పాత కార్డులతోనే రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-03-02T11:17:29+05:30 IST

జిల్లాలో పాత రేషన్‌ కార్డుల ద్వారానే ఈనెలలో కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

పాత కార్డులతోనే రేషన్‌ పంపిణీ

జిల్లాలో  అర్హులుగా తేల్చింది  8.63 లక్షలు

వచ్చిన కొత్త కార్డులు 2.50 లక్షలే.. 


ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 1 :జిల్లాలో పాత రేషన్‌ కార్డుల ద్వారానే ఈనెలలో కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం  ఈనెల నుంచి కొత్త రైస్‌ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని గత నెలలో ప్రకటించింది. అయితే ఆ కార్డులు ప్రింట్‌ అయి జిల్లాకు రాకపోవడంతో పాత రేషన్‌ కార్డుల ద్వారానే ఈనెలలో సరుకుల పంపిణీ చేస్తున్నారు.


రెండు నెలల నుంచి రేషన్‌ కార్డులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 8.63 లక్షల మంది కార్డుదారులు అర్హులుగా గుర్తించారు. గుర్తించిన ప్రస్తుత రేషన్‌ కార్డుల స్థానంలో రైస్‌ కార్డుల పేరుతో కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే గత నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించినా పూర్తి స్థాయిలో ప్రింటింగ్‌ కాకపోవడంతో పాత కార్డులతోనే రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్నారు.


జిల్లాకు చేరిన 2.50 లక్షల రైస్‌ కార్డులు

 జిల్లాకు ఇప్పటి వరకు 2.50 లక్షల రైస్‌కార్డులు మాత్రమే చేరాయి. జిల్లా వ్యాప్తంగా 8.63 లక్షల కార్డులు రావాల్సి ఉండగా అందులో 27శాతం కార్డులు మాత్రమే వచ్చాయి. రైస్‌ కార్డులను విజయవాడలో ప్రింటింగ్‌ చేయిస్తున్నారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాకు తెచ్చి వాటిని గ్రామ సచివాలయాలకు పంపుతున్నారు. ఆ విధంగా ఇప్పటి వరకు 2.50 లక్షల కార్డులు జిల్లాకు రాగా వాటిలో కూడా 50శాతం మాత్రమే కార్డుదారులకు అందజేసినట్లు సమాచారం. 


సమయపాలన పాటించాలి

రేషన్‌ షాపులు సమయపాలన ప్రకారం నిత్యావసర వస్తువులు కార్డుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,  సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు షాపులను తెరిచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సమయపాలన పాటించకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా విధించాల్సి వస్తోందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించినట్లు సమాచారం. 

Updated Date - 2020-03-02T11:17:29+05:30 IST