సమాఖ్య ఎన్నికలోనూ పవర్‌ పాలిటిక్స్‌

ABN , First Publish Date - 2020-06-18T10:43:25+05:30 IST

గ్రామ సమాఖ్య ఎన్నికలోనూ రాజకీ యం మొదలైంది. అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిపోయింది. దీంతో బుధవారం జరిగిన మండలంలోని

సమాఖ్య ఎన్నికలోనూ పవర్‌ పాలిటిక్స్‌

ధర్మవరం-1 గ్రామ సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక వివాదాస్పదం

రెండు గ్రూపులుగా చీలిన సభ్యులు 

అధికారుల తీరుకు నిరసనగా ఎన్నికను బహిష్కరించిన ఓవర్గం

ఏకపక్షంగా అధ్యక్ష పదవి దక్కించుకున్న వైసీపీ గ్రూపు

రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన పలువురు మహిళలు

పది మందిపై బైండోవర్‌ కేసులు 


అద్దంకిటౌన్‌, జూన్‌ 17 : గ్రామ సమాఖ్య ఎన్నికలోనూ రాజకీ యం మొదలైంది. అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిపోయింది. దీంతో బుధవారం జరిగిన మండలంలోని ధర్మవరం-1 గ్రామ స మాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక వివాదాస్పదమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు వైసీపీ మద్దతు గ్రూపునకు చెందిన సభ్యు రాలికి ఆ పదవి కట్టబెట్టారు. ఇందుకు నిరసనగా రెండో వర్గం మ హిళలు రోడ్డుపై బైఠాయించారు. చివరికి పోలీసుల జోక్యంతో పరి స్థితి అదుపులోకి వచ్చింది. మండలంలోని ధర్మవరం-1 గ్రామ స మాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. గ్రామంలో మొత్తం 46 గ్రూపులుండగా, వాటిలో 43 సంఘాలు ఎన్నికలో పాల్గొన్నాయి. గ్రూపు మొదటి అధ్యక్షురాలికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, సంఘాలు తీసుకున్న రుణా లు, చెల్లింపులు, పొదుపు నిర్వహణ సక్రమంగా ఉండే వారు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ చేయాలని డీపీఎం సుబ్బారావు ప్రకటించారు.


ఎన్నికకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా వలంటీర్ల వద్ద ఉంచుకున్నారని, మేము కూడా ఎన్నికల్లో పాల్గొంటామని పలువురు గ్రూపు లీడర్లు ఎంపీడీవోను కోరారు. నోటీసులు అందుకోని వారు ఎన్నికలో పాల్గొనే అవకాశం లేదని ఆయన చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో అందరికీ ఎన్నికలో పాల్గొనే అవకాశం కల్పించారు. వైసీపీ, టీడీపీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహించగా, పలువురు గ్రూపు లీడర్లు కేవలం ఎన్నిక కోసమే సమాఖ్య-2 వాళ్లను ఒకటిలో చేర్చారని, వారిని ఎన్నికకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు.


అధికారులు అవేమీ పట్టించుకోకుండానే ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుండడంతో 20 మంది గ్రూప్‌ లీడర్లు బహిష్కరించారు. దీంతో అధికారులు అక్కడఉన్న ఒక వర్గం లీడర్లతోనే ఎన్నిక పూర్తి చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో అధ్యక్షురాలిగా గూడాల వరలక్ష్మి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉపాధ్యక్షురాలిగా మేడగం సాయికుమారి, కార్యదర్శిగా మేకల రాధ, సహాయ కార్యదర్శిగా తాళ్లూరి కామాక్షమ్మ, కోశాధికారిగా మేడగం పద్మావతి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాజేందర్‌ ప్రకటించారు. 


ఇదిలావుండగా తమకు న్యాయం చేయాలంటూ మరో వర్గం మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎస్‌ఐ మహేష్‌ వెళ్లి వారిని సర్దిచెప్పి, ఆందోళన విరమింపచేశారు. అనంతరం రోడ్డుపై నిరసన తెలిపిన భారతితోపాటు తొమ్మిది మంది సభ్యులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.


Updated Date - 2020-06-18T10:43:25+05:30 IST