మొక్కుబడిగా సజ్జల కొనుగోలు

ABN , First Publish Date - 2020-12-28T05:29:05+05:30 IST

రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు.

మొక్కుబడిగా సజ్జల కొనుగోలు
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కాటా వేస్తున్న సజ్జలురైతుల ఇళ్ల వద్ద అధిక శాతం నిల్వలు

నిబంధనలతో పూర్తి స్థాయిలో 

కొనుగోలు చేయలేకపోతున్న అధికారులు 

దర్శి, డిసెంబరు 27 :  రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో నెలరోజుల క్రితం సజ్జల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 70 కేంద్రాలు ప్రారంచారు. వాటి ద్వారా ఇప్పటి వరకు కేవలం 7500 టన్నుల సజ్జలు మాత్రమే కొనుగోళ్లు చేశారు. ఇంకా అధికశాతం సజ్జలు రైతుల వద్దనే ఉన్నాయి. కేంద్రాల్లో విక్రయించుకునేందుకు అవకాశం లేక అనేకమంది తక్కువ ధరలకు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కేంద్రాల్లో చివర్లో అయినా, అవకాశం వస్తుందనే ఆశతో అనేకమంది రైతులు ఇళ్ల వద్ద నిల్వలు ఉంచుకున్నారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది 30 వేల టన్నుల సజ్జలు దిగుబడి వచ్చింది. మార్క్‌పెడ్‌ అధికారులు జిల్లా వ్యాప్తంగా 70 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత 7652 టన్నులు కొనుగోలు చేయాలని అలాట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ మేరకు దాదాపు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితం రెండవ విడత 2552 టన్నులు కొనుగోలుకు మళ్లీ అనుమతి ఇచ్చారు. మొత్తంమీద 10 వేల టన్నులకు మాత్రమే సజ్జల కొనుగోళ్లకు అనుమతి లభించింది. పండిన పంటలు కేవలం 30 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో అధికారులు అందుకు అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో సజ్జల ధర అతితక్కువగా ఉండడంతో కేంద్రాల్లో పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయకపోతే అధికశాతం మంది రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ ఏడాది సజ్జలు క్విటాళ్ల ధర రూ.2150 ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆ మేరకు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు సజ్జలు క్వింటాళ్లు రూ.1200 నుండి రూ.1400 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాణ్యత లేదని తక్కువ దరలకు కొనుగోలు చేస్తున్నారు. అందువలన రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


Updated Date - 2020-12-28T05:29:05+05:30 IST