రేషన్‌ డాన్‌!

ABN , First Publish Date - 2020-03-19T11:09:04+05:30 IST

పేదల కోసం చౌకధరల దుకాణాల ద్వారా అందించాల్సిన సరుకుల్లో ప్రధానంగా బియ్యం నల్లబజారుకు యథేచ్ఛగా తరలుతున్నాయి

రేషన్‌ డాన్‌!

చీరాల, మార్చి 18 : పేదల కోసం చౌకధరల దుకాణాల ద్వారా అందించాల్సిన సరుకుల్లో ప్రధానంగా బియ్యం నల్లబజారుకు యథేచ్ఛగా తరలుతున్నాయి. పేదలకు కిలోబియ్యం ఒకరూపాయికి ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఆ బియ్యం నిర్ణీత లక్ష్యం ప్రకారం వినియోగపడటం లేదు. సింహభాగం నల్లబజారుకు తరలుతున్నాయి. బడా వ్యాపారులు, పలు శాఖల అధికారులు పరస్పర సహకారంతో అక్రమదందా నడుస్తోంది. ఆదివారం వే టపాలెంలో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించేందుకు సిద్ధం గా ఉన్న లారీని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నా రు.


అయితే పోలీసులు దాడిచేసేముందు మరో టర్బో లారీకి రే షన్‌ బియ్యం లోడ్‌చేసి తీసుకెళ్ళారని సమాచారం. నెలకు మొ త్తం 20కి పైనే టర్బో లారీల ద్వారా బియ్యం తరలుతున్నాయం టే ఈ వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఏకంగా టర్బోల ద్వారా భారీస్థాయిలో రేషన్‌బియ్యం పోర్టు ద్వారా నల్లబజారుకు తరలుతుంటే నిజంగా సంబంధిత అధికారులకు తెలీదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


రేషన్‌ బియ్యం సేకరణ..

సాధారణంగా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారిలో ఎక్కువమంది రేషన్‌బియ్యం తీసుకోరు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఒప్పించి ఆ బియ్యాన్ని రేషన్‌ డీలర్లే ఉంచుకుంటున్నారు. వారి మధ్య కుదిరిన అవగాహన మేరకు డీలర్లు, కార్డుదారులకు డబ్బు చెల్లిస్తారు. ఆ డబ్బు తీసుకుని కార్డుదారులు తాము సరుకు తీసుకున్నట్లు వేలిముద్రలు వేస్తున్నారు. ఈక్రమంలో సేకరించిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారు వ్యాపారులకు తమ లాభం చూసుకుని అదనపు ధరకు విక్రయిస్తారు. అక్కడ నుంచి అసలు కఽథ మొదలవుతుంది. ఈ వ్యవహారమంతా నడిచేది అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే.. వారికీ తగిన రీతిలో వాటాలు వెళుతుంటాయి.


వేటపాలెం టూ పోర్టు :  సాధారణంగా నల్లబజారు వ్యాపారుల్లో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో పలువురు ఉన్నారు. అయితే పోర్టుకు తరలించే వ్యక్తి మాత్రమే ఒక్కరే. అతను కడప జిల్లాకు చెందిన వ్యక్తి. అతనితో స్థానికంగా ఆక్వారైతు ముసుగులో తిమింగిలంలా ఎదిగిన వ్యక్తి భారీస్థాయిలో అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. అతనికి ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ నేత అండదండలు ఉన్నాయి.  రేషన్‌ దుకాణదారులకు సంబంధించి మిగులుదల సరుకును అడుసుమల్లి, చినగంజాంలలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు నుంచి కొంత నేరుగా నల్లబజారు వ్యాపారులు సేకరించుకుంటారు. మరికొంత రేషన్‌దుకాణాల నుంచి సేకరిస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని టర్బో లారీల ద్వారా కడపకు చెందిన వ్యక్తి ఎక్కడికి పంపమంటే అక్కడకు పంపుతాడు. ఆ తర్వాత అతను రంగంలోకి వచ్చి పోర్టు నుంచి ఇతర దేశాలకు తరలిస్తాడు.

 

మిగిలిన నల్లబజారు వ్యాపారులు ఏం చేస్తారు..

స్థానికంగా డీలర్లు నుంచి రేషన్‌బియ్యం నల్లబజార్‌కు తరలించేవారు మూడు మండలాల పరిధిలో పలువురు ఉన్నారు. వారు రైస్‌మిల్లర్లకు, తిమింగలంలా పిలుచుకునే వ్యక్తికే తాము సేకరించిన సరుకుకు అదనంగా కొంతలాభం చూసుకుని ఇస్తుంటారు.


ఎవరి మామూళ్లు వాళ్లకు..

రేషన్‌బియ్యం నల్లబజారుకు తరలకుండా నియంత్రించాల్సిన అధికారులు ఎవరి మామూళ్ళు వారు తీసుకుని పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులు వస్తే 6ఏ కేసులతో సరిపెడుతున్నారు. దీంతో ఎన్నిసార్లు పట్టుబడినా తిరిగి నల్లబజారు వ్యాపారులు తమ దందాను సాగిస్తున్నారని ఈ వ్యవహారం తెలిసిన వారు అంటున్నారు. ఈ విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ అంకయ్యను ఫోన్‌లో వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.


అక్రమాలు మా దృష్టికి రాలేదు

గత ఆదివారం పట్టుబడిన రేషన్‌బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాం. ఎక్కడి నుంచి వచ్చాయన్నది విచారిస్తున్నాం. సరుకును చినగంజాం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించాం. పౌరసరఫరాల అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారు. మా తరఫున నివేదికను అందజేశాం. మండలం నుంచి భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అనే విషయం మా దృష్టికి రాలేదు. 

-కేఎల్‌ మహేశ్వరరావు, తహసీల్దార్‌, వేటపాలెం


Updated Date - 2020-03-19T11:09:04+05:30 IST