పర్ఫెక్ట్‌గా..16 ప్రాణాలు తీశారు

ABN , First Publish Date - 2020-08-12T11:24:15+05:30 IST

కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఛేదించింది.

పర్ఫెక్ట్‌గా..16 ప్రాణాలు తీశారు

కురిచేడులో శానిటైజర్‌ మృతుల కేసును  ఛేదించిన సిట్‌ బృందం

యజమానితో సహా 10 మంది అరెస్టు 

వారిలో ఐదుగురు మెడికల్‌ షాపుల నిర్వాహకులు

పెద్దమొత్తంలో ముడి సరుకు స్వాధీనం

వివరాలను వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

సిట్‌ బృందానికి రివార్డులు అందజేసిన సెబ్‌ కమిషనర్‌ వినిత్‌బ్రిజ్‌లాల్‌


కరోనా కాలంలో తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని వినియోగించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు. అనుమతులు లేకుండా ప్రమాదకరమైన రసాయనాలతో నాసిరకం శానిటైజర్లను తయారు చేశారు. 16మంది ప్రాణాలను బలిగొన్నారు. ఆ ‘పర్ఫెక్ట్‌’ ముఠా గుట్టును సిట్‌ అధికారులు రట్టు చేశారు. 10 మందిని అరెస్టు చేశారు. వారిలో కంపెనీ యజమానితోపాటు అతని సోదరుడు, ఆ కంపెనీ డిస్ర్టిబ్యూటర్‌, శానిటైజర్‌ తయారీకి రసాయనాలు  సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులు, కురిచేడుకు చెందిన  మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఐదుగురు ఉన్నారు. శానిటైజర్‌ తయారీకి వినియోగించిన ముడి సరుకును పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మంగళవారం ఒంగోలులో వెల్లడించారు.


ఒంగోలు(క్రైం), ఆగస్టు 11 : కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఛేదించింది. పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్లు తాగడం వల్లనే ఈ పెనువిషాదం చోటుచేసుకుందని తేల్చింది. అందుకు బాధ్యులైన 10 మందిని అరెస్టు చేసింది. ఎస్సీ సిద్ధార్థ కౌశల్‌ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ మండలం సిద్దాపురానికి చెందిన సాలె శ్రీనివాస్‌ అలియాస్‌ జాజుల పెట్రోలు బంకుల్లో పనిచేస్తూ ఆ తర్వాత పెయింట్‌ రిమూవర్స్‌ విక్రయాలతో రసాయన పదార్థాలపై అవగాహన పెం చుకున్నాడు. కొవిడ్‌ కాలంలో శానిటైజర్లకు ఏర్పడిన డిమాండ్‌ను సొమ్ము చేసు కునేందుకు ప్రయత్నించాడు.  యూట్యూబ్‌లో  చూసి అత్యాశతో శానిటైజర్‌ త యారీకి ఉపక్రమించాడు. పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ పేరుతో వాటిని మార్కెట్‌లోకి తెచ్చాడు. అవే కురిచేడులోని 16మంది మృతి, మరో 50 మంది అస్వస్థతకు దారితీసింది. 


వేగంగా దర్యాప్తు చేసిన సిట్‌

గత నెల 29న సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, ఏఎస్పీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క మందు బాబులు శానిటైజర్‌ సేవించి మృతిచెందినట్లు అప్పట్లో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ కేసును వేగవంతంగా ఛేదించిన సిట్‌ బృందం సూత్రధారి తోపాటు పదిమంది నిందితులను అరెస్ట్‌ చేసింది. లాక్‌డౌన్‌ సమ యంలో కురిచేడు మెడికల్‌షాపుల్లో శానిటైజర్లను బెల్టుషాపుల్లో మందు మాదిరి గా విక్రయించారని ఎస్పీ తెలిపారు. 


ఇథనాల్‌ బదులు మిథనాల్‌ వినియోగం

కేవలం ఆరోతరగతి చదువుకున్న సాలె శ్రీనివాస్‌ తన అన్న శివకుమార్‌తో కలిసి  ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఎలాంటి అనుమతులు లేకుండా శానిటైజర్‌ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌ జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో చిన్న గదిని అద్దెకు తీసుకుని ఏర్పాటు చేశారు. రసాయనాల వ్యాపారం చేసే మహమ్మద్‌ దావూద్‌, మహమ్మద్‌ హజీల నుంచి ముడిపదార్థాలను కొనుగోలు చేశారు. శానిటైజర్‌లో ఇథనాల్‌ వాడాల్సి ఉండగా ధర ఎక్కువ కావడంతో అత్యంత తక్కువ ధర అయిన మిథనాల్‌ వినియోగించి ఓ కుటీర పరిశ్రమలాగా నడుపుతున్నారు. తొలుత అక్కడ తయారుచేసిన శానిటైజర్లు ఆటోలో విక్రయించేవాడు. ఆ తరువాత కేశవ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి ద్వారా డిస్ట్రిబ్యూట్‌ చేయించాడు. 


అన్నీ నకిలీ సర్టిఫికెట్లు 

పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా ఐఎస్‌వో, జీఎస్‌టీ సర్టిఫికెట్‌లు నకిలీవి తయారుచేసుకుని కూలీలతో శానిటైజర్లు త యారుచేస్తున్నట్లు సిట్‌ బృందం గుర్తించింది. హైదరాబాద్‌లో శానిటై జర్లు విక్రయిస్తున్న సమయంలో రెండుసార్లు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు దొరికి లంచాలిచ్చి బయటపడినట్లు ఎస్పీ తెలిపారు.


భారీగా శానిటైజర్లు, రసాయనాలు సీజ్‌

పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ శానిటైజర్‌ కంపెనీ హైదరాబాద్‌ జీడిమెట్లలో 25లీటర్ల శానిటైజర్‌ క్యాన్లు 25, 5 లీటర్ల క్యాన్లు 60, 100 ఎమ్‌ఎల్‌ బాటిళ్లు 300, 3 రసాయనాల డ్రమ్ములు ఇతర సామగ్రితో పాటు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా హైదరాబాద్‌ ప్రశాంసానగర్‌లో కేశవ్‌ అగర్వాల్‌ వద్ద మూడు లీటర్ల క్యాన్‌లు 190 బాక్సులు, 100 ఎంఎల్‌ బాటిళ్లు 75, 500 ఎంఎల్‌ 3 బాటిళ్లు, లీటర్‌ బాటిల్‌ ఒకటి సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


అరెస్టయ్యింది వీరే.. 

ఈ కేసులో తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా సిద్దాపురానికి చెందిన సాలె శ్రీనివాస్‌తో పాటు అత డి సోదరుడు సాలె శివకుమార్‌, శానిటైజర్‌ డిస్ట్రి బ్యూటర్‌గా ఉన్న కేశవ్‌ అగర్వాల్‌, ప్రాణాంతకమైన మిథనాల్‌, ఇతర రసాయనాలు సరఫరా చేసే హైద రాబాద్‌కు చెందిన మహమ్మద్‌ దావూద్‌, మహమ్మద్‌ హజీలను  అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.  అను మతులు లేని శానిటైజర్‌ను కురిచేడు, దొనకొండ, దర్శిలలో విక్రయించిన మెడికల్‌ షాపుల నిర్వాహకు లు తేలప్రోలు సుధాకర్‌రావు, దేవతి ఫణి, కొలిశెట్టి రమేష్‌, కొలిశెట్టి సుబ్బారావు, తోముండ్రు సురేంద్ర కుమార్‌లను సిట్‌ సారధి కె.చౌడేశ్వరి ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసినట్లు ఎస్సీ చెప్పారు. మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. 


హైదరాబాద్‌ నుంచి కురిచేడుకు..

పర్ఫెక్ట్‌ గోల్డ్‌ శానిటైజర్‌ త యారీదారుడైన శ్రీనివాస్‌ హైదరా బాద్‌లోని ప్రశాంసానగర్‌కు చెందిన కేశవ్‌ అగ ర్వాల్‌ను డిస్ట్రిబ్యూటర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. కేశవ్‌ ఆయన బంధువు విమల్‌ అగర్వాల్‌లు కలిసి బషీరాబాగ్‌లో మాస్కులు విక్రయించే ఎస్మిన్‌ దేవాలాలకు 200 బాటిళ్లు విక్రయించారు. ఆమె వద్ద జిల్లాలోని దర్శికి చెందిన కువ్వారపు విక్రం ధర్మా కొనుగోలు చేశాడు. అతను ఆ 200బాటిళ్లను కురిచేడు, దర్శి, దొనకొండలోని 5 మెడికల్‌ షాపులకు విక్రయిం చాడు.

Updated Date - 2020-08-12T11:24:15+05:30 IST