ఊరంతా ఊడిపిస్తారు.. జీతమివ్వక ఏడిపిస్తారు..!

ABN , First Publish Date - 2020-12-08T04:10:28+05:30 IST

పర్చూరు పంచాయతీ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఆరు నెలల్నుంచి జీతాల అందకపోవడంతో నానాఅగచాట్లు పడుతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

ఊరంతా ఊడిపిస్తారు..  జీతమివ్వక ఏడిపిస్తారు..!


అర్ధాకలిలతో పర్చూరు పారిశుధ్య కార్మికులు

ఆరు మాసాలు గడిచినా నేటికీ అందని వేతనాలు

ఇక్కట్లలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు


తెలతెలవారేలోపు వీధులన్నీ తళతళలాడేలా శ్రమిస్తారు. ఎముకలు కొరికే చలికి శరీరం గడగడ వణుకుతున్నా ఒళ్లంతా హూనం చేసుకుంటారు. చీపుర్లు చేతబట్టి రోడ్లన్నీ ఊడుస్తారు. అందరి ఇళ్లలో చెత్తను శుభ్రం చేస్తున్న వీరికి... వారి జీవితాల్లో కష్టాల చెత్తను ఎత్తిపారేసే వారి కోసం చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి లోకజన శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆరునెలల్నుంచి జీతాలు అందక అల్లాడిపోతున్నారు. 


పర్చూరు, డిసెంబరు 7 : స్థానిక పంచాయతీ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఆరు నెలల్నుంచి జీతాల అందకపోవడంతో నానాఅగచాట్లు పడుతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నా పట్టించుకొనే నాఽథుడే కరువయ్యారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు.  జీతాల కోసం అధికారులను వేడుకున్నా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఉపయోగం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ పోషణ కోసం అధిక వడ్డీలు చెల్లించి మరీ అప్పులు పాలు అవుతున్నామని వాపోతున్నారు. కరోనాతో మహమ్మారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజలు బలవర్ధకమైన ఆహారం కోసం వేలకు వేలు ఖర్చుచేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని, కనీసం కడుపు నింపుకొనేందుకు కూడా తమ వద్ద చిల్లిగవ్వ కూడా ఉండటం లేదని కళ్లలో నీరు నింపుకుని చెప్పారు. ఉన్నత ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందుతున్నా పారిశుధ్య కార్మికులకు మాత్రం నెలల తరబడి జీతాలు అందని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పారిశుధ్య కార్మికులకు ఆరు మాసాల వేతనాలను చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.  

Updated Date - 2020-12-08T04:10:28+05:30 IST