కార్డుకు కోత.. రకరకాల కారణాలు చూపుతూ తొలగింపు

ABN , First Publish Date - 2020-12-12T04:18:12+05:30 IST

జిల్లాలో భారీగా రేషన్‌కార్డులకు కోత పడింది. వివిధ కారణాలను చూపుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కీలకమైన రేషన్‌కార్డులను తొలగించింది. విద్యా, వైద్యం, పలు ఇతర ప్రభుత్వ సాయాలకు రేషన్‌కార్డే ఆధారం. అలాంటి దానిని ఈనెల రేషన్‌ పంపిణీ నుంచే అమలులోకి తెచ్చింది.

కార్డుకు కోత.. రకరకాల కారణాలు చూపుతూ తొలగింపు
రేషన్‌కార్డులు

జిల్లాలో 50,910 రేషన్‌కార్డులకు చెల్లు

డిసెంబరు నెల రేషన్‌ నుంచే అమలు

ప్రతి పథకానికి రేషన్‌కార్డుతోనే లింకు

విద్యా, వైద్యం, ఇతర సాయాలకు అదే కీలకం

ఆందోళనలో కార్డుదారులు


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 11 : మళ్లీ కార్డు కోత మొదలైంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తగ్గింపే లక్ష్యంగా రద్దులపర్వం నడుస్తోంది. జిల్లాలో రేషన్‌ కార్డుల ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం సంక్షేమానికి భారీగా కోత పెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చాలావరకు రేషన్‌కార్డునే కీలకం.  దీంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. నవశకంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో 50,910 కార్డులను తొలగించింది. వచ్చేనెల నుంచి ఇంటింటికి రేషన్‌ డెలివరీ ప్రారంభమవుతున్న తరుణంలో పలు కారణాలు చూపుతూ డిసెంబరు నుంచి అయా కార్డుదారులకు రేషన్‌ పంపిణీని నిలిపివేసింది. 300 యూనిట్ల కరెంట్‌ వాడకం చూపుతూ అందులో సగం కార్డులకు మంగళం పాడింది. మిగతావి సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా జీతాలు తీసుకోవడం, ఫోర్‌ వీలర్‌ కలిగి ఉండటం, ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడంతో తొలగించారు. కానీ ఇందులో చాలామంది అర్హుల కార్డులు పోయాయంటూ జనం సచివాయాలకు పరుగులు పెడుతున్నా.. అధికారులు మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకోండి అంటూ తాపీగా సమాధానమిస్తుండటం విశేషం.



 జిల్లాలో భారీగా రేషన్‌కార్డులకు కోత పడింది. వివిధ కారణాలను చూపుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కీలకమైన రేషన్‌కార్డులను తొలగించింది. విద్యా, వైద్యం, పలు ఇతర ప్రభుత్వ సాయాలకు రేషన్‌కార్డే ఆధారం. అలాంటి దానిని ఈనెల రేషన్‌ పంపిణీ నుంచే అమలులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2,151 రేషన్‌షాపుల పరిధిలో 10,25,455 రేషన్‌కార్డులు ఉండగా ఆ కార్డులకు ప్రతినెల నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా కార్డులు పరిశీలన చేస్తూ పలు కారణాలు చూపుతూ 50,910 కార్డులను రద్దుచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆ ప్రకారం జిల్లాలో 9,74,545 కార్డులకు మాత్రమే డిసెంబరు నెలలో సరుకులు అందగా మిగిలిన కార్డులకు నిలుపుదల చేశారు.


300 యూనిట్ల విద్యుత్‌ వాడితే కార్డుతొలగింపు

జిల్లావ్యాప్తంగా 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించారనే కారణంతో సుమారు 50శాతం కార్డులను తొలగించినట్లు సమాచారం. అంటే 25వేల కార్డులు అటువంటి వారివే ఉన్నాయి. ఆరు నెలలకు సరాసరిన విద్యుత్‌ వాడకాన్ని పరిశీలించిన అనంతరం అటువంటి కార్డులను డిసెంబర్‌ నుంచి తొలగించారు. మిగిలిన కార్డులను నాలుగు చక్రాల వాహనం, సీఎ్‌ఫఎంఎ్‌సలో వేతనాలు తీసుకోవడం, ఒక కార్డులో ఉండి మరోచోట ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఇన్‌కంట్యాక్స్‌ పరిధిలో ఉన్నటువంటి వారి కార్డులను తొలగించారు. నాలుగైదు రకాల కారణాలతో కార్డులు తొలగించడంతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.


ఆధార్‌ కార్డుతో అన్ని వివరాలు

ఆధార్‌ కార్డు నెంబర్‌ ద్వారా రేషన్‌ కార్డులను తొలగించారు. ఆ నెంబరు ద్వారా బ్యాంకుల్లో లావాదేవీలు, ఐటీ రిటన్స్‌, నాలుగు చక్రల వాహనాలు వంటివన్ని బయటపడ్డాయి. అటువంటి కార్డులు తొలగించిన వారిలో వేలాదిమంది కూడా అర్హులు ఉన్నారు. ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే అటువంటి ఇళ్లకు 300 యూనిట్లు విద్యుత్‌ వాడకం అనే కారణంతో తొలగించగా, మరికొంతమందికి కనీసం ద్విచక్రవాహనం లేకపోయినా నాలుగు చక్రాల వాహనం ఉందని చెబుతూ తొలగించారు. అటువంటి వారి కార్డులను తొలగించడంతో రోడ్డునపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు అర్హులైన రేషన్‌కార్డుదారులు వస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారని, తమ కార్డులు తొలగించారంటూ అభ్యంతరాలు చెబుతున్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు సమాధానమిస్తూ.. పిల్లలను తొలగించుకొని మళ్లీ కార్డు పొందాలంటున్నారు


కాంట్రాక్టు ఉద్యోగుల కార్డులకు కోత

ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రేషన్‌ కార్డులను తొలగించారు. రెగ్యులర్‌ ఉద్యోగులు కాకపోయినా వారి కార్డులను తొలగించారు. కారణం వారు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా జీతాలు తీసుకోవడమే. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఏ ఉద్యోగకి అయినా జీతం సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారానే వస్తుంది. కానీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వచ్చే ది అతి తక్కువే అయినా అది సీఎ్‌ఫఎంఎస్‌ నుంచి తీసుకోవడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. వారంతా తమ కార్డులను పునరుద్ధరించాలంటూ అభ్యర్థిస్తున్నారు.


అర్హతలుంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి

కార్డుదారుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉంటే తన కార్డు పునరుద్దరణ కోసం సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోనే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఎ్‌సఓ సురేష్‌ తెలిపారు. ఆ కార్డుల తొలగింపు కోసం ఏ ఏ కారణాలు చూపారో అందుకు సంబంధించి ధరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హత ఉంటే కార్డును పునరుద్దరిస్తామని తెలిపారు. 

 

Updated Date - 2020-12-12T04:18:12+05:30 IST