ప్రధానోపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు.. కారణమేమిటంటే..

ABN , First Publish Date - 2020-02-12T17:31:50+05:30 IST

ఆయన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థినులకు..

ప్రధానోపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు.. కారణమేమిటంటే..

కీచక ప్రధానోపాధ్యాయుడు

విద్యార్థినుల పట్ల వికృత చేష్టలు

దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు 

గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం  


బేస్తవారపేట(ప్రకాశం): ఆయన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థినులకు క్రమ శిక్షణ నేర్పాల్సిన ఆయనే కట్టుతప్పాడు. వెకిలి మాటలు, వికృత చేష్టలతో వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకొని అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల కథనం మేరకు.. పందిళ్ల పల్లి జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిగా మేకనబోయిన కోటేశ్వరరావు పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన విద్యార్థినులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. కంప్యూటర్‌ క్లాస్‌కు రావాలంటూ ఒక్కోరోజు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి వికృతంగా వ్యవహరిస్తున్నాడు. బుగ్గలు గిల్లడం, చేతులు, వీపుపై నిమరడం వంటి చేష్టలకు పాల్పడుతున్నాడు. విషయం బయట చెప్తే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని భయపెట్టడంతో విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.


మంగళవారం కూడా ఒక విద్యార్థినిని పిలిపించుకొని వెకిలిగా ప్రవర్తించడంతో ఆమె ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మహిళలంతా  హైస్కూల్‌ వద్దకు చేరుకొన్నారు. ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్లి కుర్చీలో ఉన్న కోటేశ్వరరావును లాగి కిందపడేశారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఒక గదిలోకి నెట్టి తాళం వేసి పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఏఎస్సై రవీంద్రరెడ్డి, సిబ్బంది పందిళ్లపల్లి చేరుకుని బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. 


గతంలో ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావును అతని కుమారుడు కారులో ఎక్కించుకొని హైస్కూల్‌ వద్ద వదిలి వెళ్తుండేవాడు. ఆ సమయంలో అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న సుఫల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు మందలించారు. అప్పటి నుంచి ప్రధానోపాధ్యాయుడి కుమారుడు రావడం లేదు. ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుఫల్‌ సొసైటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. 


చర్యలు తీసుకునేంత వరకూ  పిల్లలను బడికి పంపం

ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావుపై జిల్లా అధికారులు చర్యలు తీసుకునేంత వరకూ బడికి పంపేది లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులు బడుద్ధాయి పనులకు పాల్పడటం బాధాకరంగా ఉన్నదన్నారు.  

Updated Date - 2020-02-12T17:31:50+05:30 IST