మాకొద్దు బాబోయ్!

ABN , First Publish Date - 2020-11-06T17:12:17+05:30 IST

రైతుకు రాయితీపై శనగ విత్తనాలిస్తున్నాం..

మాకొద్దు బాబోయ్!

శనగ విత్తనాలకు తగ్గిన గిరాకీ

సబ్సిడీ ఇస్తున్నా ధరలో వ్యత్యాసం లేక రైతుల అనాసక్తి 

ఏటా అదనపు కోటా కోసం ఒత్తిళ్లు 

ఈ ఏడాది కేటాయింపు ఖర్చుకాక ఆపసోపాలు 

సబ్సిడీ రూపంలో కోట్లు వృథా తప్ప 

ప్రయోజనం శూన్యమంటున్న రైతులు 


కందుకూరు: రైతుకు రాయితీపై శనగ విత్తనాలిస్తున్నాం.. ఇది వినటానికి బాగున్నా.. వాస్తవంలో మాత్రం ప్రయోజనం శూన్యం. 30శాతం సబ్సిడీ అంటున్నప్పటికీ దాని వల్ల ఏమీ లాభం లేదని బయట మార్కెట్లోనే తక్కువగా ఉన్నాయని రైతులు పెదవి విరుస్తున్నారు. రైతులకు సబ్సిడీ పేరుతో కోటాను కోట్లు ఎవరి జేబుల్లోకో చేరటం తప్ప ఉపయోగం లేదంటున్నారు. దీనికి తోడు ముందుగా డబ్బు చెల్లిస్తే రేపు వారిచ్చే విత్తనాలు ఎలా ఉన్నా నోరు మూసుకుని తీసుకోక తప్పదు కదా అని రైతులు ఆసక్తిచూపడం లేదు. దీంతో సబ్సిడీ శనగలకు గిరాకీ తగ్గింది. వ్యవసాయశాఖ అధికారులు ఎంత ప్రచారం నిర్వహించినా గ్రామగ్రామాన ఆర్‌బీకేల ద్వారా పర్మిట్లు రాసి విత్తనం అందజేస్తున్నా కదలిక అంతంతమాత్రమే. ఇంకా చెప్పాలంటే వారు రైతులను సమీకరించి విత్తనాలు ఇస్తున్నా కూడా అలాట్‌మెంట్‌ని ఖర్చుచేయలేని పరిస్థితి. జిల్లాకు కేటాయించిన సబ్సిడీ శనగ విత్తనాల్లో కేవలం 65శాతం మాత్రమే రైతులు తీసుకున్నారు. మిగిలిన విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించేయటానికి వ్యవసాయశాఖ అధికారులు సిద్ధపడుతున్నారు. ఇదీ జిల్లాలో సబ్సిడీ శనగల రివర్స్‌ కథ..


సబ్సిడీ శనగ విత్తనాలకు గిరాకీ తగ్గింది. దాదాపు రెండు దశాబ్ధాలకాలం నుంచి వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ శనగ విత్తనాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వం కేటాయించిన విత్తనం సరిపోక అదనపు కోటా కోసం ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసేవారు. బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి రాకమునుపు సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టడం వల్ల కూడా రైతులకు విత్తనం అందక ఇబ్బందిపడే పరిస్థితి ఉండేది. కానీ బయోమెట్రిక్‌ అమలులోకి వచ్చాక ఆ సమస్య తగ్గింది. గత సంవత్సరం కూడా తొలుత చేసిన కేటాయింపులు సరిపోక అదనపు కేటాయింపులు చేసి రైతులకు విత్తనాలను అందించారు. ఈ సంవత్సరం పేరుకి 33శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్త వ ధరకన్నా రూ.3వేలు అదనంగా ధర నిర్ణయించి సబ్సిడీ ప్రకటించటంతో రైతుకి ఏమా త్రం ప్రయోజనం లేకుండాపోయింది. కాక్‌-2 రకం విత్తనాలకు ప్రభుత్వానికి సబ్సిడీపోను రైతు చెల్లించాల్సిన ధరను బహిరంగ మార్కెట్‌ ధరతో పోల్చి చూస్తే క్వింటాల్‌కి రెండు మూడు వందలే వ్యత్యాసం ఉండగా జెజీ-11 రకమైతే సబ్సిడీ శనగల ధరకన్నా బహిరంగ మార్కెట్లోనే క్వింటాల్‌ రెండు మూడు వందలు తక్కువ ధరకు లభిస్తున్న పరిస్థితి. దీనికి తోడు రైతులు ముందస్తుగా డబ్బు చెల్లిస్తేనే విత్తనం బుక్‌చేసి తెప్పిస్తామన్న కొత్త నిబంధన అమలులోకి తేవటంతో రైతులు పెదవి విరుస్తున్నారు. 


భారీ అంచనాలతో ఇండెంట్‌

ఈ ఏడాది జిల్లాలో 90వేల హెక్టార్లలో శనగ సాగవుతుందన్న అంచనాతో 77,439 క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతులకు 33శాతం సబ్సిడీపై అందించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. కాక్‌-2 రకం శనగ విత్తనాలను సబ్సిడీపోను 25కిలోల బ్యాగుని రైతుకి రూ.1,347.50కి, జెజీ-11 రకాన్ని రూ. 1,312.50కి ఇచ్చేలా నిర్ణయించారు. మొత్తం 77,439 క్వింటాళ్లలో రెండు వంతులు కాక్‌-2 రకం ఒక వంతు జెజీ-11 రకం విత్తనాన్ని సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ని బట్టి మరో 25వేల క్వింటాళ్ల వరకు అదనంగా విత్తనం తెప్పించాల్సి వస్తుందన్న అంచనాతో ఇండెంట్లు పెట్టారు. అయితే తీరాచూస్తే జిల్లావ్యాప్తంగా గత నెలరోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి శనగలు ఎక్కడికక్కడే ఆర్‌బీకేలకే తెప్పించి పర్మిట్లు రాస్తున్నా జిల్లావ్యాప్తంగా 54,675 క్వింటాళ్లు మాత్రమే ఇప్పటివరకు వ్యవసాయ శాఖ రైతులకు ఇవ్వగలగటం గమనార్హం. అలాగని శనగ సాగు తగ్గుతుందా అని విచారిస్తే ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులంటున్నారు.


రైతులు అందరూ తీసుకోక..

గతేడాది ముందస్తు కేటాయింపులు సరిపోక అదనంగా మరో 40శాతం వరకు తెప్పించాల్సిన పరిస్థితి కాగా ఈ ఏడాది తొలి కేటాయింపుల్లోనే 65శాతం మాత్రమే వినియోగం జరగటం పరిస్థితికి అద్దం పడుతోంది. కందుకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో 9,547 క్వింటాళ్లను కేటాయించగా 6,866 క్వింటాళ్లు మాత్రమే ఖర్చవటం విశేషం. గతేడాది 10,324 క్వింటాళ్ల శనగ విత్తనాలను తెప్పించగా అదనపు కేటాయింపులు చేయించుకోవాల్సి రాగా ఈ ఏడాది కేటాయింపుల్లో కూడా 60శాతమే ఖర్చవటం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఈనెల 9లోగా రైతులకు విత్తన పంపిణీ పూర్తిచేసి మిగిలిన విత్తనాలను వెనక్కి పంపించేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ధర నిర్ణయం, సబ్సిడీ నిర్ణయం జరిగేలా చూడటం ద్వారా వచ్చే ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.



Updated Date - 2020-11-06T17:12:17+05:30 IST