దొరికినా పట్టుకోలేరు!

ABN , First Publish Date - 2020-11-19T06:14:38+05:30 IST

చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు అందాల్సిన..

దొరికినా పట్టుకోలేరు!

పేదల బియ్యం భోక్తకు సంపూర్ణ సహకారం 

వేటపాలెం నుంచి కాకినాడ  పోర్టుకు రేషన్‌ బియ్యం

గతంలో వ్యాగన్లలో, ప్రస్తుతం టర్బో లారీల్లో తరలింపు

మామూళ్ల మత్తులో పోలీసులు, అధికారులు

విజిలెన్స్‌ దాడుల్లో వరుసగా పట్టుబడుతున్న బియ్యం

ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోని పోలీసులు

కేసును నీరుగార్చేందుకు బహిరంగంగానే యత్నాలు 


చీరాల(ప్రకాశం): చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు అందాల్సిన బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. దీన్ని నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నల్లబజారు వ్యాపారుల్లో విభేదాల నేపథ్యంలో పక్కాగా రవాణాకు సంబంధించి విజిలెన్స్‌ అధికారులకు అందుతున్న సమాచారంతో తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ విజిలెన్స్‌ డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో ఈపురుపాలెం బైపాస్‌ రోడ్డులో 400బస్తాల రేషన్‌ బియ్యంను తరలిస్తున్న లారీ పట్టుబడింది. లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మోటుపల్లికి చెందిన వెంకట్రావుగా గుర్తించారు. అతన్ని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. నిందితుడు కేసును నీరుగార్చేందుకు బహిరంగంగానే మంతనాలు జరుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


రేషన్‌బియ్యం అక్రమ రవాణా మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. అధికారులు వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇందుకు ఈనెల 14న ఈపూరుపాలెం వద్ద పట్టుబడ్డ రేషన్‌బియం్యం లారీనే నిదర్శనం. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కీలక వ్యక్తుల గురించి డ్రైవర్‌ వివరాలు చెప్పినా కూడా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకో వెనకాడుతున్నారు. దీనిని బట్టే రేషన్‌ దందా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. గత నెలలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ నేతృత్వంలో జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని రైసుమిల్లులపై యంత్రాంగం మెరుపుదాడులు జరిపింది. దీంతో పలుచోట్ల అక్రమంగా ఉంచి రేషన్‌ బియ్యం నిల్వలు భారీఎత్తున పట్టుబడ్డాయి. దీంతో కొందరు నల్లబజారు వ్యాపారులు, రేషన్‌బియ్యం వ్యాపారం చేసే రైస్‌మిల్లర్లు తాత్కాలికంగా దుకాణాలు సర్దుకున్నారు. అయితే చినగంజాం మండలం మోటుపల్లికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి మాత్రం భారీస్థాయిలో రేషన్‌ బియ్యంను చీరాల నియోజకవర్గం వేటపాలెం కేంద్రంగా సేకరించి కాకినాడ పోర్టుకు తరలించటం ప్రారంభించాడు. అంతకుముందు కూడా ఆక్వా రైతు ముసుగులో నల్లబజారు దందా చేసేవాడు.


కడప వ్యక్తితో సంబంధాలు

వెంకట్రావు గతం నుంచి ఆక్వా రైతు ముసుగులో రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలించేవాడు. గతంలో కూడా పలుమార్లు అతను తరలించే రేషన్‌బియ్యం పట్టుబడ్డాయి. అయినా అక్రమ వ్యాపారం ఆపలేదు. అందులో వచ్చే లాభం అధికంగా ఉండటం అందుకు కారణం. పైగా వెంకట్రావు తాను సాగించే వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో కడపకు చెందిన కీలక వ్యక్తితో సంబంధాలు పెంచుకున్నాడు. భారీ ఎత్తున బియ్యం తరలిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈపూరుపాలెం వద్ద ఈనెల14న పట్టుబడ్డ లారీడ్రైవర్‌ చెప్పిన వివరాల ద్వారా వెంకట్రావుకు, కడప వ్యక్తికి ఉన్న సంబంధాలతో పాటు లారీని వేటపాలెం నుంచి రాజమండ్రికి కిరాయికి మాట్లాడారని తెలిపాడు. ఆ లారీ కాకినాడ పోర్టుకే సరుకును తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కడప వ్యక్తితో అతనికి ఇంతకుముందే పరిచయాలు ఉన్నాయని తెలిసింది.


గతంలో రైల్వే వ్యాగన్లలో .. ప్రస్తుతం టర్బో లారీల్లో..

దశాబ్దన్నర క్రితం చీరాల కేంద్రంగా నల్లబజారు వ్యాపారం భారీస్థాయిలో జరిగింది. అంజయ్య అనే వ్యక్తి వ్యాగన్లకు రేషన్‌ బియ్యంను లోడ్‌ చేసి కాకినాడ పోర్టుకు తరలించేవాడు. ఆ క్రమంలో ఒకేసారి ఏకంగా 40 వ్యాగన్ల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. దాంతో నల్లబజారు వ్యాపారం కొన్నాళ్లు ఆగింది. తర్వాత బాపట్లకు పెద్ద సంఖ్యలో తరలించేవారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీనరసింహం నల్లబజారు వ్యాపారులపై ప్రత్యేకదృష్టి సారించారు. దాంతో కొందరు తమ దందా నుంచి తప్పుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రస్తుత రేషన్‌ డాన్‌ వెంకట్రావుతో పాటు మరి కొందరు దానిని కొనసాగిస్తూనే ఉన్నారు.


పోలీసుల అదుపులో తాజా నిందితులు

రెండు నెలల వ్యవధిలో 7 టర్బో లారీల రేషన్‌ బియ్యం దశలవారీగా చీరాల, వేటపాలెం, చినగంజాం నుంచి కాకినాడ పోర్టుకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలో ఒక లారీ చినగంజాం సమీపంలో పోలీసులకు పట్టుబడింది. అయితే వెంటనే వదిలివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 14వ తేదీ పట్టుబడ్డ రేషన్‌ బియ్యం ఉన్న టర్బో లారీకి సంబంధించి డ్రైవర్‌ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు వెంకట్రావు, కడప వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. కేసును నీరు కార్చేందుకు నిందితులు బహిరంగంగానే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


చినగంజాం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించిన బియ్యం

పట్టుబడ్డ రేషన్‌బియ్యంను చినగంజాం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లకు తరలించారు. నిందితులపై 6ఏ కేసు నమోదైంది. జేసీ కోర్టులో విచారణ జరుగుతోందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు కూడా తరచూ పట్టుబడుతున్నా తిరిగే అదే దందాలో కొనసాగుతున్నారంటే 6ఏ కేసు వలన వారికి ఎలాంటి ఇబ్బంది జరగకపోవటమేనని అంటున్నారు.


నిందితులను త్వరలో పట్టుకుంటాం: సుధాకర్‌, ఎస్‌ఐ, ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌

లారీ డ్రైవర్‌ చెప్పిన వివరాల ప్రకారం వెంకట్రావు అనే వ్యక్తి వేటపాలెం నుంచి రాజమండ్రికి సరుకు తీసుకెళ్లేందుకు లారీని బుక్‌ చేశాడు. వెంకట్రావుతో పాటు కడపకు సంబంధించిన మరో వ్యక్తి ప్రమేయం ఇందులో ఉంది. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం. కేసు నీరుకార్చటం అనేది ఉండదు. నిరాధార ఆరోపణలు సరికాదు.

Updated Date - 2020-11-19T06:14:38+05:30 IST