సబ్సిడీ..దోపిడీ..!

ABN , First Publish Date - 2020-10-13T08:21:53+05:30 IST

ప్రభుత్వం రైతులకు శనగ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతు భరోసా కేంద్రాల నుంచి వీటి పంపిణీకి సిద్ధమైంది.

సబ్సిడీ..దోపిడీ..!

సబ్సిడీ విత్తనాల్లో మాయాజాలం

రైతుల నుంచి క్వింటా శనగలు

రూ. 4875కు కొనుగోలు

33 శాతం సబ్సిడీ ఇస్తున్నామంటూనే 

రూ. 5250కు పంపిణీ 

విక్రయించిన దానికంటే రూ. 500 

అదనంగా చెల్లించాల్సి వస్తున్న వైనం

క్వింటాకు రూ. 3వేల చొప్పున

జిల్లాలోనే రూ. 23కోట్లు స్వాహా


సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీలో మాయాజాలం నడుస్తోంది. దీని వెనుక దోపిడీ పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక చేత్తో రైతులకు సాయం చేసినట్లే చేసి మరో చేత్తో లాగేసుకుంటోంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా  రైతుల వద్ద క్వింటా రూ. 4875కి కొనుగోలు చేసిన శనగలను రెండు నెలలు తిరక్కుండానే మరో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ సీడ్స్‌ ద్వారా క్వింటా రూ. 8వేలకు విక్రయించడాన్ని బట్టి చూస్తే తిరకాసు అర్థమవుతుంది. అందులో సబ్సిడీపోను రైతు వాటాగా రూ. 5250 చెల్లించాల్సి వస్తోంది. ఇది మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన ధర కన్నా క్వింటాకు రూ. 500 అదనం.  క్వింటాకు 33శాతం సబ్సిడీ అంటే రూ. 3వేలు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఆ ప్రకారం జిల్లాకు కేటాయించిన 77,439 క్వింటాళ్లకు 23.2 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ మేరకు స్వాహా అయినట్లు తేటతెల్లమవుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ. వందల కోట్లు దోపిడీ జరిగినట్లు అర్థమవుతుంది. 


కందుకూరు, అక్టోబరు 12 : ప్రభుత్వం రైతులకు శనగ విత్తనాలను సబ్సిడీపై  ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతు భరోసా కేంద్రాల నుంచి వీటి పంపిణీకి సిద్ధమైంది. జిల్లాకు 77,439 క్వింటాళ్లను కేటాయించింది. అందులో జేజి-1, కాక్‌-2 రకాలు ఉన్నాయి. అయితే వీటికి నిర్ణయించిన ధరను చూసి రైతులు అవాక్కయ్యారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా వారి నుంచి  కొనుగోలు చేసిన ధరకు, ఏపీ సీడ్స్‌ ధరకు క్వింటాకు రూ. 3వేల వరకూ తేడా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. 


మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు 

మూడేళ్లుగా శనగలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొద్ది నెలల క్రితం మార్క్‌ఫెడ్‌ ద్వారా వాటిని కొనుగోలు చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశీ రకమైన జేజి-11, కాబూలీగా పిలిచే కాక్‌-2 క్వింటా రూ. 4875కి సేకరించింది. వాటినే ప్రస్తుతం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా  దాదాపు రెట్టింపు ధరకు విక్రయిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. 


కొనుగోలు క్వింటా రూ. 4875.. విక్రయం రూ. 7875

ప్రభుత్వం పంపిణీ చేసే కాక్‌-2 రకం శనగలు 25 కిలోల బస్తాకు సబ్సిడీ పోను రూ. 1347.50, జేజి-11 రకానికి రూ.1312.50 ధర నిర్ణయించారు. అంటే క్వింటాకు కాక్‌-2 రకానికి, రూ. 5390, జేజి-11 రకానికి రూ. 5250 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రెండు నెలల క్రితం వారు ప్రభుత్వానికి విక్రయించిన ధరతో పోలిస్తే కాక్‌-2 రకానికి క్వింటాకు రూ. 515, జేజి-11 రకానికి రూ.375 అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.


ఇక ప్రభుత్వం చెల్లిస్తున్న 33 శాతం సబ్సిడీ ఎవరి జేబుల్లోకి పోతుందన్న సందేహానికి ఎక్కడా సమాధానం దొరకడం లేదు. శనగలను విత్తన సంచుల్లోకి మార్చే క్రమంలో తాలు గింజలు, పుల్లను తొలగించటం, విత్తన శుద్ధి, ప్యాకింగ్‌, రవాణా ఖర్చులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా క్వింటాకు రూ. 500కి మించవని ఆ మేరకు రైతు అదనంగా చెల్లిస్తున్నందున ఇక 33 శాతం సబ్సిడీ ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం సబ్సిడీ విత్తనాలకు రైతు వాటాగా చెల్లిస్తున్న మొత్తానికి ఆయా రకాల శనగలు బహిరంగ మార్కెట్లో కూడా లభిస్తుండటం విశేషం.


సబ్సిడీ వల్ల ప్రయోజనం శూన్యం 

సబ్సిడీ శనగ విత్తనాల పట్ల రైతులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వమే సేకరించిన శనగలు రెండు నెలలు తిరగకుండానే క్వింటాకు రూ. 3వేల వరకూ ధర పెరిగిపోవటంలోని మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 90వేల హెక్టార్ల వరకూ శనగ సాగవుతుందని అంచనా వేస్తున్న అధికారులు 77,439 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. అందులో జేజి-11  రకం  54,527  క్వింటాళ్లు,  కాక్‌-2 రకం 22,912 క్వింటాళ్లు ఉన్నాయి.


మార్క్‌ఫెడ్‌ తమ నుంచి కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే కాగ్‌-2 రకానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 3200, జేజే-11 రకానికి రూ.3వేలు అదనంగా ఉంది. ఈ లెక్కన చూస్తే జిల్లాలో సిద్ధం చేసిన 77,439 క్వింటాళ్లకు ప్రభుత్వం రూ. 23.2 కోట్లు సబ్సిడీగా ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం దోచుకున్నట్లేనన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు

Updated Date - 2020-10-13T08:21:53+05:30 IST