కొట్టకపోయినా కొట్టారనడం సరైనది కాదు : ఒంగోలు డీఎస్పీ

ABN , First Publish Date - 2020-07-18T22:04:03+05:30 IST

తమిళనాడులో పట్టుబడ్డ నగదు వ్యవహారంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.

కొట్టకపోయినా కొట్టారనడం సరైనది కాదు : ఒంగోలు డీఎస్పీ

ఒంగోలు : తమిళనాడులో పట్టుబడ్డ నగదు వ్యవహారంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎల్లావూరు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న నగదు ఒంగోలుకు చెందిన బంగారు వ్యాపారి నల్లమల్లి బాలు స్వయంగా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంభందించి కొందరు సోషల్ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లను ఉటంకిస్తూ పోస్టింగులు చేశారని నగర వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఒంగోలు డీఎస్పీ కెఎన్వీవీఎస్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో విచారణ అనంతరం ఘటనతో ప్రమేయం ఉన్న వడ్డేల సందీప్‌, తొట్టేంపూడి చంద్రలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు.


కొట్టలేదు..!

పోలీసులు అదుపులో ఉన్న సందీప్‌ అసత్య ఆరోపణలతో సెల్ఫీ వీడియో తీసి పోలీసులు పరువు తీసేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారని ప్రసాద్ వెల్లడించారు. నిందితునిపై గతంలో కూడా పలు కేసులున్నాయన్నారు. నిందితుడు ఇలాంటి పోస్టింగులు తరచూ పెడుతూ వైషమ్యాలను రెచ్చగొడుతున్నాడని డీఎస్పీ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా నిందితుడి శరీరంపై ఎలాంటి దెబ్బలు లేకపోయినా తనను పోలీసులు కొట్టారని ఆరోపణలు చేయటం సరైనది కాదన్నారు. 


నిందితుడు ఇలా..

అయితే నిందితుడు సందీప్‌ మాత్రం.. తనను అదుపులోకి తీసుకున్న తర్వాత కొంత మంది పేర్లు చెప్పాలంటూ పోలీసులు ఒత్తిడి తెచ్చారని.. చెప్పకపోవడంతో విపరీతంగా కొట్టారని ఆరోపిస్తున్నాడు. అసలు తనకేమీ తెలియదని చెబుతున్నా పోలీసులు వినకుండా చిత్ర హింసలకు గురిచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ నేతల వల్ల తనకు ప్రాణహాని ఉందని సందీప్ మీడియా ముఖంగా వెల్లడించారు. డీఎస్పీ ప్రెస్‌మీట్ అనంతరం బాధితుడితో కలిసి జిల్లాకు చెందిన కొండేపి ఎమ్మెల్యే స్వామి మీడియా మీట్ నిర్వహించగా సందీప్ పై వ్యాఖ్యలు చేశాడు.

Updated Date - 2020-07-18T22:04:03+05:30 IST