సచివాలయాల పర్యవేక్షణకు నోడల్ అధికారులు
ABN , First Publish Date - 2020-10-04T10:10:22+05:30 IST
సచివాలయాల్లో పౌరసేవలు సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్, జేసీ స్థాయి ఉన్నతాధికారులు ప్రతినెలా సచివాయాలను తనిఖీలు చేయాలని అదేశించింది.
మండలానికి ఒకరు నియామకం
కలెక్టర్, జేసీల తనిఖీలకు ప్రభుత్వ అదేశం
ఎంపీడీవో, ఈవోఆర్‌డీ నిరంతర పర్యవేక్షణ
ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : సచివాలయాల్లో పౌరసేవలు సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్, జేసీ స్థాయి ఉన్నతాధికారులు ప్రతినెలా సచివాయాలను తనిఖీలు చేయాలని అదేశించింది. అదే సమయంలో వాటిపై పర్యవేక్షణ మరింత పెంచేందుకు మండలానికి ఒక నోడల్ అధికారిని కలెక్టర్ నియమించారు. కేవలం జిల్లా స్థాయి అధికారులు, అందులోనూ సచివాలయ సేవలకు సంబంధించిన ప్రధాన శాఖల వారికే ప్రాధాన్యం ఇచ్చారు.
గత ఏడాది అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. గ్రామాల్లో ప్రతి రెండువేలు, పట్టణాల్లో ఐదువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 544 సేవలు వీటి ద్వారా అందించాలన్నది లక్ష్యం కాగా అందులో పదిశాతం కూడా ఇంకా అమలు కావడం లేదు. వాటిని అందించడంలోనూ సచివాయాల పనితీరు సరిలేదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అనేక సచివాలయాల్లో సిబ్బంది పర్యవేక్షణ, సమన్వయం అంతంతమాత్రమే అయ్యింది.
క్షేత్రస్థాయిలో రాజకీయ పెత్తనం కూడా అధికంగా ఉండటంతో వ్యవస్థ అంతా గందరగోళంగా వరిఇంది. ఈ నేపథ్యంలో సచివాయాలపై పర్యవేక్షణ పెంపు, పౌరసేవల విస్తృతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. నెల,నెలా కలెక్టర్ కనీసం రెండింటిని, జేసీలు ఒక్కొక్కరు నాలుగేసి సచివాలయాలను తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో కలెక్టర్ పోలా భాస్కర్ వారం క్రితం తనిఖీలు చేపట్టి పలు లోపాలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో వాటిపై పర్యవేక్షణ పెంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. జిల్లా అధికారిగా ఉన్న వారిని ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ప్రతినెలా సచివాలయాలను తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని వారిని ఆదేశించారు. ఇప్పటి వరకూ మండలాల్లో సగం సచివాలయాలను ఎంపీడీవోలు, మిగిలిన సగం ఈవోఆర్డీలు పర్యవేక్షిస్తుండగా దాన్ని నిరంతరం కొనసాగించాల్సి ఉంటుంది.