మను..గడగడ...!

ABN , First Publish Date - 2020-12-30T05:45:14+05:30 IST

రూ.500 కోట్ల ఆస్తులు. 500 లకుపైగా గ్రామాల నుంచి లక్షల లీటర్ల పాలసేకరణ. 3.5లక్షల లీట ర్ల పాలను పాలపొడిగా తయారు చేయగల ఫ్యాక్టరీ. 400మందికిపైగా సిబ్బందితో నిత్యం కళకళలాడుతూ పాడిరైతులకు బాసటగా జిల్లాకే తలమానికంగా నిలిచిన ఒంగోలు డెయిరీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోం ది.

మను..గడగడ...!
ఒంగోలు డెయిరీ


సంక్షోభంలోకి ఒంగోలు డెయిరీ
అమూల్‌ రాక ముందు 18వేల లీటర్ల పాల సేకరణ..
ఆ తర్వాత 4వేలకు పడిపోయిన వైనం
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో మరింత క్షీణత
నేడు వార్షిక సర్వసభ్య సమావేశం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
రూ.500 కోట్ల ఆస్తులు. 500 లకుపైగా గ్రామాల నుంచి లక్షల లీటర్ల పాలసేకరణ. 3.5లక్షల లీట ర్ల పాలను పాలపొడిగా తయారు చేయగల ఫ్యాక్టరీ. 400మందికిపైగా సిబ్బందితో నిత్యం కళకళలాడుతూ పాడిరైతులకు బాసటగా జిల్లాకే తలమానికంగా నిలిచిన ఒంగోలు డెయిరీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోం ది. పాడిరైతులకు మేలు పేరుతో అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. ఆ సంస్థ పాలసేకరణ ఇతర కార్యక్రమాలకు మొ త్తం యంత్రాంగాన్ని వాడేస్తూ  ఒంగోలు డెయిరీని మరింత సం క్షోభంలో నెట్టిస్తోంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కిన డెయిరీని గత టీడీ పీ ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులిచ్చి చక్కబెట్టే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులతో పాలక మండలిని ఏర్పాటు చేయగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో డెయిరీని తిరిగి అభివృద్ధి బాట పట్టిస్తామని ప్రకటించినా ఒరిగింది శూన్యమని చెప్పాలి.


ఏం జరుగుతుందో ఏమో..
ప్రస్తుతం కంపెనీ చట్టంలో డెయిరీ ఉంది. ఆ చట్టప్రకారం ఏడాదికి ఒకసారి సర్వసభ్య సమావేశం, మూడు మాసాలకొకసారి పాలక మండలి సమావేశం జరగాలి. పాలకమండలి మొత్తం అధికారులే.. ఎప్పుడు సమావేశం అవుతున్నారు, ఏ నిర్ణయాలు చేస్తున్నారన్నవి రైతులకు తెలియడం లేదు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 11.30కు డెయిరీ ప్రాంగణంలో జరిగే సమావేశంలో అజెండా కేవలం మూడు, నాలుగు అంశాలను పెట్టినట్లు సమాచారం. వివరాలు లేకుండా 2019-20 వార్షిక లెక్కలు, గడువు ముగిసిన డైరెక్టర్ల తిరిగి నియామకంతో పాటు ప్రస్తుతం జేసీ చేతన్‌ను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా, అదనపు డైరెక్టర్‌గా ఉన్న పాడిసమాఖ్య ఎండీ అహ్మద్‌బాబును డైరెక్టర్‌గా, అలాగే ఎండీగా నియామకానికి సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రతిపాదించారు. అంతవరకు బాగానే ఉన్నా భవిష్యత్‌లో సంస్థ అవసరాల కోసం అన్ని చర్యలు చేపట్టడం ఒప్పందాలు చేసుకోవడం, పత్రాలు సంతకాలు చేయడం తదితర చర్యలకు పాలకమండలి అధికారం కల్పిస్తూ సమావేశం ఆమోదించేలా తీర్మానం ప్రతిపాదించారు. తద్వారా జనరల్‌ బాడీతో అవసరం లేకుండా అధికారులతో కూడిన పాలకమండలి ప్రత్యేకించి అందులో ఉన్న కీలక అధికారులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వ్యవహరించే వీలు కలగనుంది. 


ఎలాగోలా నెట్టుకొస్తున్నా...
నాలుగేళ్లక్రితం వరకు బాగా ఉన్న డెయిరీ అనంతరం సంక్షోభంలో పడగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయూతతో తిరిగి గాడిలో పడింది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా రెండు నెలల క్రితం వరకు రోజువారీ 18వేల నుంచి 20వేల లీటర్ల పాలసేకరణ చేస్తుండటంతో రైతుల్లో డెయిరీ భవిష్యత్‌పై ఎంతో కొంత ఆశ ఉండేది. ప్రభుత్వ పోకడ, జరుగుతున్న పరిణామాలు, అమూల్‌ కార్యకలాపాలు జిల్లాలో ప్రారంభం, ఆ సంస్థ కోసం ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు అన్ని క్రమంగా ఒంగోలు డెయిరీ మనుగడకు ప్రశ్నార్థకం చేసే వైపే పరుగుపెడుతున్నాయి. అమూల్‌ రాకముందు డెయిరీకి 18వేల లీటర్ల వరకు రోజువారీ పాలసేకరణ ఉండగా ప్రస్తుతం అది 4వేలకు పడిపోయింది.  డెయిరీకి సంస్థాగతంగా ఉన్న వనరులు, సౌకర్యాలను అమూల్‌కు లీజుకిచ్చే యత్నాలు గుట్టుగా సాగుతున్నాయన్న ప్రచారం ఉంది.

Updated Date - 2020-12-30T05:45:14+05:30 IST