పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా?

ABN , First Publish Date - 2020-03-23T11:02:07+05:30 IST

పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా?

పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా?

రూ. 6 కోట్ల సొత్తు అపహరించినట్లు గుర్తింపు

 కొలిక్కి వచ్చిన సిగరెట్‌ లోడ్‌ కంటైనర్‌ చోరీ కేసు 


ఒంగోలు, మార్చి 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) :  సిగరెట్‌ కంటైనర్‌ను అటకాయించి అందులో రూ. కోట్ల విలువైన సరుకును అపహరించుకెళ్లిన కేసు కొలిక్కివచ్చింది. ఆ సంఘటనకు పాల్పడిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి వద్ద రూ. 6 కోట్ల సొత్తును అపహరించినట్లు గుర్తించారు. అద్దంకి, కందుకూరు సీఐలు అశోక్‌వర్దన్‌, విజయ్‌కుమార్‌ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రత్యేక పోలీసు బృందం ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలిసింది.  


జిల్లాలోని ఉలవపాడు సమీపంలో జాతీయ రహదారిపై కొద్దినెలల క్రితం సిగరెట్‌ కంటైనర్‌ను అటకాయించిన కొందరు దుండగులు సమీపంలోని ఒక చోటకు తీసుకెళ్లి సిగరెట్లను మరో లారీలో వేసుకొని పరారయ్యారు. చెన్నైలోని ఐటీసి నుంచి వస్తున్న కంటైర్‌ను అనుసరించి ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీకి గురైన సిగెరట్ల విలువ రూ. కోట్లలో ఉండటంతో పోలీసులు కేసును సీరియన్‌గా తీసుకున్నారు. పైగా ఐటీసీ కంపెనీ నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దీంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కేసు దర్యాప్తునకు అద్దంకి, కందుకూరు సీఐలు అశోక్‌వర్దన్‌, విజయ్‌కుమార్‌, గుడ్లూరు ఎస్‌ఐ పాండురంగారావులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.


వీరు విచారణ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని బిందాస్‌ జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. కొద్దిరోజులుగా అక్కడే మకాం వేసి ఆ ముఠాలోని ఒకరిద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా దోపిడీకి ఉపయోగించిన కార్లు, లారీతోపాటు, కొంత సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ ముఠా అనేక రాష్ర్టాల్లో దోపిడీలకు పాల్పడినట్లు తెలిసింది. రూ. 6 కోట్ల విలువైన సొత్తును ఈ ముఠా కొల్లగొట్టినట్లు సమాచారం. వివిధ ప్రాంతా ల్లో దోపిడీ ముఠా సభ్యులు ఉంచిన సొత్తును స్వాధీనం చేసుకునే పనిలో అక్కడి పోలీసుల సహాయంతో మన పోలీసులు ఉన్నట్లు తెలిసింది.


ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కూడా వీరు దోపిడీ చేసిన సొమ్ము ఉన్నట్లు గుర్తించారని సమాచారం. అలా వివిధ ప్రాంతాల్లో ఉన్న దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకోవటంతో పాటు మిగిలిన సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని వారిని జిల్లాకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ర్టాల్లో ఆ ముఠా చేసిన దోపిడీలు బయటపడతుండటంతో ఆయా రాష్ర్టాల పోలీసు అధికారులు కూడా ఈ  దర్యాప్తు వైపు దృష్టి సారించాయి.

Updated Date - 2020-03-23T11:02:07+05:30 IST