నీటి సరఫరా నిలిపివేత
ABN , First Publish Date - 2020-10-28T09:45:23+05:30 IST
మండలంలోని చందవరం గ్రామ సమీపంలో నిర్మించిన చందవరం-2 మంచినీటి స్టోరేజీలో పనిచేసే కార్మికులకు 12 నెలలుగా వేతనాలు అందడం లేదు.

వేతనాలు అందక కార్మికుల నిరసన
మూడు రోజులుగా నిలచిన మంచినీటి సరఫరా
దాహార్తితో 132 గ్రామాలు
చందవరం(దొనకొండ), అక్టోబరు 27 : మండలంలోని చందవరం గ్రామ సమీపంలో నిర్మించిన చందవరం-2 మంచినీటి స్టోరేజీలో పనిచేసే కార్మికులకు 12 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో మూడు రోజుల నుంచి నీటి సరఫరా నిలిపేశారు. గ్రామాల్లోని ప్రజల దాహార్తి సమస్యను పరిష్కరించేందుకు చందవరం గ్రామ సమీపంలోని సాగర్ కెనాల్ పక్కన 800 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో చందవరం-2 స్టోరేజీని నిర్మించారు. ఈ స్టోరేజీ నుంచి కనిగిరి మండలం, 1, కొనకనమిట్ల మండలం 58, హనుమంతునిపాడు మండలం 70, పొదిలి మండలం 3 మొత్తం 132 గ్రామాలకు నిత్యం మంచినీటి సరఫరా జరుగుతోంది. కార్మికులు నీటి పంపింగ్ నిలిపి వేయడంతో మూడు రోజులుగా నీటి సరఫరా నిలచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలు అందకపోవడంతోనే...
ఈ స్టోరేజీలో దాదాపు 50 మంది కార్మికులు ప్రజల దాహర్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా నీటి సరఫరా చేస్తున్నారు. ఒకొక్కరికి నెలకు రూ.10 వేలు చెప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. 12 నెలలుగా వేతనం చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. దసరా పండుగ నాటికి వేతనాలు చెల్లిస్తామంటూ కాంట్రాక్టరు పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. పండుగపూట తమ కుటుంబాలు పస్తులుండాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము దసరా పండుగ నాటి నుంచి నీటి పంపింగ్ నిలిపామని వేతనాలు చెల్లించే వరకు పంపింగ్ జరిగేదే లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు పట్టించుకొని తమకు రావాల్సిన వేతనాలు వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించకుంటే 132 గ్రామాల ప్రజలు దాహర్తితో ఇబ్బందులు పడే ప్రమాదం నెలకొంది.
బిల్లులు వచ్చే దెప్పుడు..?
ఈ ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వం కాంట్రాక్టర్ను నియమించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ బిల్లుల మంజూరుతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్ కార్మికులకు నెలనెల వేతనాలు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. 12 నెలల నుంచి ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేదని సమాచారం. దీంతో ఆయన ఆ భారం కార్మికుల మీదకి నెట్టి వేతనం ఇవ్వలేదు. ప్రస్తుతం బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించామని అధికారులు పేర్కొంటున్నారు. ఇక వారికి బిల్లులు వచ్చేదెప్పుడు..? వేతనాలు ఇచ్చేదెప్పడనేది ప్రశ్నార్థకంగా ఉంది.
రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం: విశ్వనాథరెడ్డి, డీఈ, ఆర్డబ్ల్యూఎస్ పొదిలి
చందవరం-2 మంచినీటి స్టోరేజీ పరిధిలో పనిచేసే కార్మికులకు వేతనాలు అందక పంపింగ్ నిలిపివేసిన విషయం నా దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ప్రజల కు మంచినీటి సమస్య కలగకుండా సమస్యను ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడతాం.