-
-
Home » Andhra Pradesh » Prakasam » once again lock down in Prakasham district
-
మళ్లీ లాక్ పడింది.. ఆ జిల్లాలో సగం ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు
ABN , First Publish Date - 2020-06-22T20:12:02+05:30 IST
జిల్లాలో కరోనా తొలినాళ్లనాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి అప్పట్లో ప్రభుత్వాలు అమలు చేసిన లాక్‌డౌన్ తిరిగి అమల్లోకి వచ్చింది.

ప్రకాశం జిల్లాలోని సగం ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు
ఒంగోలు, చీరాలలోపూర్తిస్థాయిలో అమలు
మూతపడిన దుకాణాలు, నిలిచిన వ్యాపారాలు
జనసంచారం నియంత్రణ
ఒంగోలు (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా తొలినాళ్లనాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి అప్పట్లో ప్రభుత్వాలు అమలు చేసిన లాక్‌డౌన్ తిరిగి అమల్లోకి వచ్చింది. జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ఏదో ఒక స్థాయిలో ఆంక్షలు ఉంటున్నాయి. చీరాలలో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించగా, ఒంగోలులో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆయా ప్రాం తాల్లో జనసంచారం, వాహనాల రాకపోకలపై నియంత్రణ పెరగ్గా దుకాణాలు మూతపడి వ్యాపారాలు నిలిచిపోయాయి. జిల్లాలో గత వారం, పదిరోజులుగా కరోనా ఉధృతి అధికంగా ఉంది. లాక్‌డౌన్ సడలింపులకు ముందు గతనెలాఖరు వరకు వంద లోపుగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే సడలింపుల అనంతరం ప్రత్యేకించి వారం, పదిరోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ సెంచరీని దాటాయి. ఒంగోలు నగరం, చీరాల పట్టణంలో ఆందోళన కలిగించే రీతిలో కేసులు బయటపడుతుండగా, ఆయా మండలాల్లోని ఆనేక గ్రామాల్లో నిత్యం వెలుగు చూస్తున్నాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్ వైపు యంత్రాంగం మొగ్గు చూపింది. పాజిటివ్ కేసులు నమోదైన మూడొంతుల మండలాల్లోని కంటైన్‌మెంట్ జోన్లను పూర్తిగా నిర్బంధించారు. ఆ పరిధిలో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేశారు. ఒంగోలు, చీరాల పట్టణాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించారు.
ఒంగోలులో ఆంక్షలు అమలు
ఒంగోలులో ఆదివారం నుంచి లాక్‌డౌన్ అమలులోకి రాగా ఉదయం 6 నుంచి 9గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటి అమ్మకాలకు అనుమతించారు. ఇతర దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటినీ మూసివేయించారు. ఆసుపత్రులు, మె డికల్ షాపులు, పెట్రోలు బంకులు మాత్రమే పనిచేశాయి. కాగా శివారుప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి రాకపోకలను నియంత్రించగా నగరంలోని ప్రధాన రోడ్లలోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. జనసంచారం, వాహనాల రాకపోకలను అదుపు చేశా రు. చీరాలలోనూ ఇలాగే కొనసాగింది. దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, పొదిలి పట్టణాలు, మరికొన్ని మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కూడా పాక్షికంగా లాక్‌డౌన్ అమలవుతోంది.
నేడు చీరాల సంపూర్ణ లాక్‌డౌన్
కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా చీరాల పట్టణంలో సోమవా రం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, మెడికల్ షాపుల సహా అన్ని దుకాణాలూ మూసి ఉంటాయని మున్సిపల్ అధికారులు తెలిపారు.