200 మంది ‘ఔట్‌’

ABN , First Publish Date - 2020-05-18T10:30:07+05:30 IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందిపై యాజమాన్యం వేటు

200 మంది ‘ఔట్‌’

ఆర్టీసీలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై వేటు 

విధులకు రావద్దని చెప్పిన డీఎంలు

కార్మిక సంఘాల కన్నెర్ర

నేడు నిరసనలకు పిలుపు 


ఒంగోలు (ప్రగతిభవన్‌) మే 17 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందిపై యాజమాన్యం వేటు వేసింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. రాష్ట్రవ్యాప్తంగా 7600 మందిని ఇంటికి పంపింది. ఇందులో ఒంగోలు రీజియన్‌ పరిధిలో 200 మంది ఉన్నారు. వీరందరికీ ఇక మీసేవలు అవసరం లేదు, డ్యూటీలకు రావొద్దని డిపో మేనేజర్లు చెప్పేశారు. 


జిల్లాలోని ప్రజా రవాణా సంస్థలో  టైపిస్టులు, డేటా ఆపరేటర్లు మొదలుకొని గ్యారేజీ అటెండర్లు, విచారణ కేంద్రాల వద్ద అసిస్టెంట్లు, స్వీపర్లుగా అవుట్‌సోర్సింగ్‌ విధానంపై 200 మంది  పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారని చెప్పడంతో తమ బతుకులు బాగుపడతాయని వీరంతా సంతోషించారు. కానీ లాక్‌డౌన్‌ సాకు చూపి వీరిని సాగనంపారు. దీంతో తాము రోడ్డున పడ్డామని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వాపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, యాజమాన్యం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అన్యామని కన్నీరు పెడుతున్నారు. తమకు మే నెల జీతం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉద్యోగాల నుంచి తొలగించట్లేదు..విజయగీత, ఆర్టీసీ ఆర్‌ఎం

ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించట్లేదు. ప్రస్తుత పరిస్థితిలో వారిని కొద్దిరోజులు ఆగాలని  చెప్పాం. మరే కారణం లేదు. సగం జీతాలు కూడా వారి ఖాతాల్లో జమ చేశాం. 


వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని కార్మికసంఘాల నేతలు  వ్యతిరేకిస్తున్నారు. యాజమాన్యం చర్యను ఖండిస్తున్నారు. నిరసనలకు సిద్ధమయ్యారు. వారిని కొనసాగించాలని సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు ఎంప్లాయీస్‌ యూనియర్‌ రీజనల్‌ కార్యదర్శి బెజవాడ రవి తెలిపారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

Updated Date - 2020-05-18T10:30:07+05:30 IST