస్థితులు పట్ల అసంతృప్తి వ్య క్తం చేశారు. పాఠశాల ఆవరణలో కొవిడ్ జాగ్రత్తలకు సంబంధించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రశ్నిం చారు. విద్యార్థులకు జేసీ ముఖాముఖిలో కొవిడ్ గురిం చి పలు ప్రశ్నలు అడిగారు. అయితే వారి నుంచి స్పష్ట మైన సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మొదటిరోజు విద్యార్థులకు పూర్తిగా కొవిడ్‌పై అవగాహన కల్పించమన్నా పట్టించుకోలేదన్నారు. ప్రతి తరగతిలో ఒక కొవిడ్ లీడర్‌ను ఏర్పాటు చేసి విద్యా ర్థులు అందరికీ వైరస్‌పై అవగాహన కల్పించమని పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు. డీఈవో సుబ్బారా వు నగరంలోని సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులకు ధర్మల్ స్కాన్‌తో పరీక్షలు నిర్వహించారు. వారికి కొవిడ్‌పై అవ గాహన కల్పించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమి షనర్ భాగ్మలక్ష్మి పీవీఆర్ మున్సిపల్ బాలికల హైస్కూలును సందర్శించారు.
జూనియర్ కాలేజీలకు 25శాతం మంది హాజరు
ప్రభుత్వ, ఎయిడెడ్, ఇతర ప్రైవేటు యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలలన్నీ సోమవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మొదటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. జిల్లాలోని 197 జూనియర్ కళాశాలల్లో 26వేల మంది జనరల్, ఒకేషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులుండగా 6వేల మంది హాజరైనట్లు ఆర్‌ఐవో వి.వి.సుబ్బారావు తెలిపారు. ప్రతి తరగతి గదికి 16 మంది చొప్పున కూర్చునే ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు కళాశాలలు నిర్వహిస్తున్నారు. అన్ని కళాశాలల్లో కొవిడ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.