చోటా రౌడీల హల్‌చల్
ABN , First Publish Date - 2020-12-11T05:43:59+05:30 IST
విజయవాడ నుంచి ఓ వివాహ వేడుకకు వచ్చిన కొంత మంది ‘చోటా రౌడీ’లు బుధవారం సాయంత్రం పుల్లల చెరువులో హల్‌చల్ చేశారు.
విజయవాడ నుంచి ఓ వేడుకకు వచ్చిన నిందితులు
నడిరోడ్డులో మద్యం సేవిస్తూ హడావడి
ఐదుగురిపై దాడి, ఒకరిపై హత్యాయత్నం
ఆస్పత్రిలో కోలుకుంటున్న క్షతగాత్రుడు
పోలీసు స్టేషన్ ఎదుట బాధితులు, స్థానికుల ఆందోళన
పుల్లలచెరువు, డిసెంబరు 10: విజయవాడ నుంచి ఓ వివాహ వేడుకకు వచ్చిన కొంత మంది ‘చోటా రౌడీ’లు బుధవారం సాయంత్రం పుల్లల చెరువులో హల్‌చల్ చేశారు. అధికార పార్టీ అనుచరులుగా చెప్పుకున్న వారు ఐదుగురిపై దాడి చేశారు. బీరు సీసాతో ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేయడంతో ఆయనకు పదమూడు కుట్లు పడ్డాయి. దీంతో బాధితుని తరఫు బంధువులు, స్థానికులు పోలీసు స్టేషన్ ఎదుట గురువారం ఆందోళన చేశారు.
విజయవాడకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఫూటుగా మద్యం సేవించి బుధవారం సాయంత్రం పుల్లలచెరువు బస్టాండ్‌కు వచ్చారు. కారులో వచ్చిన వారు పెద్దగా గోలచేస్తూ, వచ్చేపోయే వారిపై దౌర్జన్యానికి దిగారు. వీరిని ప్రశ్నించిన వారిపై కర్రలు, బీరుసీసాలు, మద్యం సీసాలతో దాడి చేశారు. గ్రామానికి చెందిన ముద్దాల లక్ష్మయ్యను నిందితులు బీరు సీసాతో తీవ్రంగా గాయపరిచారు. గాయాపడిన లక్ష్మయ్యను ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా 16 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం బాధితుడు ఎర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదుగురిని కూడా వీరు గాయపరిచినట్లు తెలిసింది.
పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా
ఘటన జరిగిన అనంతరం పోలీసులు సక్రమంగా స్పందించకపోవడంతో పోలీసుల తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. నేరుగా పోలీసు స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేయడం గమనార్హం. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ ఎదుట గంట సేపు ధర్నా చేయడంతో త్రిపురాంతకం, పెద్దదోర్నాల ఎస్సైలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ధి చెప్పారు. నిందితులపై కేసునమోదు చేయడంతో వారు ఆందోళన విరమించారు. విజయవాడకు చెందిన ఒక అధికార పార్టీ నేత అనుచరులమని పేర్కొంటూ నిందితులు హల్‌చల్ చేయడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
వివరాలు వెల్లడించని పోలీసులు
ఘటన జరిగి రెండు రోజులైన పోలీసులు వివరాలు వెళ్లడించలేదు. పోలీసు విధుల్లో భాగంగా ఏ చిన్న విజయం సాధించిన వివరాలు వెళ్లడిస్తూ, ఉన్నతాధికారులను కీర్తిస్తూ, ప్రెస్‌మీట్‌లు పెడుతున్న పోలీసులు ఈ కేసులో నిందితుల వివరాలు, కేసు వివరాలు ఇంత వరకు వెళ్లడించలేదు. నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి వివరాలు వెల్లడించకపోవడంతో స్థానిక పోలీసుల తీరుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.