పని నష్టం.. భృతి కష్టం..

ABN , First Publish Date - 2020-12-04T05:19:17+05:30 IST

చీరాల చేనేతల పుట్టిల్లు. సృజనాత్మకత వారి సొంతం. ఇలా అనేక ప్రాసలతో కూడిన వాక్యాలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు చేనేత రాగం ఆలపిస్తుంటారు. అయితే వారికి కష్టం వచ్చినపుడు మాత్రం ముఖం చాటేస్తున్నారు.

పని నష్టం.. భృతి కష్టం..
వర్షాలకు తడిచి ఆగిన మగ్గాలు

వర్షాలకు ఆగిన మగ్గాలు..తడిసి దెబ్బతిన్న నూలు

పనిలేక పస్తులు తప్పవంటున్న చేనేత కార్మికులు

బియ్యం, కిరోసిన్‌  అందించాలని వినతి

తడిసిన ఎంట్లుకు పరిహారం అందజేయాలని వేడుకోలు

నేతన్నలకు నష్టం నామమాత్రం అంటున్న అధికారులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేనేత కార్మిక సంఘ నేతలు


చేనేతలు ఆకలికేకలు పెడుతున్నారు. అయినా హ్యాండ్లూమ్‌ అధికారులకు కనికరం కలగడం లేదు. నివర్‌ తుఫాన్‌కు ముందు నుంచే మంగు వాతావరణం ఉంది. దానికి తోడు నివర్‌ ప్రభావంతో నాలుగురోజుల పాటు తెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మగ్గాలు మూగబోయాయి. ఒరుపు వాతావరణం లేకపోతే పోగు అతకదు, పని సాగదు. పనిలేకుంటే భృతికి కష్టం. దీంతో బతికేదెలా అని సగటు చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తుఫాన్లు ముంచుకొస్తున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు పనులు లేకుండా ఉండాలనే ఆలోచనతో కుదేలవుతున్నారు. తక్షణ సాయంగా మగ్గం ఉన్న ప్రతిఒక్కరికి బియ్యం, కిరోసిన్‌ అందించి, తర్వాత నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. కాగా వారి స్థితిగతులను పరిశీలించి వాస్తవ నివేదికలు అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో చేనేతల స్థితిగతులను పరిశీలించిన అధికారులు నష్టం పెద్దగా లేదంటూ తేల్చడంపై చేనేతసంఘాల నేతలు మండిపడుతున్నారు. 

చీరాల, డిసెంబరు 3 : చీరాల చేనేతల పుట్టిల్లు. సృజనాత్మకత వారి సొంతం. ఇలా అనేక ప్రాసలతో కూడిన వాక్యాలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు చేనేత రాగం ఆలపిస్తుంటారు. అయితే వారికి కష్టం వచ్చినపుడు మాత్రం ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో సింహభాగం మగ్గాలు చీరాల నియోజకవర్గంలోనే ఉన్నాయి. నివర్‌ తుఫాన్‌కు ముందు నుంచి కొన్నిరోజుల వరుస వర్షాలు కురిశాయి. ఆ తరువాత మంగు వాతావరణం ఉంది. మొత్తం గత నెలరోజులుగా చేనేత మగ్గాలు కనీసం పదిరోజులు కూడా పూర్తిస్థాయిలో పనిచేసి ఉండవు. ఈ క్రమంలో పని లేకుంటే రోజువారీ చేనేత కార్మికులకు భృతి కష్టమవుతుంది. రోజువారీ కూలీతో జీవనం సాగించేవారు అధికంగా ఉన్నారు. ఇప్పటికే అరకొర అప్పులు చేసి భృతి సాగిస్తున్నారు. ప్రస్తుతం నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో కొందరికి చెందిన ఎంట్లు, మగ్గాలపై ఉన్న నూలు, సగంలో ఉన్న నేత వస్త్రాలు తడిశాయి. 

భయపెడుతున్న రెండు తుఫాన్‌లు

ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు తుఫాన్లు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో చేనేతకార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బురేవి తుఫాన్‌ ప్రభావం చూపుతుండగా, ఈనెల 7వ తేదీన కూడా మరో ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే పనులు లేక అప్పులపాలవుతున్నామని మరో పది, 15 రోజులు పనులు లేకుండా తమ జీవనం ఎలా కొనసాగించాలని ఆవేదన చెందుతున్నారు. తక్షణ సాయంగా బియ్యం, కిరోసిన్‌ పంపిణీ చేయాలని, తర్వాత నష్టపోయిన ప్రతిఒక్కరికీ పరిహారం అందజేయాలని వేడుకుంటున్నారు. అయితే నష్టం నామమాత్రమేనని దానికి పరిహారం అందదని హ్యాండ్లూమ్‌ అధికారులు చెప్తుండటంతో నేతన్నలు బిక్కముఖం వేస్తున్నారు. వర్షాలకు చేనేత రంగంలోను, ఉప వృత్తుల్లో పనిచేసే వారికి ఏ మేరకు నష్టం వాటిల్లింది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికలు తయారుచేయాలని సంబంధిత శాఖ అధికారులను విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. 

మగ్గాలను పరిశీలించిన నేతలు

నివర్‌ తుఫాన్‌ నేపఽథ్యంలో కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడిన చేనేతలను నేతలు కలిసి పరామర్శించారు. దేవాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బీరక సురేంద్ర, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, హ్యాండ్లూమ్‌ అధికారులు పాతచీరాల, కొత్తపేట తదితర ప్రాంతాల్లో మగ్గాలను పరిశీలించి వారి సాధకబాధలను తెలుసుకున్నారు. ఆ తరువాత హ్యాండ్లూమ్‌ అధికారులు సర్వే చేశారు. అయితే ఎలాంటి నష్టం లేదని వారు చెప్పటంతో నేత్నలు ఆందోళన చెందుతున్నారు.Updated Date - 2020-12-04T05:19:17+05:30 IST