పేదల ఇళ్ల స్థలాలకు లేఅవుట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-03-21T07:39:08+05:30 IST

జిల్లాలోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో 2,040 ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించామని, వందశాతం లేఅవుట్లు వేశామని...

పేదల ఇళ్ల స్థలాలకు లేఅవుట్లు పూర్తి

  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వీడియో
  • కాన్ఫరెన్స్‌లో వివరించిన కలెక్టర్‌ భాస్కర్‌
  • కరోనా వైరస్‌ నియంత్రణకు చర్యలు 
  • తీసుకోవాలన్న సీఎం

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 20 : జిల్లాలోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో 2,040 ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించామని, వందశాతం లేఅవుట్లు వేశామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ వివరించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం దృష్టికి కలెక్టర్‌ పలు అంశాలను తీసుకెళ్లారు. మొత్తం 497 ఎకరాల ప్రైవేటు భూములకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 447 ఎకరాలకు పొజిషన్‌ తీసుకున్నామని తెలిపారు. అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. కరోనా వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 80.9 శాతం మంది ఇంట్లో ఉంటూ వైద్యం తీసుకొని జాగ్రత్తలు పాటించి కోలుకుంటున్నారని చెప్పారు. కరోనా వైర్‌సపై తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులపై నిరంతరం పర్యవేక్షణ పెంచాలన్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే ఏ తేదీన వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అతనింటిలో ఎంత మంది ఉన్నారు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వైద్యశాఖకు నిరంతరం గ్రామవలంటీర్లు డేటా పంపుతున్నారని తెలిపారు. ఆ డేటా ద్వారా అలర్ట్‌గా ఉండాలన్నారు. ఉగాది రోజున నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 14వ తేదీ అంబేద్కర్‌ జయంతి నాటికి వాయిదా వేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ షన్మోహన్‌, జేసీ-2 నరేంద్రప్రసాద్‌, జిల్లా ఎస్పీసిద్ధార్థకౌశల్‌, ఆర్డీవోలు ప్రభాకర్‌ రెడ్డి, ఓబులేషు, శేషిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పద్మావతి, డాక్టర్‌ వసంత, డాక్టర్‌ శ్రీరాములు, పీ నిరంజన్‌ రెడ్డి, సాయినాథ్‌, డాక్టర్‌ ఉషారాణి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T07:39:08+05:30 IST