వండకుండానే మండుతున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-10-07T07:37:33+05:30 IST

పప్పుతిందామన్న కోరిక చచ్చిపోయింది. టమాటా సహా ఏమీ కొనేట్టు లేదు. ఆకు కూర కట్ట పది రూపాయలు పలుకుతోంది.

వండకుండానే మండుతున్నాయ్‌!

ప్పులతో పోటీపడుతున్న కూరగాయలు

క్యారెట్‌ కిలో రూ. 100

భయపెడుతున్న బెండ, బీన్స్‌

మంట పుట్టిస్తున్న పచ్చిమిర్చి

ఏది కొనాలన్నా పావుకిలో రూ. 15పైనే 

మరింత ఘాటెక్కిన ఉల్లి 

రూ. 100 దాటిని కందిపప్పు, మినపగుళ్లు

బెంబేలెత్తిపోతున్న సామాన్యులు 

ప్రేక్షకపాత్రకే పరిమితమైన 

ధరల నియంత్రణ కమిటీ 


కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలపై ధరలు దరువేస్తున్నాయి. పప్పులు, కూరగాయలు వండకుండానే మండిపోతున్నాయి. క్యారెట్‌ వందకు చేరి కొనలేని పరిస్థితి ఏర్పడింది. పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. బీర, బీన్స్‌ భయపెడుతున్నాయి. టమాటా, దోస, బెండ, వంగ ఏదైనా పావు కిలో పది రూపాలపైనే పలుకుతున్నాయి. ఆకు కూరల ధరలు సైతం అదిరిపోతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.ఇక కందిపప్పు 20 రోజుల వ్యవధిలో రూ. 20 పెరిగి రూ. 100కి చేరింది. ప్రతి వంటలోనూ వినియోగించే ఉల్లిపాయ ధర 35 నుంచి 60కు చేరి కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. దీంతో పేదలు పచ్చడిమెతుకులతో సరిపెట్టుకుంటున్నారు. మధ్య తరగతి వారు పావుకిలోలు తప్ప కిలోలు కొనడం పూర్తిగా మరిచారు. 


ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబర్‌ 6 : పప్పుతిందామన్న కోరిక చచ్చిపోయింది. టమాటా సహా ఏమీ కొనేట్టు లేదు. ఆకు కూర కట్ట పది రూపాయలు పలుకుతోంది. పప్పులు పేలిపోతుండగా, వాటితో పోటీ పడి కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.


  గత కొద్ది రోజుల క్రితం వరకు వర్షాలు లేక పంటలు పండలేదని ధరలు పెంచిన వ్యాపారులు, ఇప్పుడు అధిక వర్షాలను సాకుగా చూపి ఎడాపెడా వాత పెడుతున్నారు. ఇప్పటి వరకూ రూ. 100 తీసుకొని మార్కెట్‌కు వెళితే కనీసం నాలుగు రకాల కూరగాయలతో ఇంటికొచ్చే వారు ఇప్పుడు రెండు రకాలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. 


పచ్చిమిర్చి ధర కిలో రూ. 60కి చేరి మంట పుట్టిస్తోంది. టమాటా రూ. 60 నుంచి కిందకు దిగిరానంటోంది. బీర రూ. 90కు చేరుకొని భయపెడుతుండగా, 20 రోజుల క్రితం కిలో రూ. 60 ఉన్న బీన్స్‌ ఇప్పుడు రూ. 90 పలుకుతోంది. క్యారెట్‌ 20 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 40 పెరిగి రూ. 100కి చేరి క్యా రేట్‌ అనిపిస్తోంది. కిలో రూ. 20 ఉన్న గోరుచిక్కుడు ఇప్పుడు కిలో రూ. 50కు అమ్ముతున్నారు. పెద్ద చిక్కుళ్లు కిలో రూ. 100కి చేరింది. పొట్లకాయ కిలో రూ. 35, అరటి కాయ ఒకటి రూ. 10, సొరకాయ ఒకటి రూ. 35, చామదుంప కిలో రూ. 35, కీర దోస రూ. 60కు విక్రయిస్తున్నారు. దీంతో పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 


అదిరిపోతున్న ఆకు కూరలు

ఆకు కూరలు కొనుగోలు చేద్దామన్నా వాటి ధర కూడా అదిరిపోతోంది. కట్ట ఒకటి రూ. 10 పలుకుతోంది. కొత్తిమీర కట్ట గతంలో రూ. 20 నుంచి ప్రస్తుతం రూ. 50కు పెరిగింది. ఇక కూరగాయలు కొంటే ఉచితంగా ఇచ్చే కరివేపాకుకు కనీసం రూ. 10 వసూలు చేస్తున్నారు. ఇకపోతే  20 రోజుల క్రితం వరకూ కిలో రూ. 80 అమ్మిన ఓ మోస్తరు క్వాలిటీ కంది పప్పు ధర ఇప్పుడు రూ. 100కు చేరుకుంది. మినపగుళ్లు రూ. 80 నుంచి 120కి చేరాయి. ఇదిలా ఉండగా ఉల్లి ధర మరింత ఘాటెక్కింది. రోజురోజుకూ పెరిగిపోతూ ప్రస్తుతం కిలో రూ. 60కి చేరింది.  దీంతో ఏం కొంటాం, ఏం తింటాం అని పేదలు నిట్టూరుస్తున్నారు. 


పట్టించుకోని ధరల నియంత్రణ కమిటీ

పెరుగుతున్న ధరల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ అదుపుతప్పుతున్న ధరల కట్టడికి తీసుకుంటున్న చర్యలు శూన్యమయ్యాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ధరల నియంత్రణ కమిటీ దీనిపై దృష్టి సారించి నిత్యావసరాలు, కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-10-07T07:37:33+05:30 IST