గట్టెక్కినట్టేనా..!

ABN , First Publish Date - 2020-05-08T09:35:41+05:30 IST

జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం లేదు. ఈనెల 2వ తేదీన ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు

గట్టెక్కినట్టేనా..!


జిల్లాలో కొత్తగా నమోదు కాని పాజిటివ్‌ కేసులు

పాజిటివ్‌ రోగుల్లో అందరూ కోలుకున్నట్లే

ఒక్కరు తప్ప అందరూ  ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

గురువారం ఎనిమిది మంది ఇంటికి..


ఒంగోలు(ప్రకాశం): జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం లేదు. ఈనెల 2వ తేదీన ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ కేసుతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 61చేరగా ఆ తర్వాత జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో మాత్రమే కాదు.. ట్రూనాట్‌ మీద కూడా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవటం గమనార్హం. కాగా గతనెల 29వ తేదీన ఒకేసారి 4 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అప్పటివరకు 56గా ఉన్న పాజిటివ్‌ కేసులు గత నెల 29కి 60కి చేరాయి. అయితే ఈనెల 2 నుంచి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోగా ప్రతిరోజూ వందలసంఖ్యలో వస్తున్న శ్వాబ్‌ల పరీక్షల ఫలితాలు కూడా నెగటివ్‌ రిపోర్టులే వస్తున్నాయి. దీంతో ఇక గండం గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు.


ఇక పాజిటివ్‌ కేసులు వచ్చినా పెద్దసంఖ్యలో రాకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఉన్న వీఆర్‌డీఎల్‌ ల్యాబొరేటరీ, గుంటూరు, విజయవాడ నగరాల్లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ నుంచి ప్రతిరోజు వందలసంఖ్యలోనే శ్వాబ్‌ల ఫలితాలు వస్తున్నాయి. అవి నెగటివ్‌ రిపోర్టులే వస్తున్నాయి. వారంరోజుల క్రితం వరకు ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అయ్యేవి. అయితే ప్రస్తుతం ట్రూనాట్‌ మిషన్లపై చేస్తున్న ఫలితాలు కూడా నెగటివ్‌లే వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా ఉధృతి బాగా తగ్గిందనే అభిప్రాయం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో అనుమానిత రోగుల నుంచి ఎప్పటికప్పుడు శ్వాబ్‌లను సేకరించటం ఈ శ్వాబ్‌లను వెంటనే రిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబొరేటరీలో పరీక్ష చేసి నిర్ధారించుకుంటున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ రోగులతో కలిసి ఉన్న వారి శ్వాబ్‌లను మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకుంటున్నా పాజిటివ్‌  ఫలితాలు మాత్రం రావటం లేదు. దీంతో ఇక గట్టెక్కినట్లేనని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.


కష్టం అనుకున్న వారంతా కోలుకున్నారు

జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసులు మార్చి 19న నమోదైంది. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌ యాత్రికుల విషయం వెలుగులోకి వచ్చింది. చీరాల ప్రాంతం నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చినవారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చీరాల ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కూడా కరోనా తేలింది. ఆ తర్వాత ఒంగోలు ఇస్లాంపేటలో ఆందోళన కలిగించే రీతిలో కేసులు వెలుగు చూశాయి. ఈనెల 2వతేదీ వరకు పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ 61కేసుల్లో 10మంది పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని వైద్యులు భావించారు.


వీరికి ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉండటంతో వీరి విషయమై కాస్తంత వైద్యులే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నెల్లూరులోని ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రికి తరలించేశారు. అయితే జిల్లాలో పాజిటివ్‌గా నిర్ధ్దారణ అయిన 61 మందిలో 60మంది పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఒకరు కూడా త్వరలోనే కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఎనిమిది మందిని రిమ్స్‌, కిమ్స్‌ నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో జిల్లాలోని కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందిలేకుండానే గండం గట్టెక్కగలిగామనే ఆత్మ సంతృప్తిలో ఇటు జిల్లా యంత్రాంగం అటు వైద్యులు ఉన్నారు. Updated Date - 2020-05-08T09:35:41+05:30 IST